marredpally
-
మారేడుపల్లి ఎస్సైపై కత్తితో దాడి.. ఆసుపత్రికి తరలింపు
సాక్షి, హైదరాబాద్: మారేడుపల్లి ఎస్సై వినయ్ కుమార్‌పై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి విధి నిర్వహణలో ఉన్న ఎస్సైపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. తెల్లవారుజామున 2.50 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర రక్తస్రావమైన ఎస్సై వినయ్‌ను హుటాహుటిన సమీపంలోని గీత నర్సింగ్‌హోమ్‌కు తరలించారు. కడుపు భాగంలో నాలుగు, వెన్నులో నాలుగు కుట్లు వేశారు. ప్రస్తుతం ఎస్సై పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఓంశాంతి టిఫిన్ సెంటర్ ఎదురుగా నైట్ డ్యూటీలో ఉన్న ఎస్సై వినయ్‌కుమార్, మరో పోలీస్ అధికారి సత్యనారాయణతో కలిసి తనిఖీలు నిర్వహిన్నారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు నంబరు ప్లేట్ లేకుండా మోటారు సైకిల్‌తో వస్తుండం చూసి వారిని ఆపారు. ఇద్దరిని విచారిస్తుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి తన వద్ద ఉన్న చిన్న కత్తితో ఎస్ఐ వినయ్ కుమార్‌పై దాడి చేశాడు. కడుపు, వెన్ను భాగంలో పొడిచాడు. అనంతరం ఇద్దరు దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులను లంగర్‌హౌస్‌లోని సంజయ్ నగర్లో నివాసముండే పవన్, సంజయ్గా గుర్తించారు. నిందితులు పీడీయాక్ట్ కింద జైటుకు వెళ్లి వచ్చిన పాత నేరస్తులుగా గుర్తించారు. చదవండి: చిన్నపాటి వివాదం యువజంట బలవన్మరణం -
ఖైదీ నెంబర్ 2001.. నాగేశ్వర్రావు రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు
సాక్షి, హైదరాబాద్: వివాహితపై తుపాకీ గురిపెట్టి అత్యాచారం చేయడంతో పాటు ఆమెను భర్తతో సహా కిడ్నాప్ చేసి హత్యాయత్నం చేసిన మాజీ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావుకు చర్లపల్లి జైలు అధికారులు అండర్ ట్రయల్ (యూటీ) ఖైదీ నెం.2001 కేటాయించారు. సోమవారం నాగేశ్వర్రావును అరెస్టు చేసిన వనస్థలిపురం పోలీసులు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చర్లపల్లి జైలుకు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం నాగేశ్వర్రావును పది రోజుల పాటు తమ కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన నోటీసులను పోలీసులు బుధవారం జైలులో నాగేశ్వర్రావుకు ఇచ్చారు. వనస్థలిపురం పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలకాంశాలు ప్రస్తావించారు. ప్రాథమిక విచారణలోనే నాగేశ్వర్రావు తన నేరం అంగీకరించినట్లు అందులో రాశారు. హస్తినాపురంలోని వెంకటరమణ కాలనీలో ఉండే బాధితురాలి ఇంటికి నాగేశ్వర్రావు ఆ రోజు రాత్రి 9.30 గంటల సమయంలో వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని, ఆ ఫీడ్‌ను సేకరించామని పేర్కొన్నారు. ఉదంతం జరిగిన తర్వాత కేసు నమోదైన విషయం తెలుసుకున్న నాగేశ్వర్రావు బెంగళూరు పారిపోయాడని, ఆదివారం రాత్రి నగరానికి చేరుకోగా పట్టుకున్నామని కోర్టుకు తెలిపారు. ఈ ఉదంతానికి సంబంధించిన మారేడ్‌పల్లి పోలీసుస్టేషన్లో డిపాజిట్ చేసి ఉన్న నాగేశ్వర్రావు పిస్టల్‌తో పాటు ఆయన ఇంటి నుంచి నేరం చేసినప్పుడు ధరించిన దుస్తులు తదితరాలు స్వాధీనం చేసుకున్నామని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. బాధితురాలి ఇంటి దగ్గర, ఇబ్రహీంపట్నం రహదారిలో, అక్కడ నుంచి కొత్తపేటకు వచ్చే మార్గంలో ఇలా అనేక ప్రాంతాల నుంచి సీసీ కెమెరాల ఫీడ్ సేకరించామని పేర్కొన్నారు. బాధితురాలి నుంచి సీఆర్పీసీ 161 సెక్షన్ ప్రకారం వాంగ్మూలం రికార్డు చేయడంతో పాటు బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించామని వివరించారు. నేరం జరిగిన ప్రాంతమైన బాధితురాలి ఇంటి నుంచి కీలకాధారాలుగా పరిగణించే రెండు గాజులు, తల వెంట్రుకలు, బెడ్‌షీట్ స్వాధీనం చేసుకున్నట్లు వీటిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దీంతో పాటు ఇబ్రహీంపట్నం చెరువు కట్ట వద్ద జరిగిన కారు ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలిసిన పోలీసులు, కారు మరమ్మతులకు తీసుకువెళ్లిన మెకానిక్‌లు, బాధితురాలి ఇంటి వద్ద ఉన్న వారు సహా మొత్తం 17 మందిని సాక్షులుగా పరిగణిస్తూ వారి నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. నాగేశ్వర్రావుకు చెందిన కారులో బాధితురాలు, ఆమె భర్తలతో కలిసి ప్రయాణించిన ఫుటేజ్‌ను బీఎన్ రెడ్డి నగర్ వద్ద సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని, దాన్ని రికవరీ చేశామని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్గా పని చేసిన నాగేశ్వర్రావు 2018లో బాధితురాలి భర్తను అరెస్టు చేశారు. అప్పట్లో తన కార్యాలయానికి వచ్చిన బాధితురాలిపై కన్నేశాడు. తన భర్తను కేసు నుంచి బయటపడేయాలని ఆమె కోరడంతో అంగీకరించినట్లు నటించాడు. ఆపై బెయిల్‌పై వచ్చిన బాధితురాలి భర్తను తన పొలంలో పనిలో పెట్టుకుని ఈ కథంతా నడుపుకుంటూ వచ్చాడని కేసు పూర్వాపరాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో రాశారు. చదవండి: Kadem Project: ‘కడెం’ దడ మొత్తం 32 పేజీలు ఉన్న రిమాండ్ రిపోర్టులో పోలీసులు కేసుకు సంబంధించిన అంశాలతో పాటు సాక్షుల వాంగ్మూలాలను పొందుపరిచారు. మరోపక్క జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న నాగేశ్వర్రావుకు అధికారులు హైసెక్యూరిటీతో కూడిన సింగిల్ సెల్ కేటాయించారు. అతడు గతంలో అరెస్టు చేసిన నేరగాళ్లలో కొందరు జైల్లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జైల్లో నాగేశ్వర్రావు బుధవారం పూర్తి ముభావంగా ఉన్నాడని తెలిసింది -
అత్యాచార ఆరోపణలు.. మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావు సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో నాగేశ్వరరావుపై అత్యాచారం, హత్యాయత్నం, ఆర్మ్స్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నాగేశ్వర్ రావును విధుల నుంచి తప్పిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బక్రీదు, బోనాల పండుగ బందోబస్తు దృష్ట్యా కార్ఖానా సీఐ నేతాజీని మారేడుపల్లి ఇంచార్జీ సీఐగా సీవీ ఆనంద్ నియమించారు. కాగా జూలై 7న అర్థరాత్రి ఇన్స్పెక్టర్ తనపై అత్యాచారం జరిపినట్లు ఆరోపిస్తూ ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. హస్తినాపురంలో నివసిస్తున్న మహిళ ఇంటికి సీఐ నాగేశ్వరరావు వెళ్లాడు. అర్థరాత్రి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బయటకు వెళ్లిన భర్త ఇంటికి తిరిగి రావడంతో అతన్ని సీఐ రివాల్వర్‌తో బెదిరించాడు. అర్ధరాత్రి సమయంలో ఆ దంపతులిద్దరిని కారులో ఎక్కించుకుని ఇబ్రహీంపట్నం వైపు వెళ్లాడు. అయితే కారు రోడ్డు ప్రమాదానికి గురవడంతో.. సీఐ నుంచి దంపతులిద్దరూ తప్పించుకుని, వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: Hyderabad: చారిత్రక భాగ్యనగరికి విదేశీ పర్యాటక కళ -
ఎయిర్ పోర్ట్‌లో చిరంజీవికి ఘన స్వాగతం
‘ఆచార్య’ షూటింగ్ కోసం మారేడుపల్లికి బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవికి రాజమండ్రి- మధురపూడి ఎయిర్ పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. చిరు రాక సమాచారం తెలుసుకున్న మెగా అభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని పూలమాలలతో స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన కి బయలుదేరిన చిరంజీవి.. అభిమానులకు అభివాదం చేస్తూ ఏజెన్సీలో జరగనున్న షూటింగ్‌కు ర్యాలీగా వెళ్లారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవనున్న ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కొరటాల శివ భావిస్తున్నారు. ఈ క్రమంలో మారేడుమిల్లిలో షూటింగ్ ను షెడ్యూల్ చేశారు. చిరంజీవి-రామ్ చరణ్ కాంబినేషన్లో కొన్ని సీన్లు మారేడుమిల్లిలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు హైదరాబాద్ శివారులో వేసిన టెంపుల్ సెట్లో ఆచార్య షూటింగ్ జరిగిన విషయం తెలిసిందే. చదవండి : ప్యాన్ ఇండియా’ను టార్గెట్ చేసిన చిరు, చెర్రీ, ప్రభాస్ -
కోపంతో ‘కేటీఆర్-ఇవాంక రోడ్డు’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం పట్టించుకోలేదు. విజ్ఞప్తులను నేతలు పెడ చెవిన పెట్టేసిండ్రు. అధికారులేమో నిర్లక్ష్యపు సమాధానాలిచ్చారు. విసిగిపోయిన జనాలు ఆ కోపంలో తమ దారి తామే చూ(వే)సుకున్నరు. విశ్వనగరంలోని మారేడ్‌పల్లి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం కనిపించిన దృశ్యాలు ఇవి. గతుకుల రోడ్లను తమంత తామే బాగు చేసుకున్నారు. చివరకు దానికి పేరు కూడా పెట్టేశారు. విజ్ఞప్తులు పట్టించుకోలేదు... కొంత కాలంగా రోడ్ల అధ్వానపరిస్థితి గురించి ఫిర్యాదులు వెల్లువెత్తినా జీహెచ్ఎంసీ పట్టించుకోలేదు. గతేడాది ఇవాంక ట్రంప్-ప్రధాని మోదీ రాకల సందర్భంగా నగరానికి మరమ్మత్తులు జరిగింది తెలిసిందే. ఆ సమయంలో జీహెచ్ఎంసీకి పలువురు స్థానికులు మళ్లీ విజ్ఞప్తులు చేశారు. బదులుగా ‘ఆమె(ఇవాంక) మీ ప్రాంతంలోకి రావట్లేదు కదా’ అన్న నిర్లక్ష్యపు సమాధానం వచ్చిందని స్థానికులు ఆరోపించారు. ఇంకోపక్క ‘ఇవాంక ఈ వంక రావమ్మా!’ అంటూ సోషల్ మీడియాలో అప్పుడు చిన్నపాటి ఉద్యమం కూడా నడిచింది. అదే సమయంలో టీపీసీసీ అధికార ప్రతినిధి ఎం కృష్ణాంక్ ఆధ్వర్యంలో స్థానికులు ఫ్లకార్డ్లతో ధర్నా కూడా నిర్వహించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. విసిగిపోయి చివరకు... రోజులు గడుస్తున్నాయి. ఇవాంక ఆవైపు రాలేదు.. ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. దీంతో ప్రజలే రంగంలోకి దిగారు. వాళ్లకు కావాల్సిందాన్ని పూర్తి చేసుకున్నారు. కొందరు స్థానికులు స్వచ్ఛందంగా తట్ట చేతబట్టి మట్టితో గుంతలను పూడ్చి రోడ్లను బాగు చేసుకున్నారు. అంతా అయ్యాక చివరకు ఆ రోడ్డుకు తెలంగాణ మంత్రి కేటీఆర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ పేర్లు కలిపి పెట్టేశారు. ప్రభుత్వం, అధికారుల తీరుకు నిరసనగా తాము ఈ పని చేసినట్లు వారు చెబుతున్నారు. ‘కేటీఆర్-ఇవాంక ట్రంప్ రోడ్డు’ అని నామకరణం చేసినట్లు ఫ్లకార్డులను ప్రదర్శించారు. ‘మారేడ్‌పల్లి డేస్’ ఫేస్బుక్ పేజీలో ఆ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. స్థానికులు చేసిన పనిని అభినందిస్తున్న కొందరు.. ప్రభుత్వాలు పని చేయనప్పుడు ప్రజలే ఇలా రంగంలోకి దిగాల్సి వస్తుందని ఇంకొందరు.. మిగతా ప్రాంత ప్రజలు కూడా ప్రభుత్వంపై ఆధారపడకుండా వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. -
విలవిలలాడిన పసిప్రాణం
సాక్షి, హైదరాబాద్: పొరపాటున బ్లేడు కోసుకుంటేనే బాధను తట్టుకోలేం.. అలాంటిది కత్తెరతో వేలినే కత్తిరించినపుడు.. అదీ పది రోజుల పసికందుకు జరిగితే.. ఆ పసిప్రాణం విలవిల్లాడుతుంది.. ఈ లోకంలోకి వచ్చీరాగానే నరకం చూసింది. ఈ సంఘటన సికింద్రాబాద్ మారేడుపల్లిలోని బసంత్ సహాని ఆస్పత్రిలో జరిగింది. పదిరోజుల ఆడశిశువు చిటికెన వేలును నర్సు నిర్లక్ష్యంగా కత్తిరించేసింది. బోయిన్పల్లి సర్వదామనగర్కు చెందిన సూర్యకాంత్, అంబిక భార్యాభర్తల కుమార్తె బాధితురాలిగా మిగిలింది. పుట్టిన కవల పిల్లలు బరువు తక్కువగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం డిచ్చార్జి చేసేందుకు సిద్దమయ్యారు. శిశువుకు చేతికి వేసిన బ్యాండేజ్‌ను తొలగిస్తూ సుమలత అనే నర్సు పాప వేలిని కట్‌చేసింది. చిటికెన వేలు కొంతభాగం ముక్క తెగిపడింది. దీంతో ఒక్కసారిగా బంధువులు ఆందోళనకు గురై ఆస్పత్రి సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. దీంతో నర్సు అక్కడి నుంచి పరారైంది. పాప చేతి వేలికి ప్లాస్టిక్ సర్జరీ చేయడం సాధ్యం కాదని వైద్య నిపుణులు చెప్పారు. -
అనాధాశ్రమంలో వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు
-
టీఆర్ఎస్ ప్రచార వాహనం సీజ్
మారేడుపల్లి (హైదరాబాద్) : అనుమతులు లేకుండా డీజే సౌండ్స్‌తో టీఆర్ఎస్ పార్టీకి ప్రచారం నిర్వహిస్తున్న ఓ ట్రాలీని మారేడుపల్లి పోలీసులు గురువారం సీజ్ చేశారు. మోండా డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆకుల రూప హరికృష్ణకు ప్రచారం నిర్వహిస్తున్న ఆటో ట్రాలీ ( ఏపీ 10 వీ 9834) వాహనానికి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అనుమతులు లేవన్న సమాచారంతో పోలీసులు ట్రాలీ డ్రైవర్ కరుణాకర్, సౌండ్‌బాక్స్‌ల నిర్వాహకుడు నీలంకర్ను మారేడుపల్లి కస్తూర్బా కళాశాల వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు తేలడంతో నిందితులపై కేసు నమోదు చేసి ఆటో ట్రాలీ, సౌండ్ బాక్స్‌లను సీజ్ చేశారు. -
ఈ అభాగ్యుడ్ని ఆదుకోండి...
సికింద్రాబాద్: రెండు కిడ్నీలు పాడైపోయి ఓ పేద యువకుడు దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. మారేడుపల్లి డివిజన్ ఈస్ట్‌మారేడుపల్లిలోని వడ్డెర బస్తీలో నివాసం ఉంటున్న గోవింద్(21)కు ఒక కిడ్నీ పూర్తిగా రెండో కిడ్నీ 70 శాతం దెబ్బతిన్నది. గోవింద్ తండ్రి సరవయ్య రిక్షా కార్మికుడు. తల్లి శకుంతల ఇళ్లలో పాచిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోవింద్ అనారోగ్యం ఆ కుటుంబానికి శాపంగా మారింది. ఇటీవల గాంధీ ఆస్పత్రిలో చికిత్సలు జరిపినా...కనీసం ఒక్క కిడ్నీ అయినా మార్పు చేయాల్సిందేనని వైద్యులు తేల్చి చెప్పారు. అయితే, కిడ్నీ మార్పు ఖర్చుతోకూడుకున్నదని, అంత స్థోమత తమకు లేదని గోవింద్ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఎవరైనా దాతలు సహాయం చేసి (ఫోన్: 9502901819) ఆదుకోవాలని కోరుతున్నారు. -
దూకుడు పెంచిన ఆర్మీ అధికారులు
కంటోన్మెంట్: కంటోన్మెంట్ పరిధిలోని ఆర్మీ రోడ్లపైకి సామాన్యుల రాకపోకలను అక్టోబర్ 2 నుంచి రాత్రి వేళల్లో నియంత్రించనున్నట్టు ప్రకటించిన ఆర్మీ అధికారులు.. రెండ్రోజుల ముందే చర్యలు ప్రారంభించారు. ఎలాంటి సమాచారం లేకుండా సోమవారం రాత్రి ఆంక్షలు విధించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మారేడ్‌పల్లి నుంచి ఏఓసీకి వెళ్లే మార్గంలోని అలహాబాద్ గేట్ వద్ద, పికెట్- ఏఓసీ మార్గంలో స్టాప్ అండ్ గో బేకరీ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి కిలో మీటర్లు మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తూతూ మంత్రంగా భేటీ ఆంక్షల అమలు నేపథ్యంలో ఏఓసీ సెంటర్ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం సమీప కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశం మొక్కుబడిగా ముగిసింది. భేటీకి హాజరైన ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న అభిప్రాయాలను సైతం ఖాతరు చేయకుండా ఆర్మీ అధికారులు తామేమి చెప్పాలనుకున్నారో దానికే పరిమితమయ్యారు. ఆంక్షల నేపథ్యంలో ప్రజలకు ఎదురయ్యే సమస్యలపై చర్చించి పరిష్కరించుకునేందుకు వీలుగా ఐదుగురు సభ్యులతో కూడిన సివిల్ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యామ్నాయ రోడ్లను ఏర్పాటు చేసే వరకు రాత్రివేళల్లో సైతం రోడ్లను మూసేయొద్దని ఎంపీ, ఎమ్మెల్యే పదేపదే కోరినా అర్మీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన మల్లారెడ్డి, సాయన్న సమావేశం నుంచి బయటకు వెళ్లడంతో ప్రజలు సైతం వారిని అనుసరించారు. బాబుతో ఒత్తిడి తెప్పిస్తా: మల్లారెడ్డి సమస్యను కేంద్ర రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ మల్లారెడ్డి తెలిపారు. తమ పార్టీ అధినేత చంద్రబాబును కలిసి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి సమస్యను పరిష్కరిస్తామన్నారు. -
శివలాల్‌కు పితృవియోగం
మారేడ్‌పల్లి,న్యూస్‌లైన్: బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి ఎస్జీ నందలాల్ (89) మంగళవారం తెల్లవారుజామున ఇక్కడి స్వగృహంలో కన్నుమూశారు. ఆయనకు భార్య రామ్బాయి, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. శివలాల్ పెద్ద కుమారుడు కాగా, రాజేశ్ యాదవ్, వీరేందర్ యాదవ్‌లు ఆ తర్వాతి వారు. ముగ్గురు కుమార్తెలలో ఇంద్రాణి పటేల్ ముంబైలో స్థిర నివాసం ఏర్పరచుకోగా, సుజాత యాదవ్, విద్యాయాదవ్ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. రెజ్లింగ్ క్రీడలో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న నందలాల్, దాదాపు 50 ఏళ్ల పాటు మిలిటరీ డైరీ ఫామ్‌కు పాల కాంట్రాక్టర్‌గా వ్యవహరించారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం మెట్టుగూడలోని యాదవ సమాజ శ్మశాన వాటికలో జరిగాయి. శివలాల్ తండ్రి మృతి పట్ల బీసీసీఐ ప్రముఖులు, హెచ్‌సీఏ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. -
మారేడుపల్లిలో ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం
నగరంలోని మారేడుపల్లిలో ఓ అపార్ట్మెంట్లో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. అపార్ట్మెంట్ వాసులు భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపకశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు అపార్ట్ మెంట్ వాసులను ప్రశ్నిస్తున్నారు.