Manjudevi
-
నెంబర్ 1 అమ్మ
బిడ్డను తల్లి తొమ్మిది నెలలు కడుపులో మోస్తుంది. చూసే వాళ్లకే భారంగా అనిపించే క్షణాలను కూడా తల్లి సంతోషంగానే భరిస్తుంది. జైపూర్‌లోని మంజుదేవి ముగ్గురు పిల్లల తల్లి. ముగ్గురు పిల్లలను కనడానికి ఇరవై ఏడు నెలలు మోసింది. ఇప్పుడు వాళ్లను పోషించడానికి కొన్నేళ్లుగా బరువులు మోస్తోంది. జైపూర్ రైల్వే స్టేషన్లో కూలీగా ప్రయాణికుల పెట్టెలు మోస్తూ పిల్లల్ని బతికించుకుంటోంది. వాయవ్య రైల్వే జోన్లో తొలి మహిళా కూలీ మంజుదేవి. ఈ ఏడాది రాష్ట్రపతి నుంచి పురస్కారం అందుకున్న 112 మంది సాధికార మహిళల్లో మంజుదేవి కూడా ఒకరు. జీవితానికి రెడ్ సిగ్నల్! మంజుదేవి భర్తతో కలిసి జైపూర్‌లో నివసించేది. ఆమె భర్త జైపూర్ రైల్వే స్టేషన్లో లైసెన్స్ ఉన్న పోర్టర్. మంజుదేవి ఏమీ చదువుకోలేదు. చదువు రాకపోవడం వల్ల అప్పటి వరకు ఆమెకు ఎటువంటి ఇబ్బంది కూడా ఎదురవలేదు. పెద్ద పెద్ద కోరికలు, ఆశలు లేకపోవడంతో భర్త సంపాదనతో కాపురం హాయిగా గడిచినంత కాలం గడిచిపోయింది. ఏ కష్టమూ లేకపోతే జీవితం జీవితమే కాదని నిరూపించడానికా అన్నట్లు పదేళ్ల క్రితం భర్త మహదేవ్ అనారోగ్యంతో మంచం పట్టి, మరణించాడు. మంజుదేవికి భర్త తోడు లేని జీవితం ఊహకు కూడా అందలేదు. కానీ ‘నువ్వు ఒక భర్తకు భార్యవు మాత్రమే కాదు, ముగ్గురు బిడ్డలకు తల్లివి కూడా’ అంతరాత్మ హెచ్చరించింది. కూలీగా.. గ్రీన్ సిగ్నల్ భర్త నుంచి వారసత్వంగా మణులు రాలేదు, మాన్యాలూ రాలేదు. అతడికి ఉన్నది, అతడి నుంచి ఆమె చేతికి వచ్చిందల్లా రైల్వే పోర్టర్ లైసెన్స్ మాత్రమే. ఆ లైసెన్స్‌తో అధికారుల దగ్గరకు వెళ్లింది. అనుమతిస్తే సామాన్లు మోసి పిల్లల ఆకలి తీర్చుకుంటానని మొర పెట్టుకుంది. అధికారులు స్పందించి భర్త పేరు మీద ఉన్న లైసెన్స్‌ను ఆమె పేరు మీద మార్చి ఇచ్చారు. ఆ లైసెన్స్‌తోపాటు ఆమెకు నార్త్‌వెస్టర్న్ రైల్వేస్‌లో తొలి మహిళా కూలీ అనే గుర్తింపు కూడా ఆమెకు ఏ మాత్రం తెలియదు. ఆమెకు తెలిసిందల్లా పిల్లలను పోషించుకోవడానికి ఒక పని కావాలి, భర్త పని చేసిన చోట అయితే తోటివాళ్లు తనకు రక్షణగా ఉంటారు.. అంతే. ఆమె ఊహించింది కూడా నిజమే. చదవడం రాని ఆమెకు తోటి మగ పోర్టర్లు అండగా నిలిచారు. ప్లాట్‌ఫామ్ నంబర్లు, రైళ్ల పేర్లు, నంబర్లు, బోగీ వివరాలపై ఆత్మీయంగా అవగాహన కల్పించారు. దేవుడిచ్చిన లైసెన్స్ దేవుడికి పూజలు, ప్రార్థనలు చేస్తే మంచి జరుగుతుందో లేదో తెలియదు. మంచి జరుగుతుందన్నా కూడా అవన్నీ చేసే ఖాళీ కూడా ఉండదు. మంజుదేవికి తెలిసింది పనిని మించిన దైవం లేదని మాత్రమే. రోజూ ఇంట్లో పని ముగించుకుని పోర్టర్ డ్యూటీ కోసం కుట్టించుకున్న కుర్తా, నల్ల పైజామా ధరించి, ‘నార్త్‌వెస్ట్ రైల్వే జైపూర్ నంబర్ 15’ లైసెన్స్‌ను కళ్లకు అద్దుకుని చేతికి కట్టుకుంటుంది. పనికి బయల్దేరుతుంది. కుదరదంటే ఒప్పుకోరు! పోర్టర్‌గా తాను తెలుసుకోవలసినవన్నీ పద్ధతిగానే నేర్చుకుంది మంజుదేవి. అయితే కొందరు ప్రయాణికులు మెట్లెక్కి వెళ్లడానికి బద్దకించి ట్రాక్‌కు అడ్డంగా దాటి వెళ్తుంటారు. వాళ్లు వెళ్లడమే కాకుండా తమ సామాన్లను కూడా తమతోపాటే తెమ్మంటారు. ‘ప్లాట్‌ఫామ్ మీద నుంచి ట్రాక్ మీదకు దిగడం, అడ్డంగా దాటటం తప్పని తెలుసు. కానీ అలా కుదరదంటే ఒప్పుకోరు, ఇంకా మాట్లాడితే పని చేజారిపోతుంది. వచ్చే డబ్బు రాకుండా పోతుంది. ఆ భయంతో అలాగే ట్రాక్ దాటి సామాన్లు తీసుకుపోతుంటాను’ అని చెప్తారు మంజుదేవి. మనిషి బరువు ముప్పై.. మోసే బరువూ ముప్పై ‘నా బరువు ముప్పై కిలోలు. నేను మోసే సూట్‌కేసుల బరువు కూడా ముప్పై కిలోలు ఉంటుంది. అయితే అదేమీ కష్టంగా ఉండదు. ఎందుకంటే నేను మోసే బరువు నా బిడ్డల కోసమే కదా. బిడ్డల బరువు తల్లికి భారం కాదు. ఈ ఉద్యోగంతో పిల్లలను చదివించుకోగలుగుతున్నాను. అందుకే నా పని నాకు దైవంతో సమానం’ అని రాష్ట్రపతి భవన్లో పురస్కారం అందుకున్నప్పుడు మంజుదేవి చెప్పిన మాటలివి. పిల్లల కోసం ‘తల్లి మాత్రమే’ అనగలిగిన గొప్ప మాట ఇది. – మంజీర -
కూలీ నెం.15
ఆడపిల్లలు ఇలాగే ఉండాలి! ఈ పనులే చేయాలి! తరతరాలుగా ఈ మాటలు వింటూనే ఉన్నాం. ఆ ప్రకారం నడచుకుంటూనే ఉన్నాం. కానీ తరం మారింది. అవసరాలు మారుతున్నాయి. మరి ఆలోచనలూ మారాలి కదా! ఇదే ప్రశ్న వేసుకుంది మంజూదేవి. అనుకోకుండా జరిగిన ఓ సంఘటన తన జీవితాన్ని అల్లకల్లోలం చేస్తే... తప్పనిసరి పరిస్థితుల్లో సాహసోపేతమైన ఓ అడుగు వేసింది. ఏ మహిళా చేయని, చేయడానికి సాహసించని వృత్తిలో అడుగుపెట్టింది. దానిని సమర్థంగా నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఎంతోమందికి ప్రేరణగా, స్ఫూర్తిగా నిలుస్తోంది! మంజూదేవికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. తన సంపాదనతో వాళ్లని చదివిస్తోంది. ఆమె అంటుంది... ‘ఎవరో ఆదుకోవాలని ఎదురు చూడటం కంటే... గౌరవంగా మనకు తోచిన పని మనం చేసుకోవడం ఉత్తమం’ అని! జైపూర్ రైల్వేస్టేషన్‌కి వెళ్లినవాళ్లకు ఓ అరుదైన దృశ్యం కనబడుతుంది. ఎర్రటి చొక్కాలు వేసుకుని, బ్యాడ్జిలు పెట్టుకుని, వరుసగా ఉన్న కూలీల మధ్య ఓ యువతి కనిపిస్తుంది. ఆమె వేసుకున్న దుస్తులు ఆమె కూడా రైల్వే కూలీ అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నా... నమ్మడానికి మాత్రం మన కళ్లు, మనసు ససేమిరా అంటాయి. ఎందుకంటే... కూలీ అంటే మనకు తెలిసి మగవాళ్లే. రైల్వేస్టేషన్లో, బస్టాపుల్లో లగేజీలు మోసేది వాళ్లే. అలాంటిది ఓ ఆడమనిషి ఆ పని చేస్తోందంటే ఆశ్చర్యం వేయక మానదు. పాపం ఎంత కష్టం వచ్చిందో అని జాలి వేయకా మానదు. నిజమే... ఆమెకి చాలా పెద్ద కష్టం వచ్చింది. అందుకే మహిళలు కలలో కూడా ఊహించని ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. సున్నితమైన చేతులతో బరువులు ఎత్తాల్సి వస్తోంది. ఆమె పేరు మంజూదేవి. జైపూర్‌లోనే కాదు... నార్త్ వెస్టర్న్ రైల్వేస్‌లోనే మొట్టమొదటి మహిళా కూలీ! విధిరాతకు తలవంచి... జైపూర్‌లోని సుందర్పురాలో భర్త, ముగ్గురు పిల్లలతో జీవించేది ముప్ఫై నాలుగేళ్ల మంజూదేవి. పూలపానుపు లాంటి జీవితం కాకపోయినా... కడుపు నిండా తిండి, కట్టుకోవడానికి బట్టకు లోటు లేదు. ఉన్నదానితో తృప్తిపడే తత్వం ఆమెని ఏనాడూ దిగులు పడనివ్వనూ లేదు. మంజు భర్త మహదేవ్ జైపూర్ రైల్వేస్టేషన్లో కూలీ. సరిపడానే సంపాదించేవాడు. దాంతో కుటుంబం బాగానే గడిచిపోయేది. అయితే విధి వక్రించడంతో వారి జీవితాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. మహదేవ్ కాలేయ వ్యాధితో హఠాత్తుగా కన్నుమూశాడు. దాంతో బతుకంతా అంధకారమైపోయింది మంజుకి. సంపాదించే భర్త లేడు. తనకేమో సంపాదించే మార్గాలే తెలియదు. పిల్లలదేమో పరిస్థితులు అర్థం చేసుకునే వయసు కాదు. ఇప్పుడేం చేయాలి? తనలో తనే కుమిలిపోయింది. అప్పుడే ఆమెకు ఎవరో సలహా ఇచ్చారు... మీ ఆయన పని నీకిస్తారేమో అడుగు అని! ప్రాణం లేచొచ్చింది మంజుకి. భవిష్యత్తు మీద చిన్న ఆశ చిగురించింది. తన భర్త స్నేహితులతో కలిసి పోర్టర్ యూనియన్ని సంప్రదించింది. వారి సాయంతో ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంది. మంజుకి ఉద్యోగమివ్వడానికి వారికి పెద్ద అభ్యంతరాలేమీ కనిపించలేదు. దాంతో భర్త స్థానం మంజుకి దక్కింది. అతడు ధరించిన బ్యాడ్జి ఆమె చేతిమీదికి చేరింది. దానిమీద రాసివున్న ‘పోర్టర్ నంబర్ 15’ అన్న అక్షరాలు చూసినప్పుడల్లా... భర్త జ్ఞాపకం వచ్చి కళ్లు చెమ్మగిల్లుతాయి మంజుకి. ‘నా భర్త ఈ రూపంలో నాకు అండగా ఉన్నాడు’ అంటుంది తెచ్చిపెట్టుకున్న నవ్వుతో! అయితే తొలినాళ్లలో ఆమె పని చేసినదాని కంటే ఏడుస్తూ గడిపిందే ఎక్కువ. అంతమంది మగవారి మధ్య కూర్చోవడం, తన వంతు కోసం ఎదురు చూడటం నరకంలా అనిపించేదామెకి. పైగా అందరూ తనని వింతగా చూస్తుంటే సిగ్గుతో చితికిపోయేది. దుఃఖాన్ని అదిమిపెట్టుకుని మౌనంగా చూస్తూ ఉండేది. సాయంత్రం ఇంటికి వెళ్లాక వెక్కి వెక్కి ఏడ్చేది. అలా చాలా రోజులు గడిపింది. అయితే ఓసారి మంజుని చూడటానికి వచ్చిన ఆమె తల్లి ఓ మాట చెప్పింది. ‘‘ఒక పని చేయడానికి సిద్ధపడిన తర్వాత దానిలోని మంచి చెడులను ఎదుర్కోవడానికీ సిద్ధపడాలి. విధి నీకు అన్యాయం చేసింది. నువ్వు నీ పిల్లలకు అన్యాయం చేయకు’ అని. ఆ మాటలు మంజుని ఆలోచింపజేశాయి. ఆ క్షణమే నిర్ణయించుకుంది... తన పిల్లలను పెంచుకోవడానికి దొరికిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని! మగవారికి దీటుగా... కూలీగా పని చేయాలనుకోవడం సులభమే. కానీ చేయడం మాత్రం చాలా కష్టం. ఆ సంగతి పనిలో చేరిన కొన్ని రోజులకే తెలిసివచ్చింది మంజుకి. చిన్న చిన్న సూట్‌కేసులు కూడా ఎత్తలేక తూలిపోయేది. ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు వాటిని చక్రాలబండి మీద వేసి లాక్కెళ్లడానికి కూడా ఆమె బలం సరి పోయేది కాదు. ఆమె అవస్థ చూడలేక ఒక్కోసారి తోటి కూలీలు వచ్చి సహకరించేవారు. అది ఆమెకు చాలా సంతోషమనిపించేది. వారితో పని చేయడానికి తనే అనవసరంగా మొహమాటపడుతున్నాను, వాళ్లు మంచి మనసున్నవాళ్లు అని అర్థం చేసుకుంది. ‘అన్నా..’ అంటూ అందరితో స్నేహంగా ఉండటం మొదలుపెట్టింది. పని సులభంగా చేసే మెళకువల్ని వాళ్ల దగ్గర నేర్చుకుంది. ఆ వాతావరణానికి అలవాటు పడింది. వారికి దీటుగా పనిచేసే స్థితికి చేరుకుంది. ఇప్పుడు జైపూర్ రైల్వేస్టేషన్‌కి మంజు ఓ పెద్ద అట్రాక్షన్. ఆమె అంటే అక్కడి కూలీలకే కాదు, దుకాణదారులకి కూడా చాలా ఇష్టం, గౌరవం. అందరూ బెహన్ (సోదరి) అంటూ ప్రేమగా మాట్లాడుతుంటారు ఆమెతో. అయితే ఇప్పటికీ కొందరు ప్రయాణికులు మాత్రం ఆడమనిషి పోర్టరేంటి అని ముఖమ్మీదే జోకులేస్తుంటారు. నువ్వేం మోయగలవు అంటుంటారు. అలాంటప్పుడు ఏమీ మాట్లాడదు మంజు. నవ్వుతూ తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడర్థమయ్యిందా చేయగలనో లేదో అన్నట్టుగా చూస్తుంది. నిజమే... చేయాలి అనుకోవాలేగానీ చేయలేనిది ఏదీ లేదు. పనికి పురుషుడు, స్త్రీ అన్న తేడా లేదు. శారీరక బలానికి ఆత్మబలం తోడైతే... మనల్ని ఆపగలిగే శక్తి దేనికీ ఉండదు. ఆ విషయాన్ని మంజు నిరూపించి చూపించింది! - సమీర నేలపూడి