marredpally police station
-
విధుల నుంచి మాజీ సీఐ నాగేశ్వరరావు తొలగింపు
సాక్షి, హైదరాబాద్: మారేడుపల్లి మాజీ సీఐ నాగేశ్వరరావుపై పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. మహిళను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను విధుల నుంచి తొలగిస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సోమవారం ఉత్వర్వులు జారీ చేశారు. వనస్థలిపురంలో వివాహితను తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన సీఐ కోరట్ల నాగేశ్వరరావును గతంలోనే పోలీస్ శాఖ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. నాగేశ్వరరావుపై ఇప్పటికే వనస్థలిపురం పోలీసులు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. కొద్దీ రోజుల క్రితమే కండిషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో మొత్తం 39 మందిని పోలీస్ శాఖ సర్వీస్ నుంచి తొలగించింది. గత పది నెలల్లో 55 మందిపై చర్యలు తీసుకుంది. తీవ్రమైన నేరారోపణలపై ఆర్టికల్ 311(2) బి కింద విధుల నుంచి తొలగించింది. సర్వీస్ రిమూవల్ కోరుతూ హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ రిక్రూట్మెంట్ అథారిటీకి లేఖ రాశారు. ఈ మేరకు సీపీ లేఖను పరిగణలోకి తీసుకున్న పోలీస్ రిక్రూట్మెంట్ అథారిటీ సర్వీస్ నుంచి తొలగించింది. -
Hyderabad: మాజీ సీఐ నాగేశ్వర్రావు అరెస్టు.. కీలక ఆధారాల సేకరణ
సాక్షి, హైదరాబాద్: వివాహిత కణతపై తుపాకీ పెట్టి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ మారేడ్‌పల్లి మాజీ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు కేసులో పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. ఈకేసు దర్యాప్తుకు వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తమ్‌రెడ్డి నేతృత్వంలో స్పెషల్ టీం ఏర్పాటు చేయగా.. అత్యాచారం ఘటనా స్థలం నుంచి ఇబ్రహీంపట్నం యాక్సిడెంట్ వరకు కీలక ఆధారాలు సేకరించింది. ఆదివారం రాత్రి లొంగిపోయిన నాగేశ్వరరావుని సిట్ బృందం సోమవారం వివిధ కోణాల్లో విచారించింది. ప్రాథమిక దర్యాప్తులో నేరం రుజువైందని సిట్ తేల్చింది. మహిళపై రివాల్వర్ గురిపెట్టి కిడ్నాప్‌కు పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలితో పాటు ఆమె భర్తను బెదిరించడానికి, వారిపై దాడి చేయడానికి నాగేశ్వర్రావు తన అధికారిక పిస్టల్ వాడినట్లు ఫిర్యాదులో ఉంది. దీని ఆధారంగానే కేసు నమోదు చేసిన పోలీసులు ఆ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ఎస్సై నిర్వాకం.. పెళ్లి చేసుకుంటానని పదేళ్లుగా సహజీవనం.. మరొక మహిళతో ఈ కేసులో బాధితురాలికి మెడికల్ పరీక్షలు పూర్తి అయ్యాయి. సైంటిఫిక్ ఎవిడెన్స్ కీలకం కానుంది. స్థానికుల స్టేట్మెంట్నుపోలీసులు రికార్డ్ చేశారు. టవర్ లొకేషన్ ట్రేస్ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. సెటిల్మెంట్, వసూళ్లు, బెదిరింపుల ఆరోపణల నేపథ్యంలో సమగ్ర దర్యాప్తుకు సిట్ ఆదేశించింది.మరోపక్క కేసు దర్యాప్తులో భాగంగా రాచకొండ పోలీసులు హస్తినాపురం శ్రీ వెంకటరమణ కాలనీలోని బాధితురాలి ఇంటి వద్దకు వెళ్లి పలు ఆధారాలు సేకరించారు. ఆ ఇంటి వద్ద, ఇతర ప్రాంతాల్లో, ఇబ్రహీంపట్నం చెరువు కట్ట సమీపంలో నాగేశ్వర్రావు, బాధితురాలు, ఆమె భర్తను చూసిన ప్రత్యక్ష సాక్షుల్లో కొందరి నుంచి వాంగ్మూలం సేకరించారు. నాగేశ్వర్రావుకు పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. ఇతడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన తర్వాత కస్టడీకి అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. సోమవారం ఉదయం నాగేశ్వర్రావును బాధితురాలి ఇంటి వద్దకు, అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం చెరువు కట్ట వద్దకు తీసుకువెళ్లి కొన్ని వివరాలు సేకరించారు. అనంతరం ఆయనను వనస్థలిపురం పోలీసులు హయత్‌నగర్ మెజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో నాగేశ్వరరావును చర్లపల్లి జైలుకు తరలించారు. -
రాచకొండ పోలీసులను బురిడీ కొట్టించిన సీఐ నాగేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహితను బెదిరించి అత్యాచారం చేసిన సీఐ నాగేశ్వరరావు రాచకొండ పోలీసులను బురిడీ కొట్టించాడు. నాగేశ్వరరావును అరెస్ట్ చేసేందుకు శనివారం సాయంత్రం ఎస్ఓటీ పోలీసులు రాగా.. డ్యూటీలో ఉన్నానని ఉదయం లొంగిపోతానని చెప్పాడు. అయితే అర్ధరాత్రి 12.15 నుంచి మొబైల్ స్వీచ్చాఫ్ చేశాడు. రెండు రోజులుగా నాగేశ్వరరావు పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. సీఐ కోసం నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి.ఇదిలా ఉండగా సీఐ నాగేశ్వరరావు అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఓ కేసులో అక్రమంగా బీఎండబ్ల్యూ కారును తన వద్దే ఉంచుకొని సీజ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా సీఐ నాగేశ్వరరావును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్‌లోని ఏసీపీ కార్యాలయాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. డీసీపీ కార్యాలయం ముందు బైఠాయించి మహిళ లు, యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులే మహిళపై అత్యాచారం చేసి బెదిరింపులకు పాల్పడితే ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని డిమాండ్ చేశారు. .24 గంటల్లో సీఐ నాగేశ్వరరావుని అరెస్ట్ చేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. కాగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. -
ఏమైందీ పోలీసుకీ.. ∙ఖా‘కీచకుడిగా’ మారిన ఓ ఇన్స్పెక్టర్..
సాక్షి, హైదరాబాద్/హస్తినాపురం: వివాహిత కణితికి తుపాకీ గురిపెట్టి అత్యాచారం చేసిన కేసులో నిందితుడిగా మారిన ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఒకప్పుడు కేవలం అవినీతి ఆరోపణలు మాత్రమే ఎదుర్కొనే పోలీసులు కాలక్రమంలో ‘అప్డేట్’ అవుతూ వచ్చారు. హత్య కేసుల్లో నిందితులకు సహకరించడంతో పాటు ఏకంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అత్యాచారాలు చేసే వరకు వెళ్లారు. ఉన్నతాధికారులు మాత్రం ఈ వ్యవహారాలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. మామూళ్లతో మొదలై సెటిల్మెంట్ల దాకా.. పోలీసు విభాగంలో పని చేసే అధికారులు, సిబ్బందికి ఒకప్పుడు రోజు, వారం, నెల వారీ మామూళ్లు వసూలు చేసే విధానం ఉండేది. దీనికోసం ప్రత్యేకంగా కలెక్టర్లు, రోడ్ మాస్టర్లుగా కొందరు సిబ్బంది పని చేసే వాళ్లు. ఆ తర్వాత కేసుల్లో కాసుల దందాలు మొదలయ్యాయి. కొన్ని కేసుల్లో బాధితులకు న్యాయం చేయాలన్నా, మరికొన్నింటిలో నిందితులకు మేలు చేయాలన్నా రేట్లు కట్టి మరీ వసూలు చేయడం మొదలెట్టారు. రాజధానిలో రియల్ బూమ్ మొదలైన తర్వాత పోలీసులకు పండగ వచ్చిపడింది. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుని సెటిల్మెంట్లు చేస్తూ రెండు చేతులా సంపాదించడం మొదలెట్టారు. ఆయా ఆరోపణలపై అనేక మందిపై ఏసీబీ కేసులు, క్రిమినల్ కేసులు, అరెస్టులు, వేటులు కూడా జరిగాయి. హత్యలు, అత్యాచారాలు.. కొన్నేళ్లుగా హత్యలు, అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లోనూ వీరి పేర్లు బయటకు రావడం, నిందితులుగా నమోదు కావడం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జయరామ్ హత్య కేసులో నిందితుడు రాకేష్‌రెడ్డికి సహకరించారనే ఆరోపణలపై ఏసీపీ మల్లారెడ్డి, ఇన్స్పెక్టర్లు రాంబాబు, శ్రీనివాసులుపై వేటు పడింది. వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగినితో అభ్యంతరకర ప్రవర్తన ఆరోపణలపై ఇన్స్పెక్టర్ చంద్రకుమార్‌పై నిర్భయ కేసు నమోదైంది. ఇలాంటి ఉదంతాలు మరికొన్ని ఉన్నా.. తాజాగా ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావుపై వచ్చిన ఆరోపణలు గతానికి భిన్నంగా అత్యంత తీవ్రంగా ఉన్నాయి. అధికారులు సీరియస్.. వినీతి ఇతర ఆరోపణల విషయంలో కంటే మహిళలపై జరిగే అత్యాచారం తదితర ఆరోపణలు వచ్చిన అధికారుల విషయాన్ని ఉన్నతాధికారులు మరింత సీరియస్‌గా తీసుకుంటున్నారు. నాగేశ్వర్రావు విషయానికే వస్తే... గురువారం బాధితురాలి ఫిర్యాదుతో వనస్థలిపురం ఠాణాలో కేసు నమోదైంది. వెంటనే స్పందించిన అధికారులు బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించడం, ఆమెతో భరోసా కేంద్రంలో వాంగ్మూలం తీసుకోవడంతో పాటు క్లూస్ టీమ్‌తో ఆమె ఇంట్లో పలు ఆధారాలు సేకరించేలా చర్యలు తీసుకున్నారు. బాధితురాలి వాంగ్మూలంతో ఇబ్రహీంపట్పం చెరువు వద్ద ప్రమాదం బయటపడింది. దీంతో సుమోటోగా మరో కేసు నమోదు చేయించారు. నగర కొత్వాల్ స్పందించి నాగేశ్వర్రావును సస్పెండ్ చేసి అంతర్గత విచారణకు ఆదేశించారు. కారులో తీసుకెళ్లి హత్యకు యత్నం.. సీఐ నాగేశ్వర్రావు తమను కారులో నగర శివార్లకు తీసుకువెళ్లి హత్య చేయాలని భావించాడు. ఆయన నాలుగేళ్లుగా మా కుటుంబాన్ని వేధిస్తున్నాడు. 2018 కేసులో బెయిల్‌పై వచ్చినప్పటి నుంచి యాచారంలోని తన వ్యవసాయ క్షేత్రంలో బలవంతంగా పని చేయిస్తున్నాడు. మానేస్తే మరో కేసులో ఇరికిస్తానంటూ 24 గంటలూ చాకిరీ చేయిస్తున్నాడు. మమ్మల్ని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తీసుకువెళ్లి గంజాయితో ఫొటోలు, వీడియోలు తీసినప్పుడు నన్ను గంజాయి కేసులో, నా భార్యను వ్యభిచారం కేసులో జైలుకు పంపిస్తానంటూ రాయించుకుని వదిలాడు. నా భార్యకు కరోనా సోకడంతో పిల్లల్ని ఊరిలో వదిలిరావడానికి బుధవారం వెళ్లా. ఆ రోజు ఇన్స్పెక్టర్ నా భార్యకు ఫోన్ చేసిన విషయం నాకు చెప్పింది. దీంతో గురువారం రాత్రి 9.30 గంటలకు వచ్చేశా. జ్వరంతో ఉన్న నా భార్యకు టిఫిన్ తీసుకురావడానికి బయటకు వెళ్లా. తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. బలవంతంగా తెరవగా నా భార్యపై అత్యాచారం చేసిన నాగేశ్వర్రావు కనిపించాడు. ఆత్మరక్షణ కోసం అతడిపై దాడి చేశా. ఈ గలాభా విని ఇరుగుపొరుగు వాళ్లు రాగా... భార్యభర్తల గొడవని చెప్పాలని నాగేశ్వర్రావు బెదిరించడంతో అలానే చేశా. తెల్లవారుజాము మూడు గంటల వరకు నన్ను, నా భార్యను మోకాళ్లపై కూర్చో బెట్టి చంపేస్తానని బెదిరించాడు. మూడున్నర గంటలకు అతడి కారులో కిడ్నాప్ చేశాడు. నా కణతపై తుపాకీ గురిపెట్టి నాగార్జునసాగర్ రోడ్లో వెళ్లమన్నాడు. ఇబ్రహీంపట్నం చెరువు ప్రాంతంలో నేను నడుపుతున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. నేను, ఇన్స్పెక్టర్ బయట ఎగిరిపడగా... వెనుక సీట్లోని నా భార్య అందులోనే ఉండిపోయింది. ముందు సీట్లో నుంచి ఆమెను బయటికి తీస్తుండగా సీఐకి చెందిన రెండు సెల్ఫోన్లు కనిపించా యి. అవి తీసుకుని ఇబ్రహీంపట్నం చెరువు కట్టపైకి వెళ్లా. ఫోన్ సిగ్నల్ ఆధారంగా మమ్మల్ని వెంబడిస్తాడని గ్రహించి వాటిని చెరువులో పడేసి ఆర్టీసీ బస్సులో తిరిగి వచ్చాం. ∙మీడియాకు విడుదల చేసిన వీడియోలో బాధితురాలి భర్త. -
కీలకంగా మారిన సీసీ కెమెరాల ఫుటేజీ
-
ఆ 45 నిమిషాల్లో ఏం జరిగింది?
కీలకంగా మారిన సీసీ కెమెరాల ఫుటేజీ మారేడుపల్లి: సంచలనం సృష్టించిన మారేడుపల్లి పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసిన కేసును పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడిలో బన్నప్ప కుటుంబ సభ్యులతో ఎవరెవరు పాల్గొన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు సీసీ కెమెరాల పుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సోమవారం రాత్రి 9.15 నిమిషాలకు ప్రారంభమైన గొడవ... 10 గంటల వరకు జరిగిన పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇటు మారేడుపల్లి పోలీసులతో పాటు సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. బన్నప్పను సోమవారం మధ్యాహ్నం పోలీస్‌స్టేషన్ నుంచి పంపించిన తర్వాత కుటుంబ సభ్యులు ఆటోలో అతడిని రాత్రి 8.30కి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీసులు తీవ్ర అస్వస్థతకు గురైన బన్నప్పకు ఓ కానిస్టేబుల్‌ను తోడు ఇచ్చి అదే ఆటోలో ఆసుపత్రికి తరలించారు. మార్గంమధ్యలో బన్నప్ప మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. మృతదేహాన్ని ఆటోలో తిరిగి మారేడుపల్లి స్టేషన్‌కు తీసుకొస్తూ మహాత్మాగాంధీనగర్ బస్తీవాసులకు బన్నప్ప మృతిపై సమాచారం ఇచ్చారు. 9.15కి బన్నప్ప మృతదేహంతో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న బంధువులు విధి నిర్వహణలో ఉన్న ఎస్సై రవికుమార్, మధులతో వాగ్వాదానికి దిగారు.స్టేషన్‌కు సమీపంలోనే మహాత్మాగాంధీనగర్ ఉండటంతో బస్తీలోని వారు భారీ ఎత్తున పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. 9.30కి గొడవ పెద్దదైంది. బన్నప్ప మృతికి పోలీసులే కారణమని పోలీస్‌స్టేషన్‌లో 9.35కి పోలీసులపై దాడి చేశారు. అకస్మాత్‌గా జరుగుతున్న పరిణామాలతో నెవ్వెరపోయిన పోలీసులు ఏమీ చేయలేకపోయారు. సెట్లో కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇస్తుండగా ఆందోళనకారులు సెట్‌ను ధ్వంసం చేశారు. చిన్నగా మొదలైన గొడవ 9.45కి మరింత పెద్దదైంది. రోడ్లపై ఎక్కువగా మంది చేరుకొని ఆ మార్గంలో వెళ్లే వాహనాలపై దాడికి పాల్పడ్డారు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న కంప్యూటర్లు, ఫైళ్లు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. 9.47కు నిమిషాలకు పోలీస్‌స్టేషన్ దారిగుండా వస్తున్న రెండు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. 9.52కి పెట్రోలింగ్‌లో వస్తున్న పోలీస్ వాహనంపై రాళ్లు రువ్వారు. 9 గంటల 47 నిమిషాలకు పోలీస్‌స్టేషన్ వద్దనున్న ఎస్.ఐ మధు వాహనంతోపాటు మరో రెండు వాహనాలను స్టేషన్ ముందు నిప్పంటించారు. -
కిడ్నాప్ కాదు.. తల్లే అమ్మేసింది
సికింద్రాబాద్: మారేడ్‌పల్లి పోలీసుస్టేషన్లో నమోదైన చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు సోమవారం ఛేదించారు. తల్లే బాలుడ్ని అమ్మిసే.. భర్తకు తనపై అనుమానం రాకుండా ఉండేందుకు కిడ్నాప్ డ్రామా ఆడిందని తేల్చారు. ఇతరులకు విక్రయించిన బాలుడిని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు అనుమానితులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్లో ఉన్న తల్లిని రప్పించి విచారించిన మీదట ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగచూసే అవకాశం ఉంది. ఉత్తర మండలం డీసీపీ జీ.సుధీర్‌బాబు కథనం ప్రకారం....కరీంనగర్ జిల్లా కేంద్రం గణేశ్నగర్కాలనీలో ఉంటున్న బుర్ర రాజు భార్య రజిత రెండవ కాన్పులో నెలన్నర క్రితం ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చింది. ప్రసవం కోసం మంథనిలోని పుట్టింటికి వచ్చిన రజిత కవలల్లో ఒకరిని విక్రయించాలనుకుంది. భాగ్యమ్మ, జంగం లక్ష్మి అనే ఇద్దరి సహకారంతో నాచారంలో నివసిస్తున్న వరంగల్ జిల్లా గోవిందరావుపేటకు చెందిన ఎం.భుజంగరావుకు 20 రోజుల క్రితం రూ. 1.32 లక్షలకు విక్రయించింది. విషయం తన భర్తకు తెలియకుండా ఉండేందుకు తన తల్లితో కలిసి కొత్త డ్రామాకు సిద్ధపడింది. రజిత తన మొదటి కుమారుడు, కవల పిల్లలో మిగిలిన ఒకరిని తీసుకుని తల్లితో కలిసి ఈనెల 7న హబ్సిగూడలోని తన బంధువుల ఇంటికి వ్యక్తిగత పనిపై వచ్చింది. ముందే వేసుకున్న పథకం ప్రకారం తిరుగు ప్రయాణంలో కిడ్నాప్ డ్రామాను అమలు చేసింది. తన ఇద్దరు కవల పిల్లలతో యాదగిరిగుట్ట వెళ్లి తిరిగి వస్తూ కరీంనగర్ బస్సు కోసం జూబ్లీ బస్‌స్టేషన్ లో వేచి ఉన్నానని, బాత్రూమ్కు వెళ్తూ కవల పిల్లల్లో ఒకరిని పక్కనే ఉన్న ప్రయాణికురాలికి ఇవ్వగా పిల్లవాడిని తీసుకొని మాయమైందని మారేడ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ అయిన తన కుమారుడిని తనకు ఇప్పించాలని వేడుకుంది. రజిత ఫిర్యాదుపై అనుమానం వచ్చి పోలీసులు ఆమెపై ఓ కన్నేసి ఉంచారు. తల్లే బాలుడ్ని విక్రయించిందని తెలుసుకొన్నారు. భుజంగరావు వద్ద ఉన్న చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. బాలుడు కిడ్నాప్ కాలేదని, తల్లే చిన్నారిని విక్రయించిందని పోలీసులు వెల్లడించారు. భర్తకు అనుమానం రాకుండా ఉండేందుకే కిడ్నాప్ డ్రామా ఆడిందా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అన్న అంశంపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్లో ఉన్న రజితను అదుపులోకి తీసుకుని విచారించాక అసలు విషయం వెల్లడిస్తామని డీసీపీ జీ.సుధీర్‌బాబు చెప్పారు. రెండ్రోజుల్లోనే కిడ్నాప్ డ్రామాకు తెరదించిన మారేడ్‌పల్లి ఇన్స్పెక్టర్ బి.రవీందర్‌రెడ్డి బృందాన్ని డీసీపీ సుధీర్‌బాబు, మహంకాళి ఏసీపీ తిరుపతి అభినందించారు.