ప్రేమించడానికి టైమ్ లేదు
ప్రేమించడానికి టైమ్ లేదంటోంది మరాఠీ బ్యూటీ డింపుల్ చోపాడే. ఆరంభంలోనే తమిళం, తెలుగు, కన్నడం అంటూ దక్షిణాది భాషల్లో చుట్టేస్తున్న ఈ అమ్మడు చెన్నైని మాత్రం బాగా ప్రేమిస్తోందట. మరి ఈమె గురించి కాస్త తెలుసుకుందాం.
సినిమా పరిచయం గురించి?
నేను మరాఠీ థియేటర్ ఆర్టిస్ట్‌ను. ఇదే సినీ రంగ ప్రవేశానికి తొలిమెట్టు. మరాఠీ నాటకాల్లో నటించడం చాలామంది చూశారు. అలా తొలుత కన్నడ చిత్ర పరిశ్రమలో తొలి అవకాశం వచ్చింది. అక్కడ బనిముత్తు అనే చిత్రంలో నటించాను. అది తొలి చిత్రం అయినా మొదట విడుదలైంది మాత్రం కోడె చిత్రం. ఆ తరువాత కన్నడంలో ఐదు చిత్రాలు, తమిళంలో యారుడా మహేశ్, కల్‌కండు, తెలుగులో రొమాన్స్ తదితర చిత్రాల్లో నటించాను. నేను మరాఠీ మోడల్ ఆర్టిస్ట్‌ను కావడంతో సినిమాల్లో చాలా గౌరవం లభిస్తోంది. ఏ భాష అయినా సంభాషణలు అర్థం చేసుకుని నటించగలుగుతున్నాను. నిజం చెప్పాలంటే నాటక రంగం సినిమాల్లో నటించడానికి చాలా హెల్ప్ అయ్యింది.
సినిమా కోసం శిక్షణ పొందారా?
సినిమానే జీవితంగా భావించినప్పుడు దాని గురించి కొంచెం అయినా తెలుసుకోవాలని ఫిలిం మేకింగ్ కోర్స్ చేశాను. అంతేకాకుండా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ, గుర్రపు స్వారీ తదితర నటనకు ఏమేమి కావాలో అన్నీ నేర్చుకున్నాను. బీఏ చదవడం కూడా జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
చెన్నైలో మకాం పెడతారా?
నేను చెన్నైని ప్రేమిస్తున్నాను. దక్షిణాదిలో తమిళ చిత్రాల్లోనే హీరోయిన్లకు నటనతో సత్తా చాటుకునే అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి. నా వద్దకు కన్నడం, తెలుగు చిత్రాల్లో నటిస్తున్నా తమిళంలో వైవిధ్య భరిత చిత్రాలను చేయాలని ఆశిస్తున్నాను. వరుసగా మంచి అవకాశాలు వస్తే ఇక్కడే సెటిలవుతాను.
డ్రీమ్ రోల్ అంటూ ఏమైనా ఉందా?
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలి. అంకిత భావంతో నటించాలి. దర్శకుడు చెప్పినట్లు నటిస్తే చాలని భావిస్తాను. ఇక నా మనసులోని మాట చెప్పాలంటే యాక్షన్ కథా పాత్రలో నటించాలనే కోరిక ఉంది. అందుకే మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ వంటి వాటిల్లో శిక్షణ పొందాను. విజయశాంతి నటించిన యాక్షన్ చిత్రాలు తరచూ చూస్తుంటాను. పోరా ట దృశ్యాల్లో ఆమె ఎలా నటించారో గమనిస్తాను. అదే విధంగా మూండ్రాం పిరై చిత్రం అంటే చాలా ఇష్టం. ఆ చిత్రంలో శ్రీదేవి పోషించిన పాత్ర లాంటిది చేయాలన్న ఆకాంక్ష ఉంది.
బాయ్‌ఫ్రెండ్స్ ప్రేమ ఉన్నాయా?
చిత్ర రంగంలోనూ, బయట కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే బాయ్‌ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. ఇప్పటి వరకు నేనెవరినీ ప్రేమించలేదు. అందుకు తగిన సమయం కూడా లేదు.మూడు భాషల్లో బిజీగా ఉన్నాను.