‘ఏటీఎం కార్డులు’ మార్చి ఏమారుస్తాడు..
హైదరాబాద్: రద్దీగా ఉండి, సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలను టార్గెట్‌గా చేసుకుని వినియోగదారులకు ‘సహకరిస్తూ’ ఏటీఎం కార్డుల్ని మార్చి నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని మారేడ్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. 2010 నుంచి నేర జీవితం ప్రారంభించిన ఇతగాడు ఇప్పటి వరకు ఈ తరహా తొమ్మిది నేరాలు చేశాడు. నార్త్‌జోన్ డీసీపీ ఎన్.ప్రకాష్‌రెడ్డి మంగళవారం వెల్లడించిన వివరాలివీ..
మధుమేహంతో నేరబాట పట్టి...
మెదక్ జిల్లా సిద్ధిపేటకు చెందిన ఎ.రవీందర్ వెస్ట్ మారేడ్‌పల్లి పరిధిలో ఉంటున్నాడు. గతంలో చిన్నచిన్న పనులు చేసుకునే ఇతడు మధుమేహం బారిన పడ్డాడు. దీంతో పని చేయలేక తేలికగా సంపాదించవచ్చని నేరాల బాట పట్టాడు. ఇందుకు గాను ఏటీఎం కేంద్రాలనే టార్గెట్‌గా చేసుకున్నాడు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంల్లో సెక్యూరిటీ గార్డులు కూడా లేని వాటిని ఎంపిక చేసుకుని కాపుకాస్తాడు. ఏటీఎం కార్డును ఎలా వినియోగించాలో తెలియని వారు వచ్చే వరకు వేచి ఉంటాడు. అలాంటి వినియోగదారుల్ని గుర్తించి సహాయం చేస్తున్నట్లు నమ్మిస్తాడు. వారు పిన్ నంబర్ చెప్పగానే వారి కార్డుతో వారి పని పూర్తి చేసి, హస్త లాఘవం చూపి తన వద్ద ఉన్న కార్డు వారికి అంటగడతాడు. తర్వాత దాన్ని వినియోగించుకుని డబ్బులు కాజేస్తాడు.
కరీంనగర్‌లో దొరికిన లీడ్...
బాధితుల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసుకున్న మారేడ్‌పల్లి పోలీసులు సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద ఉన్న, సిరిసిల్లలోని ఏటీఎం కేంద్రాల నుంచి సీసీ కెమెరా ఫుటేజ్‌ను సేకరించి విశ్లేషించారు. దాంతో ఈ నేరాలు ఒకే వ్యక్తి చేసినట్లు నిర్థారణైంది. అప్పటికే కరీంనగర్‌లో రవీందర్‌పై ఓ కేసు నమోదై ఉండటంతో అక్కడి పోలీసుల్ని సంప్రదించారు. ఫలితంగా రవీందర్‌పై సిద్ధిపేటలో సస్పెక్ట్ షీట్ ఉందని, ప్రస్తుతం మారేడ్‌పల్లిలో నివసిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు నగదు, ఏటీఎం కార్డులు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇతడిపై ఉప్పల్ పరిధిలో రెండు కేసులు నమోదు కావాల్సి ఉందని డీసీపీ తెలిపారు.