Maredpalli Police Station
-
అత్యాచార ఆరోపణలు.. మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావు సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో నాగేశ్వరరావుపై అత్యాచారం, హత్యాయత్నం, ఆర్మ్స్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నాగేశ్వర్ రావును విధుల నుంచి తప్పిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బక్రీదు, బోనాల పండుగ బందోబస్తు దృష్ట్యా కార్ఖానా సీఐ నేతాజీని మారేడుపల్లి ఇంచార్జీ సీఐగా సీవీ ఆనంద్ నియమించారు. కాగా జూలై 7న అర్థరాత్రి ఇన్స్పెక్టర్ తనపై అత్యాచారం జరిపినట్లు ఆరోపిస్తూ ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. హస్తినాపురంలో నివసిస్తున్న మహిళ ఇంటికి సీఐ నాగేశ్వరరావు వెళ్లాడు. అర్థరాత్రి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బయటకు వెళ్లిన భర్త ఇంటికి తిరిగి రావడంతో అతన్ని సీఐ రివాల్వర్‌తో బెదిరించాడు. అర్ధరాత్రి సమయంలో ఆ దంపతులిద్దరిని కారులో ఎక్కించుకుని ఇబ్రహీంపట్నం వైపు వెళ్లాడు. అయితే కారు రోడ్డు ప్రమాదానికి గురవడంతో.. సీఐ నుంచి దంపతులిద్దరూ తప్పించుకుని, వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: Hyderabad: చారిత్రక భాగ్యనగరికి విదేశీ పర్యాటక కళ -
మహిళ ఆత్మహత్య
కంటోన్మెంట్: అనుమానాస్పద స్థితిలో మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. చిలకలగూడకు చెందిన అబ్దుల్ సుభాన్, నజీమిన్ భాను దంపతుల కుమార్తె షాబాజ్ ఫాతిమా (23) గోల్డెన్ బేకరీ యజమాని సయ్యద్ ఇంతియాజ్‌ను పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత ఇంతియాజ్, భార్య ఫాతిమా, అత్తమామలతో కలిసి వెస్ట్‌మారేడ్‌పల్లిలో కాపురం పెట్టాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఇంతియాజ్ తమ కూతురిని వేధించేవాడని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో ఫాతిమా తల్లిదండ్రులు చిలకలగూడలోని తమ సొంతింటికి వెళ్లి అక్కడే ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఇంతియాజ్ శనివారం ఫాతిమా తల్లిదండ్రులను తన ఇంటికి ఆహ్వానించాడు. ఈ సందర్భంగా మరోసారి గొడవజరిగిందని తెలిపారు. శనివారం రాత్రి తాము చిలకలగూడకు వెళ్లిపోగా, ఆదివారం తెల్లవారుజామున అల్లుడు ఇంతియాజ్ తమకు ఫోన్ చేసి, ఫాతిమా ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పాడన్నారు. దానిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫాతిమా తల్లి నజీమిన్ భాను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఏటీఎం కార్డులు’ మార్చి ఏమారుస్తాడు..
హైదరాబాద్: రద్దీగా ఉండి, సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలను టార్గెట్‌గా చేసుకుని వినియోగదారులకు ‘సహకరిస్తూ’ ఏటీఎం కార్డుల్ని మార్చి నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని మారేడ్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. 2010 నుంచి నేర జీవితం ప్రారంభించిన ఇతగాడు ఇప్పటి వరకు ఈ తరహా తొమ్మిది నేరాలు చేశాడు. నార్త్‌జోన్ డీసీపీ ఎన్.ప్రకాష్‌రెడ్డి మంగళవారం వెల్లడించిన వివరాలివీ.. మధుమేహంతో నేరబాట పట్టి... మెదక్ జిల్లా సిద్ధిపేటకు చెందిన ఎ.రవీందర్ వెస్ట్ మారేడ్‌పల్లి పరిధిలో ఉంటున్నాడు. గతంలో చిన్నచిన్న పనులు చేసుకునే ఇతడు మధుమేహం బారిన పడ్డాడు. దీంతో పని చేయలేక తేలికగా సంపాదించవచ్చని నేరాల బాట పట్టాడు. ఇందుకు గాను ఏటీఎం కేంద్రాలనే టార్గెట్‌గా చేసుకున్నాడు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంల్లో సెక్యూరిటీ గార్డులు కూడా లేని వాటిని ఎంపిక చేసుకుని కాపుకాస్తాడు. ఏటీఎం కార్డును ఎలా వినియోగించాలో తెలియని వారు వచ్చే వరకు వేచి ఉంటాడు. అలాంటి వినియోగదారుల్ని గుర్తించి సహాయం చేస్తున్నట్లు నమ్మిస్తాడు. వారు పిన్ నంబర్ చెప్పగానే వారి కార్డుతో వారి పని పూర్తి చేసి, హస్త లాఘవం చూపి తన వద్ద ఉన్న కార్డు వారికి అంటగడతాడు. తర్వాత దాన్ని వినియోగించుకుని డబ్బులు కాజేస్తాడు. కరీంనగర్లో దొరికిన లీడ్... బాధితుల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసుకున్న మారేడ్‌పల్లి పోలీసులు సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద ఉన్న, సిరిసిల్లలోని ఏటీఎం కేంద్రాల నుంచి సీసీ కెమెరా ఫుటేజ్‌ను సేకరించి విశ్లేషించారు. దాంతో ఈ నేరాలు ఒకే వ్యక్తి చేసినట్లు నిర్థారణైంది. అప్పటికే కరీంనగర్లో రవీందర్‌పై ఓ కేసు నమోదై ఉండటంతో అక్కడి పోలీసుల్ని సంప్రదించారు. ఫలితంగా రవీందర్‌పై సిద్ధిపేటలో సస్పెక్ట్ షీట్ ఉందని, ప్రస్తుతం మారేడ్‌పల్లిలో నివసిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు నగదు, ఏటీఎం కార్డులు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇతడిపై ఉప్పల్ పరిధిలో రెండు కేసులు నమోదు కావాల్సి ఉందని డీసీపీ తెలిపారు.