శ్వాసకోశ వ్యాధితోనే బన్నప్ప మృతి! | Bannappa died with lung disease | Sakshi
Sakshi News home page

శ్వాసకోశ వ్యాధితోనే బన్నప్ప మృతి!

Published Wed, Aug 5 2015 2:16 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

శ్వాసకోశ వ్యాధితోనే బన్నప్ప మృతి! - Sakshi

శ్వాసకోశ వ్యాధితోనే బన్నప్ప మృతి!

పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడి
విస్రా నివేదిక వస్తేనే.. పూర్తి వివరాలు
పోలీసు బలగాల నడుమ బన్నప్ప అంత్యక్రియలు
బస్తీలోనే మకాం వేసిన మంత్రి పద్మారావు, ఎమ్మెల్యే సాయన్న
బాధిత కుటుంబానికి జస్టిస్ చంద్రకుమార్ పరామర్శ

 
హైదరాబాద్: మారేడ్‌పల్లి ఠాణాపై దాడి ఘటనకు సంబంధించిన కేసులో మృతుడు బన్నప్ప(35) శ్వాసకోశ సమస్యతోనే మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. బన్నప్ప మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో ప్రొఫెసర్ రమణమూర్తి ఆధ్వర్యంలో మారేడుపల్లి ఎమ్మార్వో సైదులు సమక్షంలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం స్థానిక శ్మశాన వాటికలో పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు జరిపారు. మంత్రి పద్మారావు, ఎమ్మెల్యే సాయన్న బస్తీలోనే మకాం వేసి ఉద్రిక్తతలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మంగళవారం ఉదయం గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం ముగిసిన వెంటనే బన్నప్ప మృతదేహాన్ని వాల్మీకినగర్‌కు తీసుకురాగా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలని బన్నప్ప కుటుంబ సభ్యు లు నేతలను డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

శ్వాసకోశ సమస్యతోనే..: శ్వాసకోశ సమస్యతోనే బన్నప్ప మృతిచెందినట్లు  వైద్యులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.  మృతుని ఒంటిపై, అంతర్గతంగా ఎటువంటి గాయాలు లేవని, ఎడమకాలుకు గీరుకున్న గాయమే ఉందని నివేదికలో పేర్కొన్నట్లు తెలి సింది. మృతుని కడుపులో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని, పడుకున్నప్పుడు వాంతులు కావడంతో, ఆహారం శ్వాసకోశ నాళానికి అడ్డుపడి ఉండొచ్చని, దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి బన్నప్ప మృతిచెంది ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. విస్రా నివేదిక ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడి కావచ్చన్నారు.  

ఇద్దరు ఎస్సైలపై వేటు: బన్నప్ప మృతికి కారణమైన ఇద్దరు ఎస్‌ఐలపై ఉన్నతాధికారులు వేటువేశారు. ఆదివారం రాత్రి బన్నప్పను అదుపులోకి తీసుకున్న ఎస్సైలు బాధ్యతారహితంగా వ్యవహరించారని పేర్కొంటూ ఎస్సై రవికుమార్, మధులను హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. సోమవారం రాత్రి ఠాణాపై బన్నప్ప బంధువుల దాడి అనంతరం నగర పోలీస్ కమి షనర్ మహేందర్‌రెడ్డి పరిస్థితిని సమీక్షించారు.
 
 దాడి ఘటనపై 4 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
 మారేడుపల్లి పోలీస్‌స్టేషన్‌పై సోమవారం రాత్రి దాడికి పాల్పడి కీలకమైన ఫైళ్లతోపాటు పోలీస్‌స్టేషన్ ధ్వంసానికి పాల్పడిన వారిపై మొత్తం 4 ఎఫ్‌ఐఆర్‌లను పోలీసులు నమోదు చేశారు. పోలీస్‌స్టేషన్‌పై దాడి, విధ్వంసంలో సుమారు 100 మంది పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీస్‌స్టేషన్ దగ్గరున్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా దాడి ఘటనపై సీసీఎస్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శ్యామ్‌బాబు పోలీస్‌స్టేషన్ లోపల ధ్వంసమైన కంప్యూటర్లు, రికార్డులను పరిశీలించారు.

 జస్టిస్ చంద్రకుమార్ పరామర్శ
 బన్నప్ప కుటుంబ సభ్యులను మంగళవారం జస్టిస్ చంద్రకుమార్ పరామర్శించి మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. మనుషులను కొట్టడం చట్ట వ్యతిరేకమని, ప్రజలు కూడా దాడులకు పాల్పడటం తగదన్నారు.

 ఆలిండియా లాయర్ల సంఘం విచారణ
 బన్నప్ప మృతి, స్టేషన్‌పై దాడికి సంబంధించిన వివరాల్ని ఆలిండియా న్యాయవాదుల సంఘం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం లో పార్థసారథి, శివకుమార్, పాశం యాదగిరి, మాధవరెడ్డి, ప్రవీణ్ పాల్గొన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement