మరడాంలో రేపు సీఎం జగన్ బహిరంగ సభ
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(ఆగష్టు 25) విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం(సీటీయూఏపీ) భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని.. ఆ తర్వాత మరడాం వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇప్పటికే సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత మంత్రులు, అధికారులు పర్యవేక్షించారు.
జగన్ సర్కార్ అడుగుతో.. ఆహ్లాదకరమైన వాతావరణంలో, సువిశాల భవనాల్లో ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం సాకారం కానుంది. భవన శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా హాజరుకానున్నారు.
షెడ్యూల్ ఇలా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు. తొలుత విజయనగరం జిల్లా మెంటాడ మండలం చినమేడపల్లికి చేరుకుంటారు. అక్కడ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్ధాపన కార్యక్రమంలో కేంద్రమంత్రితో కలిసి పాల్గొంటారు. ఆపై బయలుదేరి దత్తిరాజేరు మండలంలోని మరడాం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లికి బయల్దేరతారు.