Market control Company
-
కార్వీ తరహా మోసాలకు చెక్
ముంబై: భవిష్యత్తులో కార్వీ తరహా మోసాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ చీఫ్ అజయ్ త్యాగి చెప్పారు. క్లయింట్లకు సంబంధించి రూ.2,000 కోట్ల మేర విలువైన సెక్యూరిటీలను దుర్వినియోగం చేసిన విషయమై కార్వీ బ్రోకింగ్ సర్వీసెస్‌పై పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ నెల 14 నాటికి కార్వీ సంస్థ చెల్లించాల్సిన బకాయిలు రూ.1,189 కోట్లుగా ఉన్నాయని త్యాగి పేర్కొన్నారు. ఈ విషయమై కార్వీకి నోటీసులు జారీ చేశామని వివరించారు. తమ కంపెనీల్లో ఒక దాంట్లో వాటా విక్రయ ప్రయత్నాలు చేస్తున్నామని, అది పూర్తవ్వగానే ఈ బకాయిలను చెల్లిస్తామని, మార్చి కల్లా అన్ని బకాయిలను చెల్లిస్తామని కార్వీ వెల్లడించిందని వివరించారు. ఇక ఏం జరుగుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. సోమవారం జరిగిన సెబీ బోర్డ్ సమావేశ వివరాలను ఆయన వెల్లడించారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను సెబీ బోర్డ్ ఆమోదించింది. సంతృప్తికరంగానే... ఈ నెలలోనే సెబీ చైర్మన్‌గా అజయ్ త్యాగి మూడేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. తన హయాంలో పారదర్శకంగా, సంప్రదింపుల పద్ధతిలోనే సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించామని, అధికారం చెలాయించడానికి ప్రయత్నించలేదని అజయ్ త్యాగి పేర్కొన్నారు. తన హయాం సంతృప్తికరంగానే గడిచిందని తెలిపారు. సోమవారం జరిగిన సెబీ బోర్డ్ కీలక నిర్ణయాలు ఇవీ..., ►కంపెనీల్లో చైర్మన్, ఎమ్డీ పోస్ట్‌ల విభజన విషయంలో పలు ఆచరణాత్మక, పరిపాలనా పరమైన సమస్యలున్నాయి. అందుకే ఈ పోస్ట్‌ల విభజనకు గడువును మరో రెండేళ్లు (2020, ఏప్రిల్ వరకూ) పొడిగించారు. ►స్మాల్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్‌ల పునః వర్గీకరణపై మరింత కసరత్తు జరుగుతోంది. త్వరలోనే మార్గదర్శకాలను వెల్లడించనున్నది. ►ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం మదుపు సలహాదారుల(ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల) అర్హతలను మరింత కఠినతరం చేయనున్నది. ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే ఫీజులపై గరిష్ట పరిమితిని నిర్దేశించనున్నది. -
కార్వీపై ‘ఆంక్ష’లను సమీక్షించండి
న్యూఢిల్లీ: క్లయింట్ల పవర్ ఆఫ్ అటార్నీలను (పీవోఏ) ఉపయోగించుకోనివ్వకుండా స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీపై విధించిన ఆంక్షలను పునఃసమీక్షించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) సూచించింది. డిసెంబర్ 2లోగా దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. క్లయింట్ల షేర్లను సొంత అవసరాలకు ఉపయోగించుకుందన్న ఆరోపణలతో కార్వీపై సెబీ ఆంక్షలు విధించడం తెలిసిందే. కొత్త క్లయింట్లను చేర్చుకోరాదని, ప్రస్తుత క్లయింట్ల పీవోఏలను ఉపయోగించరాదని సెబీ హోల్‌టైమ్ సభ్యుడు(డబ్ల్యూటీఎం) అనంత బారువా నవంబర్ 22న ఇచ్చిన ఎక్స్‌పార్టీ మధ్యంతర ఉత్తర్వుల్లో ఆదేశించారు. దీన్ని సవాలు చేస్తూ కార్వీ గురువారం శాట్‌ను ఆశ్రయించింది. పీవోఏలను ఉపయోగించుకోలేకపోవడం వల్ల లావాదేవీల సెటిల్మెంట్ విషయంలో సమస్యలు వస్తున్నాయని, క్లయింట్లు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. పీవోఏలను ఉపయోగానికి సంబంధించి కొన్ని అంశాలపై స్పష్టతనివ్వాలని కోరింది. తరుణ్ అగర్వాలా, ఎం.టి. జోషిలతో కూడిన శాట్ ద్విసభ్య బెంచ్ దీనిపై శుక్రవారం ఉత్తర్వులిస్తూ... కార్వీ కోరుతున్నట్లుగా సెబీ ఈ అంశాన్ని పరిశీలించాలని, సంస్థ తన వాదనలు వినిపించేందుకు అవకాశమిచ్చి.. తరవాత తగు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. సెబీ మాజీ లీగల్ ఆఫీసర్ కేఆర్‌సీవీ శేషాచలం పార్ట్నర్గా ఉన్న విశేష లా సర్వీసెస్ సంస్థ కార్వీ తరఫున వాదిస్తోంది. మరోవైపు, ప్రస్తుత తరుణంలో కార్వీకి వెసులుబాటు కల్పిస్తే.. మరింతగా పీవోఏల దుర్వినియోగానికి దారి తీయొచ్చని సెబీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. -
ఇక మూడు రోజుల్లోనే లిస్టింగ్
ముంబై: మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ మంగళవారం జరిగిన బోర్డ్ సమావేశంలో పలు ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు సంబంధించిన సవరించిన కొత్త కేవైసీ (నో యువర్ కస్టమర్)నిబంధనలకు ఆమోదం తెలిపామని, త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని సెబీ చైర్మన్ అజయ్ త్యాగి వెల్లడించారు. ఐపీఓకు వచ్చిన కంపెనీలు స్టాక మార్కెట్లో లిస్టయ్యే సమయాన్ని తగ్గించామని, అలాగే మ్యూచువల్ ఫండ్ చార్జీలను కూడా తగ్గించామని వివరించారు. మ్యూచువల్ ఫండ్స్ మొత్తం వ్యయాలు 2.25 శాతానికి మించకుండా పరిమితిని విధించామని. ఫలితంగా ఇన్వెస్టర్లకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డ వ్యక్తుల ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్‌ను విశ్లేషించే అధికారాలు సెబీకి ఇవ్వాలని త్వరలో ప్రభుత్వాన్ని కోరనున్నామని తెలిపారు. సెబీ ఆమోదం తెలిపిన కొన్ని ముఖ్య నిర్ణయాలు. ♦ ఐపీఓ ముగిసిన తర్వాత ఆరు రోజులకు కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యేవి. ఇప్పడు ఈ సమయాన్ని మూడు రోజులకు కుదింపు ♦ ఐపీఓలలో షేర్లు కొనుగోలు చేసే రిటైల్ ఇన్వెస్టర్ల కోసం యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) పేరుతో ప్రత్యామ్నాయ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది. ♦ కొన్ని షరతులకు లోబడి కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లకు అనుమతి. ♦ దేశీయ మార్కెట్లలో ట్రేడింగ్ చేయడానికి నమోదు చేసుకోవడానికి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఒకటే దరఖాస్తు సమర్పిస్తే చాలు. ♦ కావాలని రుణాలు ఎగవేసిన వాళ్లు, ఆర్థిక నేరగాళ్లు సెటిల్మెంట్ ప్రక్రియలో పాల్గొనలేరు. ♦ ఆర్థిక నేరగాళ్లు ఓపెన్ ఆఫర్లను ప్రకటించలేరు. ♦ స్టాక్ మార్కెట్లో లిస్టైన దిగ్గజ కంపెనీలు తమ దీర్ఘకాలిక రుణావసరాల్లో కనీసం 25 శాతం వరకూ కార్పొరేట్ బాండ్ల ద్వారానే సమీకరించాలి. ♦ లిస్టైన కంపెనీల్లో మహిళలపై లైంగిక వేధింపుల ఫిర్యాదులను ఆయా కంపెనీలు సవివరంగా ఒక జాబితాను రూపొందించాల్సి ఉంటుంది. కొచర్ సమస్య పరిష్కారంపై చర్చ... ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందాకొచర్ భర్తకు సంబంధించిన వ్యాపార లాదేవీల విషయమై తమ షోకాజు నోటీసుకు బ్యాంకు స్పందించిందని సెబీ చీఫ్ తెలిపారు. అంగీకారం ద్వారా ఈ అంశాన్ని పరిష్కరించుకునేందుకు బ్యాంకు అనుమతి కోరిం దన్నారు. కొచర్ భర్త దీపక్ కొచర్ వీడియోకాన్ గ్రూపుతో కొన్నేళ్లుగా ఎన్నో వ్యాపార లావాదేవీలు కలిగి ఉన్నట్టు సెబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో ప్రయోజన వివాదం కింద లిస్టింగ్ నిబం ధనలు పాటించకపోవడంపై సెబీ షోకాజు నోటీసు జారీ చేసింది. తమ వైపు నుంచి నియంత్రణపరమైన వైఫల్యం ఏదీ లేదని ఐసీఐసీఐ బ్యాంకుతోపాటు చందా కొచర్ షోకాజు నోటీసులకు బదులిచ్చారు. ట్రేడింగ్ వేళల పెంపుపై అనిశ్చితి... స్టాక్ ఎక్సే్చంజ్‌ల ట్రేడింగ్ వేళల పెంపు సాకా రం కావడానికి మరికొంత కాలం పట్టేట్లు ఉంది. ట్రేడింగ్ వేళల పెంపు విషయమై స్టాక్ ఎక్సే్చంజ్‌లు ఎలాంటి సమగ్రమైన ప్రణాళికతో ముందుకు రాకపోవడంతో ఈ పెంపు మరికొంత కాలం వాయిదా పడే అవకాశాలున్నాయి. షెడ్యూల్ప్రకారమైతే, వచ్చే నెల ఒకటి నుంచి ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడింగ్‌ను రాత్రి 11.55 వరకూ కొనసాగించాలని సెబీ ఆలోచన. -
డీఎల్‌ఎఫ్‌పై సెబీ మూడేళ్ల నిషేధం
ప్రమోటర్ కేపీ సింగ్,టాప్ ఎగ్జిక్యూటివ్‌లపై కూడా * స్టాక్ మార్కెట్ కార్యకలాపాలకు చెక్ * ఐపీవోలో తప్పుడు సమాచార ఫలితం ముంబై: రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌తోపాటు, ప్రమోటర్, చైర్మన్ కేపీ సింగ్ తదితర ఆరుగురు అత్యున్నత అధికారులపై నిషేధం వేటు పడింది. మూడేళ్లపాటు క్యాపిటల్ మార్కెట్లలో ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టడానికి వీలులేకుండా నిషేధిస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలు జారీచేసింది. పబ్లిక్ ఆఫర్ సమయంలో ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించే విధంగా కంపెనీ అవకతవకల సమాచారాన్ని ప్రకటించడమే దీనికి కారణమని సెబీ జీవితకాల సభ్యులు రాజీవ్ అగర్వాల్ తెలిపారు. నిషేధానికి గురైన ఎగ్జిక్యూటివ్‌లలో కేపీ సింగ్ కుమారుడు రాజీవ్ సింగ్(డీఎల్ఎఫ్ వైస్‌చైర్మన్), కుమార్తె పియా సింగ్ (హోల్‌టైమ్ డెరైక్టర్) సహా టీసీ గోయల్(ఎండీ), కామేశ్వర్ స్వరూప్(అప్పటి సీఎఫ్‌వో), రమేష్ శంకా(అప్పటి ఈడీ, లీగల్) సైతం ఉన్నారు. సెబీ నిషేధంవల్ల వాటాల విక్రయం, కొనుగోలు, నిధుల సమీకరణ వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుండదు. ప్రమోటర్లకు కంపెనీలో దాదాపు 75% వాటా ఉంది. నిబంధనల ఉల్లంఘన...: వివరాల వెల్లడి, ఇన్వెస్టర్ల రక్షణ(డీఐపీ) మార్గదర్శకాలతోపాటు, మోసం, అవకతవకల కార్యకలాపాల నిరోధం(పీఎఫ్‌యూటీపీ) వంటి సెబీ నిబంధనలను డీఎల్ఎఫ్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఉల్లంఘించారని రాజీవ్ పేర్కొన్నారు. ఈ కేసులో జరిగిన నిబంధనల ఉల్లంఘన వల్ల సెక్యూరిటీల మార్కెట్ రక్షణ, విలువలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. కిమ్సుక్ కృష్ణ సిన్హా అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టు, సెబీకి సైతం కంపెనీపై ఫిర్యాదు చేయడంతో 2010లో సెబీ డీఎల్‌ఎఫ్‌పై దర్యాప్తు మొదలుపెట్టింది. 2007లో పబ్లిక్ ఇష్యూ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సెబీ వద్ద డీఎల్ఎఫ్ 2007 జనవరిలో ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఆపై 2007 మే నెలలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 9,187 కోట్లను సమీకరించింది. స్టాక్ ఎక్స్ఛేం జీలలో జూలై 2007లో లిస్టయ్యింది. కాగా, ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో డీఎల్ఎఫ్ షేరు 3.7% పతనమై రూ. 147 వద్ద ముగిసింది. సెబీ నుంచి నోటీస్ అందుకున్నామని, ఈ అంశాన్ని న్యాయ సలహాదారులతో సమీక్షిస్తున్నామని డీఎల్ఎఫ్ బీఎస్ఈకి తెలిపింది. తాము ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని ఒక ప్రకటనలో పేర్కొంది.