ఉత్తీర్ణత తగ్గితే బాధ్యత మీదే
కల్హేర్,న్యూస్‌లైన్: పదవ తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఫలితాలు తప్పనిసరిగా సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి జి.రమేష్ సూచించారు. శనివారం మండలంలోని సిర్గాపూర్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక, ఉర్దూ మీడియం, కస్తుర్బా పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతిలో విద్యార్థుల ఉతీర్ణతా శాతం తగ్గితే ఉపాధ్యాయులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు గణితం, వివిధ సబ్జెక్టులపై ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. గణితంలో విద్యార్థులు వెనుకబడి ఉన్నట్లు డీఈఓ పరిశీలనలో తేలింది. దీంతో ఎంఈఓ మన్మథ కిశోర్, సంబంధిత గణిత టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గణితం టీచర్లు పవన్‌కుమార్, మహేశ్వర్‌రావు, రహీం ఇంక్రిమెంట్ కట్ చేస్తామని డీఈఓ తెలిపారు. పదో తరగతి పరీక్షలపై దృష్టిపెట్టడం లేదనే కారణంతో ఎంఈఓ మన్మథ కిశోర్‌కు మెమో జారీ చేస్తున్నట్లు చెప్పారు. అంతకు ముందు పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును పరిశీలించారు.
పాఠశాలలోనే ‘మధ్యాహ్న’భోజనం చేశారు. అక్కడి నుంచి ప్రాథమిక పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాలలను సందర్శించారు. ఉర్దూ మీడియం పాఠశాల నిర్వహణ సరిగాలేదని మండిపడ్డారు. ఉర్దూ పాఠశాల హెచ్ఎం అజీమొద్దీన్‌కు మెమో జారీ చేస్తున్నట్లు తెలిపారు. కస్తూర్బా పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు శాతం పరిశీలించారు. ఇక్కడ ప్రత్యేకాధికారిగా పనిచేసిన గుండయ్య కొత్తగా వచ్చిన ప్రత్యేకాధికారి లలితకు బాధ్యతలు అప్పగించకపోవడంతో వెంటనే బాధ్యతలు అప్పగించాలని అదేశించారు. గుండయ్యపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు.