చవితి పండక్కి 'రితేష్' కొత్త గీతం...
వినాయక చవితి వస్తోందంటే దేశవ్యాప్తంగా ముందుగానే సందడి మొదలౌతుంది. ముఖ్యంగా ముంబైలో గణేష్ చతుర్థి హంగామా అంతా ఇంతా కాదు. రంగురంగుల విగ్రహాల తయారీతోపాటు ఉత్సవాల్లో సందడి చేసే పాటలకూ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ముఖ్యంగా గణపతి బప్పా మోరియా అంటూ వినిపించే గీతాలు.. గణపతి నవరాత్రుల్లో ఎంతో ఆదరణ పొందుతాయి. అయితే ఇంతకు ముందెన్నడూ వినని ప్రత్యేక ట్యూన్స్ తో, ఈసారి భిన్నంగా కంపోజ్ చేసిన 'థాంక్ గాడ్ బప్పా' సాంగ్ లోని ప్రతి చరణం ఆకట్టుకుంటోంది.
బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ తో ఓ మరాఠీ ఛానల్ 'థాంక్ గాడ్ బప్పా' అంటూ ఓ కొత్త గీతాన్నిరూపొందించింది. వినాయకుడి వేషంలో ఉన్న పిల్లలతో పాటు డ్యాన్స్ చేస్తూ.. ఈ పాటలో రితేష్ విభిన్నంగా కనిపించడం విశేషం. ఒక్కోసారి ఒక్కో పాత్రలో తనదైన ప్రత్యేకతతో ఒదిగిపోయిన రితేష్.. పాటతో జనానికి ఓ సందేశం ఇవ్వడం కూడా కనిపిస్తుంది.
దేవుడి పేరుతో జరిగే మోసాలను, అక్రమాలను ఎత్తి చూపడమే ఈ పాట ప్రధానాంశంగా కనిపిస్తుంది. అయితే మరాఠీ పాట కావడంతో వీడియో సాంగ్ ప్లే అవుతున్నపుడు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కనిపిస్తాయి. చందాల పేరుతో మోసాలు చేసినా... పర్మిషన్ల పేరుతో పోలీసులు దండుకున్నా అందర్నీ ఒకేలా చూసే దేవుడ్ని మెచ్చుకుంటూ... థాంక్ గాడ్ బప్పా.. అంటూ సెటైరికల్ గా ఈ పాట సాగుతుంది. కపిల్ సావంత్ దర్శకత్వం, రితేష్ భార్య.. జెనీలియా దేశ్ ముఖ్ నిర్మాణంలో ఈ మ్యూజిక్ వీడియో రూపొందించారు. ఈసారి గణేష్ ఉత్సవాల సందర్భంలో విడుదలైన ఈ పాట.. ఇప్పటికే ఎందరో బాలీవుడ్ ప్రముఖుల ట్వీట్లతో ప్రశంసలు పొందుతోంది.
Bribe HIM with treats, HE'll still smile with all HIS teeth