మృత్యువులోనూ చేయికలిపి..
శివరాత్రి స్నానాలకెళ్లి మృత్యువాత
ఇద్దరు మృతితో దివిసీమలో విషాదఛాయలు
శివరాత్రి పర్వదినం..నదిలో స్నానాలు ఆచరించడం సంప్రదాయం. ఆ ముగ్గురూ నదిలో పుణ్య స్నానాలకు దిగారు.. నీళ్లు అల్లరి పెడుతుంటే ఆనందంతో మరింత లోతుకు వెళ్లారు.. సరదా గడిపిన యువకులను మృత్యువు వెంబడించింది.. ముగ్గురూ చెల్లాచెదురయ్యూరు.. వీరిని గమనించిన స్థానికులు ఒకరి ప్రాణాలను నిలబెట్టగలిగారు.. ఆ ఇద్దరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని నదీ గర్భంలో కలిసి శివైక్యమయ్యూరు. పాత ఎడ్లంక (అవనిగడ్డ)
పుణ్యస్నానాలకు వెళ్లి..
కృష్ణానదిలో స్నానం చేసేందుకు స్నేహితులు పువ్వాడ రమణ, నడకుదిటి మనోజ్‌కుమార్, సింహాద్రి సాయినవీన్ దిగారు. సరదాగా ఈత వేస్తున్నారు. లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోయారు. సాయినవీన్‌ను అంబేడ్కర్ కాపాడి ఒడ్డుకు చేర్చాడు. ఇద్దరి కోసం వెతుకులాడే ప్రయత్నంలో అంబేడ్కర్ కూడా ఆపాయంలో చిక్కుకుని కేకలు వేయడంతో గజ ఈతగాళ్లు రక్షించారు. మునిగిన ఇద్దరి కోసం గజ ఈతగాళ్లు గాలించారు. ఆచూకీ దొరకలేదు. దీంతో వలతో సుమారు 500 మీటర్లు గాలించడంతో రమణ, మనోజ్‌కుమార్ కుమార్ మృతదేహాలు దొరికాయి.
స్నానాలకు వెళ్లొదని చెప్పినా..
శివరాత్రి స్నానాలకు వెళ్ళొద్దని చెప్పినా వినకుండా వెళ్లి విగత జీవిగా వచ్చావా నాయనా అంటూ మనోజ్‌కుమార్ కుటుంబ సభ్యులు విలపించారు. కుమార్ అవనిగడ్డ జెడ్పీ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. నువ్వు లేకుండా నేను ఎలా బతకను తమ్ముడూ అంటూ సోదరుడు పవన్‌కుమార్ విలపించారు. మనోజ్‌కుమార్ తండ్రి బసవపున్నారావు స్థానిక వెల్డింగ్ షాపులో పనిచేస్తుండగా సోదరుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, వైఎస్సార్సీపీ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు, ఎస్సీసెల్ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు నలుకుర్తి రమేష్, డీఎస్పీ ఖాదర్‌బాషా ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మత్యుంజయుడు సాయినవీన్
సింహాద్రి సాయినవీన్ మృత్యుంజయుడిగా బ యట పడ్డాడు. మిత్రులు పువ్వాడ రమణ, నడకుదిటి మనోజ్‌కుమార్‌తో కలిసి కృష్ణానదిలోకి స్నా నాలకు వెళ్లిన ఈ ముగ్గురూ మునిగిపోయారు. అం బేడ్కర్ మునిగిపోయిన సాయినవీన్ని కాపాడాడు.
ప్రమాదాన్ని గుర్తించి ఉంటే..
ముగ్గురు యువకులు మునిగిపోయినప్పుడే చూసిన వారు చెప్పి ఉంటే గజ ఈతగాళ్లు కాపాడేవారే. అంబేడ్కర్‌ని కాపాడిన తరువాత మరొకరు ఉన్నారని చెప్పారు. అప్పటికే 15 నిముషాలు గడచిపోయింది. గజ ఈతగాళ్ళకు అంబేడ్కర్ చేయి కనబడటంతో వెంటనే రక్షించ గలిగారు. ఆ సమయంలో గల్లంతైన ఇద్దరి గురించి చెప్పి ఉంటే వారిని రక్షించే వారమని గజ ఈతగాళ్లు చెప్పారు.
రమణ కుటుంబంపై పగబట్టిన విధి..
రమణ తండ్రి కోటేశ్వరరావు పదేళ్ల క్రితం చనిపోగా, తల్లి నాగరత్నం నాలుగేళ్ల క్రితం మరణించింది. నలుగురు వివాహిత కూతుళ్లుండగా రమణ ఒక్కడే మగపిల్లవాడు. తల్లిదండ్రులు చనిపోయినా అక్క వద్ద ఉంటూ నాగాయలంకలో మిఠాయి దుకాణంలో పనిచేస్తున్నాడు. రమణ శివరాత్రి స్నానాలకు వచ్చి మృత్యువు పాలవ్వడంతో సోదరి కొల్లూరి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద విలపిస్తున్న తీరు చూపరులను కలచివేసింది.
రక్షించబోయి.. ప్రమాదం నుంచి బయటికి..
పాత ఎడ్లంక(అవనిగడ్డ) : ప్రమాదంలో యువకులను కాపాడే ప్రయత్నంలో అంబేడ్కర్ ప్రమాదంలో చిక్కుకున్నాడు. గజ ఈతగాళ్లు రక్షించడంలో ప్రాణాలు దక్కించుకున్నారు. ఈత వేస్తు ముగ్గురు యువకులు మునిగిపోతుండగా గుర్తించిన అంబేడ్కర్ అందులో సింహాద్రి సాయినవీన్‌ను కాపాడాడు. మిగిలిన ఇద్దరిని రక్షించేందుకు నదిలో దిగాడు. కాని లోతు అందకపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్నాడు. గజ ఈతగాళ్లు రక్షించారు. ఎస్ఐ వెంకటకుమార్, జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరి వెంకటేశ్వరరావు కలిసి మచిలీపట్నం తరలించారు.