లబోదిబోమంటున్న బాధితులు
మెదక్ మున్సిపాలిటీ : ఏటీఎం నుంచి డబ్బులు తీసిస్తామంటూ దొంగలు కార్డులు మార్చి రూ.1.30 లక్షలు డ్రా చేసుకున్న సంఘటన పట్టణంలో సోమవారం సాయంత్రం వెలుగులోకి వచ్చాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ మండల పరిధిలోని సర్దన గ్రామానికి చెందిన రైతు సురేష్ శనివారం రాత్రి 8 గంటల సమయంలో మెదక్ పట్టణం ఆటోనగర్‌లో గల ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లాడు. ఏటీఎం సెంటర్ వద్ద సెక్యూరిటీగార్డు డ్రెస్‌లో ఉన్న వ్యక్తి డబ్బులు తీసిస్తానంటూ సురేష్ ఏటీఎం కార్డు తీసుకున్నాడు. కొంత డబ్బును సురేష్‌కు తీసిచ్చాడు.
ఆ వెంటనే సురేష్ కార్డుకు బదులు మరో ఏటీఎం కార్డును అతనికిచ్చాడు. విషయం గమనించని సురేష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. శని, ఆదివారాల్లో అర్ధరాత్రి సమయంలో తన ఏటీఎం కార్డు నుంచి రూ.80 వేలు డ్రా చేసినట్లు ఫోన్‌కు మెసేజ్ రావడంతో సురేష్ ఆందోళన చెందాడు. దీంతో ఏటీఎం కార్డును చూసుకోగా కార్డు మారిన విషయాన్ని గుర్తించాడు. దీంతో చేసేది లే సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరో సంఘటనలో...రూ.50వేలు
మండలంలోని బ్యాతోల్ తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన ఎండీ పాషా శనివారం పట్టణంలోని డబ్బులు తీసుకునేందుకు మెదక్ పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు ఏటీఎం వద్దకు వచ్చాడు. అదే సమయంలో ఏటీఎం సెంటర్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు ఏదో రిసిప్ట్ వస్తోందని, ఒకసారి ఏటీఎం కార్డు ఇవ్వాలని అడగ్గా పాషా తన కార్డును ఇచ్చాడు. కొంత సేపటి తరువాత సెక్యూరిటీ గార్డు మరో కార్డును పాషా చేతికి ఇచ్చాడు. అయితే ఆదివారం తన కార్డు ద్వారా రూ.50 వేలు డబ్బులు డ్రా అయినట్లు ఫోన్‌కు మెసేజ్ రావడంతో ఆందోళన చెందిన పాషా సోమవారం పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌ఐ అంజయ్య తెలిపారు.
ఏటీఎం కార్డులు మార్చి రూ.1.30 లక్షలు డ్రా
Published Mon, Jun 16 2014 11:28 PM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM
Advertisement