'మార్చురీలో ఉన్న చిన్నారిని ఎలుకలు తిన్నాయి'
బెంగళూరు: తన కుమారుడి మృత దేహం ఎలుకల పాలు కావడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఓ మాతృమూర్తి లోకాయుక్తను ఆశ్రయించిన సంఘటన బుధవారం జరిగింది. వివరాలు... అరసికెరెకు చెందిన జగదీష్, యోగమ్మ దంపతులు రెండు నెలల కుమారుడు ఇటీల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన చిన్నారి చనిపోయాడని స్థానిక పోలీస్ స్టేషన్లో యోగమ్మ ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో భాగంగా పోస్ట్మార్టం కోసం శిశువు మృతదేహాన్ని హాసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్’ లోని మార్చురీలో ఉంచారు.
అయితే శిశువు కళ్లు, చెవులతో పాటు మొహం లోని కొన్ని భాగాలు ఎలుకలు తిన్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై లోకాయుక్తలో బుధవారం బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో.. ‘నాతో పాటు నా భర్తకూడా వికలాంగుడు. ఇకపై నేను గర్భం దాల్చలేను. వైద్యుల నిర్లక్ష్యం వల్ల వంశోద్ధారకుడిని కోల్పాయాం. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా సరైన స్పందనలేదు. పైగా నా కుమారుడి ముఖాన్ని ఆఖరు సారిగా చూసుకుందామన్నా వీలు లేకుండా పోయిం ది. అందువల్ల ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుండి.’ అని పేర్కొన్నారు. కేసు విచారణకు స్వీకరించిన లోకాయుక్త ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.