
ఆ 45 నిమిషాల్లో ఏం జరిగింది?
కీలకంగా మారిన సీసీ కెమెరాల ఫుటేజీ
మారేడుపల్లి: సంచలనం సృష్టించిన మారేడుపల్లి పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసిన కేసును పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడిలో బన్నప్ప కుటుంబ సభ్యులతో ఎవరెవరు పాల్గొన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు సీసీ కెమెరాల పుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సోమవారం రాత్రి 9.15 నిమిషాలకు ప్రారంభమైన గొడవ... 10 గంటల వరకు జరిగిన పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఇటు మారేడుపల్లి పోలీసులతో పాటు సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. బన్నప్పను సోమవారం మధ్యాహ్నం పోలీస్‌స్టేషన్ నుంచి పంపించిన తర్వాత కుటుంబ సభ్యులు ఆటోలో అతడిని రాత్రి 8.30కి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీసులు తీవ్ర అస్వస్థతకు గురైన బన్నప్పకు ఓ కానిస్టేబుల్‌ను తోడు ఇచ్చి అదే ఆటోలో ఆసుపత్రికి తరలించారు. మార్గంమధ్యలో బన్నప్ప మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.
మృతదేహాన్ని ఆటోలో తిరిగి మారేడుపల్లి స్టేషన్‌కు తీసుకొస్తూ మహాత్మాగాంధీనగర్ బస్తీవాసులకు బన్నప్ప మృతిపై సమాచారం ఇచ్చారు. 9.15కి బన్నప్ప మృతదేహంతో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న బంధువులు విధి నిర్వహణలో ఉన్న ఎస్సై రవికుమార్, మధులతో వాగ్వాదానికి దిగారు.స్టేషన్‌కు సమీపంలోనే మహాత్మాగాంధీనగర్ ఉండటంతో బస్తీలోని వారు భారీ ఎత్తున పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. 9.30కి గొడవ పెద్దదైంది. బన్నప్ప మృతికి పోలీసులే కారణమని పోలీస్‌స్టేషన్‌లో 9.35కి పోలీసులపై దాడి చేశారు. అకస్మాత్‌గా జరుగుతున్న పరిణామాలతో నెవ్వెరపోయిన పోలీసులు ఏమీ చేయలేకపోయారు. సెట్‌లో కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇస్తుండగా ఆందోళనకారులు సెట్‌ను ధ్వంసం చేశారు.
చిన్నగా మొదలైన గొడవ 9.45కి మరింత పెద్దదైంది. రోడ్లపై ఎక్కువగా మంది చేరుకొని ఆ మార్గంలో వెళ్లే వాహనాలపై దాడికి పాల్పడ్డారు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న కంప్యూటర్లు, ఫైళ్లు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. 9.47కు నిమిషాలకు పోలీస్‌స్టేషన్ దారిగుండా వస్తున్న రెండు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. 9.52కి పెట్రోలింగ్‌లో వస్తున్న పోలీస్ వాహనంపై రాళ్లు రువ్వారు. 9 గంటల 47 నిమిషాలకు పోలీస్‌స్టేషన్ వద్దనున్న ఎస్.ఐ మధు వాహనంతోపాటు మరో రెండు వాహనాలను స్టేషన్ ముందు నిప్పంటించారు.