వైద్యం వికటించి మహిళ మృతి!
♦ ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
♦ తుర్కపల్లిలోని ప్రైవేటు నర్సింగ్‌హోంలో ఘటన
శామీర్‌పేట్ : వైద్యం వికటించి మిహళ మృతిచెందిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువుల ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తుర్కపల్లిలో శనివారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా మొలుగు మండలం దాసర్లపల్లి గ్రామానికి చెందిన మన్నె లక్ష్మి(42), రాజయ్య దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, వారం రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మి తుర్కపల్లిలోని రాజీవ్ రహదారి పక్కన ఉన్న ఓ నర్సింగ్ హోంలో చేరింది. ఈక్రమంలో ఆమెకు వైద్యులు చికిత్స అందించారు.
పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం లక్ష్మి ఆస్పత్రిలో మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే లక్ష్మి మృతిచెందిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. డాక్టర్లు చేసిన ఆపరేషన్ ఫెయిలవడంతో మృత్యువాతపడిందని మండిపడ్డారు. దీంతో వారు నర్సింగ్ హోం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో రాజీవ్ రహదారిపై వాహనాలు స్తంభించిపోయాయి. విషయం తెలుసుకున్న శామీర్‌పేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఆందోళనకారులను సముదాయించి శాంతింపజేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది.