యూట్యూబర్లూ బీ కేర్‌పుల్: నటుడికి, ఆయన భార్యకు సెబీ షాక్
సాక్షి, ముంబై: షేర్ మార్కెట్ , స్టాక్ సంబంధిత అంశాలపై తప్పుడు సమాచారంతో మోసం చేస్తున్న యూ ట్యూబర్లకు మార్కెట్ రెగ్యులేటరీ సెబీ భారీ షాకిచ్చింది. సోషల్ మీడియా ద్వారా మార్కెట్ మానిప్యులేషన్‌కు పా ల్పడుతున్న సాధన బ్రాడ్కాస్ట్ ప్రమోటర్లతో సహా, 31 యూట్యూబర్లను గురువారం బ్యాన్ చేసింది. అనేక ఫిర్యాదుల నేపథ్యంలో సెబీ ఈ చర్య తీసుకుంది. అమాయక పెట్టుబడిదారులను మోసంచేస్తూ యూట్యూబర్లు కుమ్మక్కయ్యారని మండిపడింది.
ముఖ్యంగా యూట్యూబ్‌లో తప్పుదోవ పట్టించే వీడియోలను అప్లోడ్ చేయడం ద్వారా సాధనా బ్రాడ్కాస్ట్ షేర్లను మానిప్యులేట్ చేశారంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీపై సెబీ కఠిన చర్యలు తీసుకుంది. అర్షద్ వార్సీ, అతని భార్య మరియా గోరెట్టిని కూడా మార్కెట్లో ట్రేడింగ్ చేయకుండా సెబీ నిషేధించింది.
అర్షద్ వార్సీ రూ.29.43 లక్షలు, ఆయన భార్య రూ.37.56 లక్షల లాభం ఆర్జించారని సెబీ పేర్కొంది. అంతేకాదు ఆయా సంస్థలనుంచి రూ. 41.85 కోట్ల అక్రమ లాభాలను రెగ్యులేటర్ స్వాధీనం చేసుకుంది. షేర్ పంప్ అండ్ డంప్ స్కీమ్‌లో అర్షద్‌తో సహా 45 మంది యూట్యూబర్లను సెబీ దోషులుగా గుర్తించింది. నిందితుడు అర్షద్ వార్సీతో సహా చాలా మంది యూట్యూబర్లు పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించడం ద్వారా వారి వాల్యూమ్‌ను పెంచుతున్నారని తద్వారా ప్రతి నెలా రూ.75 లక్షల వరకు సంపాదిస్తున్నారని సెబీ తెలిపింది.
యూట్యూబ్ క్రియేటర్లతో కలిసి స్టాక్లను షార్ప్‌లైన్ బ్రాడ్కాస్ట్ షేర్ల మానిప్యులేషన్స్‌కు పాల్పడుతున్నారంటూ 24 ఎంటిటీలను కూడా స్టాక్ మార్కెట్ నుండి సెబీ నిషేధించింది. షార్ప్‌లైన్ బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ స్క్రిప్‌లో ఏప్రిల్ నుండి ఆగస్టు 2022 వరకు తప్పుడు వాల్యూమ్లకు దారితీసిందనీ, దీంతో కొంతమంది వాటాదారులు భారీ లాభాలను బుక్ చేసుకున్నారని , ఇది ట్రేడ్ ప్రాక్టీస్ నిబంధనల ఉల్లంఘన అని పేర్కొంది.
సాధనా బ్రాడ్‌కాస్ట్‌కి సంబంధించి ఏప్రిల్ 27, 2022 నుండి సెప్టెంబర్ 30, 2022, షార్ప్‌లైన్ బ్రాడ్కాస్ట్ ఏప్రిల్ 12, 2022 నుండి ఆగస్టు 19, 2022 మధ్య లావాదేవీలను సెబీ విచారించింది. సెబీ తన రెండు మధ్యంతర ఉత్తర్వుల్లో, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నేరస్తులందరినీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ విధంగానైనా సెక్యూరిటీలను కొనుగోలు చేయడం, విక్రయించడం లేదా డీల్ చేయకుండా నిరోధించింది.
అలాగే ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ డెరివేటివ్ కాంట్రాక్ట్‌లలో వారు ఏదైనా ఓపెన్ పొజిషన్లు ఉంటే ఈ ఆర్డర్ తేదీ నుండి లేదా అటువంటి కాంట్రాక్టుల గడువు ముగిసే మూడు నెలలలోపు, ఏది ముందుగా అయితే, అటువంటి పొజిషన్లను మూసివేయవచ్చు/స్క్వేర్ ఆఫ్ చేయాలని కూడా ఆదేశించింది.
కాగా సెబీ చాలా కాలంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లను నియంత్రించేందుకు సిద్దమవుతోంది. రెండేళ్ల క్రితమే ఈ విషయంలో నిబంధనల రూపకల్పన కసరత్తు మొదలైంది.