manuru mandal
-
108లో మహిళ ప్రసవం
మనూరు: 108లో మహిళ ప్రసవించిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఇకర్పల్లి గ్రామానికి చెందిన షాజిబేగానికి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమెను అంబులెన్స్‌లో కరస్‌గుత్తి పీహెచ్‌సీకి తరలించగా అక్కడ వైద్య సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలో మోర్గి మోడ్ దగ్గరకు రాగానే మహిళ 108 లోనే ప్రసవించిందని పైలెట్ జగన్నాథం, ఈఎంటీ కాశీనాథ్‌లు తెలిపారు. కాగా తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు. -
ముంపు.. ముప్పు...
ముంపునకు గురవుతున్న మంజీరా పరీవాహక గ్రామాలు భారీగా పంటనష్టం.. ప్రజల ఆందోళన జిల్లాతో సంబంధాలు తెగిన గౌడ్‌గాంజన్‌వాడ గ్రామం నది తీవ్రత పెరిగితే గ్రామాల్లోకి రానున్న మంజీర బ్యాక్‌వాటర్ మనూరు: దశాబ్దకాలంలో ఎన్నడు లేనివిధంగా మంజీరా నది మనూరు మండలంలో తీవ్ర ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఎన్నడు లేనివిధంగా నది పరీవాహక గ్రామాల్లో పంటలు భారీగా మునిగిపోయాయి. నది వెంట ఉన్న ముంపు భూములే కాకుండా కొత్తగా వందలాది ఎకరాల భూముల్లోకి వదర నీరు వచ్చి చేరుతోంది. దీంతో లక్షలు వెచ్చించి సాగుచేసుకున్న పంటలు నీటమునిగాయి. ప్రభుత్వం రైతులను ఆదుకుంటేనే బతుకుదెరువు ఉంటుందని రైతులు అంటున్నారు. అప్పులు తెచ్చి సాగుచేసుకున్న పంటలు పూర్తిగా కళ్లముందే మునిగిపోవడం రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం తక్షణ సాయం అందిస్తేనే రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. కారముంగి శివారులోనే దాదాపుగా 800ఎకరాలు, గౌడ్గాంజన్వాడలో 600ఎకరాలు, తోర్నాల్, పుల్‌కూర్తి, గుడూర్ బోరంచ, రాయిపల్లి శివారులో 6వేల ఎకరాలకు పైగా పంట మునిగిందని ఆయా గ్రామాల రైతులు అంటున్నారు. ముంపునకు గురైన గ్రామాలు ఇవే మంజీరా నీటి మట్టం రోజురోజుకు పెరుగుతుండటంతో మండలంలోని రాయిపల్లి, ధన్వార్, బోరంచ, బెల్లాపూర్, బాదల్గాం, పుల్‌కూర్తి, అతిమ్యాల్, తోర్నాల్, గుడూర్, మెర్గి, షాపూర్, కారముంగి, ఔదత్పూర్, గోందేగాం, గౌడ్‌గాంజన్‌వాడ తదితర గ్రామాల్లో వేలాది ఎకరాల్లో సాగులో ఉన్న చెరుకు, మినుము, కంది పంటలు పూర్తిగా మునిగిపోయాయి. నీటి మట్టం పెరిగితే ప్రమాదమే.. మంజీరలో నీటిమట్టం పెరిగితే పరీవాహక గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే గౌడ్గాం జన్వాడ గ్రామానికి జిల్లాతో సంబంధాలు తెగిపోయాయి, కాగా బెల్లాపూర్, ముగ్దుంపూర్, బాదల్గాం, పుల్‌కూర్తి, తోర్నాల్, ఔదత్పూర్ గ్రామాల్లోకి మంజీరానీరు వచ్చే అవకాశం ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీవాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సూచించారు. సహాయక చర్యలకు గాను అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. -
అందే ఎత్తులో ‘ప్రమాదం’
ప్రమాదకరంగా విద్యుత్ తీగలు మనూరు: మండలంలోని ముక్టాపూర్ శివారులో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి. దీంతో స్థానికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ తీగలను సరి చేయాలని గతంలో సంబంధిత అధికారులను కోరినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. విద్యుత్ తీగలు చేతికి అందేంత ఎత్తులో ఉన్నాయని వెంటనే వాటిని సరి చేయాలని ముక్టాపూర్ ప్రజలు డిమాండ్ చేశారు. -
ఎముకల డంపింగ్‌కు యత్నం
అడ్డుకున్న ధన్వార్ వాసులు హైదరాబాద్ నుంచి వచ్చిన తొమ్మిది లారీలు తహసీల్దార్‌కు ఫిర్యాదు.. ఒక్కో లారీకి రూ.వెయ్యి చొప్పున జరిమానా మనూరు: పశువుల ఎముకలు, పుర్రెలను కొందరు వ్యక్తులు బుధవారం తొమ్మిది లారీల్లో మండలంలోని ధన్వార్ శివారుకు తీసుకొచ్చారు. అక్రమంగా డంపింగ్‌కు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. వెంటనే తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు ఒక్కో లారీకి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించి వదిలేశారు. వివరాలు ఇలా.. హైదరాబాద్‌లోని చాంద్రాయణ గుట్ట నుంచి న్యాల్కల్ మీదుగా మనూరు మండలం ధన్వార్‌కు తొమ్మిది లారీల్లో పశువుల ఎముకలు చేరుకున్నాయి. గ్రామానికి చెందిన మహ్మద్ అజీమొద్దీన్ వచ్చి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో డంపింగ్‌కు యత్నించాడు. తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి డంప్‌ను అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో డంప్ చేయడానికి ఎవరు అనుమతినిచ్చారని లారీ డ్రైవర్లను నిలదీశారు. ధన్వార్‌కు చెందిన మహ్మద్ అజిమొద్దీన్ చేల్లో డంపింగ్‌కు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో స్థానికులు మనూరు తహసీల్దార్ తారాసింగ్‌కు ఫోన్లో సమాచారమిచ్చారు. దీంతో తహసీల్దార్ పోలీసులకు సమాచారమిచ్చి సంఘటన స్థలానికి రెవెన్యూ సిబ్బందిని పంపించారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకుని లారీలను పరిశీలించారు. విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అధికారుల సూచన మేరకు ఒక్కో లారీకి రూ.వెయ్యిచొప్పున జరిమానా విధించి లారీలను తిప్పి పంపినట్టు ఏఎస్ఐలు రఫియొద్దీన్, సదానందం తెలిపారు.