Market traders
-
‘నున్న’ మామిడి ర్యాంపు మీద..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఆసియాలోనే అతిపెద్దదైన నున్న మామిడి మార్కెట్ వ్యాపారులతో కళకళలాడుతోంది. ఫిబ్రవరిలోనే మామిడి ఎగుమతులు తోటల నుంచి నామమాత్రంగా ప్రారంభమైనప్పటికీ.. నున్న మార్కెట్ నుంచి మాత్రం మార్చి 20 నుంచి మొదలయ్యాయి. ఏప్రిల్ రెండో వారం నుంచి ఎగుమతులు ఊపందుకున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు, స్థానిక వ్యాపారులు రైతుల నుంచి మామిడి పండ్లను కొనుగోలు చేసి ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, లక్నో, కోల్‌కతా తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. రాష్ట్రంలో 8.41 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ప్రస్తుతం నూజివీడు, విస్సన్నపేట, మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం, మైలవరం, తెలంగాణలోని కల్లూరు ప్రాంతాల నుంచి నున్న మార్కెట్‌కు మామిడి పండ్లు వెల్లువలా వస్తున్నాయి. రోజుకు 300నుంచి 400 టన్నుల పండ్లు దేశంలోని వివిధ మార్కెట్లకు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. ఇప్పటివరకు నున్న మార్కెట్ నుంచి 2 వేల టన్నులకు పైగా కాయలు ఎగుమతి అయినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దిగుబడి తగ్గినా.. ధరలు ఆశాజనకం ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో పూత ఆలస్యంగా వచ్చింది. జనవరిలో కొంత పూత వచ్చినప్పటికీ వైరస్ బారిన పడటంతో పిందెకట్టకుండానే రాలిపోయింది. గతంలో ఎకరానికి 4–5 టన్నుల దిగుబడి రాగా.. ప్రస్తుతం సగానికి పైగా తగ్గిపోయే పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఊరట లభిస్తుందంటున్నారు. గత ఏడాది మార్చి నెలాఖరులో బంగినపల్లి టన్ను ధర రూ.30–35వేలు ఉండగా, ఈ ఏడాది రూ.70–80 వేల వరకు ధర పలుకుతుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం టన్ను మామిడిపండ్ల ధర రూ.55 వేల వరకు పలుకుతోంది. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రసాలకు మంచి గిరాకీ ఉంది. కాయలు పక్వానికి రావడంతో తోటల్లోనే కాయ రూ.15– రూ.20 వరకు అమ్ముతున్నారు. పెద్ద రసాలు ఒక్కో కాయ రూ.25నుంచి రూ.30 పలుకుతోంది. సరుకు పూర్తి గా మార్కెట్లోకి వస్తే కొంత మేర ధరలు అందుబాటులోకి వస్తాయని వ్యాపారులు భావిస్తున్నారు. మంచి ధర వస్తోంది ఈ ఏడాది మామిడి పండ్లు మంచి ధర పలుకుతున్నాయి. గతంలో ధరలు తగ్గిపోతాయేమోననే భయంతో రైతులు తొందరపడి పక్వానికి రాని కాయల్ని కోసేవారు. ఈ ఏడాది రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దిగుబడులు తగ్గడంతో సరుకు తక్కువగా ఉంది. అందువల్ల రైతులు కాయలు పక్వానికి వచ్చాకే కోస్తే బరువు పెరుగుతుంది. ధరలు కొంత అటూఇటూ ఉన్నా రైతులకు నష్టం ఉండదు. – శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ, ది మ్యాంగో గ్రోయర్స్ అసోసియేషన్, నున్న -
‘నామ్’ అమలు.. అందరి బాధ్యత
మార్కెట్ వ్యాపారులు, అధికారులకు డీడీఎం సూచన వరంగల్ సిటీ : దేశంలో పంట ఉత్పత్తులకు మంచి ధర దక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ వ్యవస్థ(నామ్) అమలు బాధ్యత అందరిదని వరంగల్ రీజినల్ మార్కెటింగ్ డిప్యూటీ డెరైక్టర్ ఉప్పుల శ్రీనివాస్ అన్నారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మార్కెట్ కార్యదర్శి అజ్మీరా రాజు అధ్యక్షతన అడ్తి, వ్యాపారులతో సమావేశం జరిగింది. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై నామ్ అమలు తీరు, విధివిధానాలు, వ్యాపారులు, అధికారులు అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. మొదట చాంబర్ ముఖ్యప్రతినిధులు, ప్రముఖ వ్యాపారులతో సమావేశం నామ్ అమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర వివరించారు. క్రయ విక్రయూలు సింగిల్ లెసైన్స్డ్ విధానంతో పారదర్శకంగా ఆన్లైన్లో జరుగుతాయని, ఇది కూడా ఎన్‌సీడీఎక్స్ (ఈ మార్కెటింగ్) లాంటిదేనని తెలిపారు. దీంతో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. దేశం మొత్తం ఒకే ధర అమలు కావడం వల్ల రైతులకు మంచి ధర దక్కే అవకాశం ఉంటుందని, మోసాలు ఉండవని చెప్పారు. దేశంలో 21 మార్కెట్లలో నామ్ అమలవుతుండగా, తెలంగాణ రాష్ట్రంలో ఐదు మార్కెట్లలో మాత్రమే అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు చెప్పారు. ఈమేరకు వరంగల్ మార్కెట్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఛాంబర్ అధ్యక్షుడు కటకం పెంటయ్యతో పాటు ప్రముఖ వ్యాపారులు పాల్గొన్నారు. కాగా సమావేశం తర్వాత మార్కెట్లోని అన్ని హోదాల అధికారులతో సమావేశం నిర్వహించి నామ్ అమలుకు సీరియస్ ఆదేశాలు జారీ చేశారు. సీజన్‌కు ముందు మార్కెట్లో ఈ మార్కెటింగ్ ప్రవేశపెట్టినప్పుడు వ్యాపారులు రైతులను రెచ్చగొట్టి అమలు కాకుండా చేసిన విషయూన్ని సిబ్బంది గుర్తుచేశారు. ఎట్టిపరిస్థితుల్లో నామ్‌ను అమలు చేయూలని ఆయన సూచించారు. మార్కెట్ అధికారులు వేముల వెంకటేశ్వర్లు, పి.అశోక్, శ్రీధర్, ఓని కుమారస్వామి, ప్రభాకర్, రమేష్, ఎస్.రమేష్, లక్ష్మీనారాయణ, చక్రబహుదూర్, రాజేందర్, అంజిత్‌రావు, బీయాబాని, వేణుగోపాల్, మందవేణు పాల్గొన్నారు.