
కిడ్నాప్ కాదు.. తల్లే అమ్మేసింది
సికింద్రాబాద్: మారేడ్‌పల్లి పోలీసుస్టేషన్‌లో నమోదైన చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు సోమవారం ఛేదించారు. తల్లే బాలుడ్ని అమ్మిసే.. భర్తకు తనపై అనుమానం రాకుండా ఉండేందుకు కిడ్నాప్ డ్రామా ఆడిందని తేల్చారు. ఇతరులకు విక్రయించిన బాలుడిని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు అనుమానితులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్‌లో ఉన్న తల్లిని రప్పించి విచారించిన మీదట ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగచూసే అవకాశం ఉంది.
ఉత్తర మండలం డీసీపీ జీ.సుధీర్‌బాబు కథనం ప్రకారం....కరీంనగర్ జిల్లా కేంద్రం గణేశ్‌నగర్‌కాలనీలో ఉంటున్న బుర్ర రాజు భార్య రజిత రెండవ కాన్పులో నెలన్నర క్రితం ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చింది. ప్రసవం కోసం మంథనిలోని పుట్టింటికి వచ్చిన రజిత కవలల్లో ఒకరిని విక్రయించాలనుకుంది. భాగ్యమ్మ, జంగం లక్ష్మి అనే ఇద్దరి సహకారంతో నాచారంలో నివసిస్తున్న వరంగల్ జిల్లా గోవిందరావుపేటకు చెందిన ఎం.భుజంగరావుకు 20 రోజుల క్రితం రూ. 1.32 లక్షలకు విక్రయించింది. విషయం తన భర్తకు తెలియకుండా ఉండేందుకు తన తల్లితో కలిసి కొత్త డ్రామాకు సిద్ధపడింది. రజిత తన మొదటి కుమారుడు, కవల పిల్లలో మిగిలిన ఒకరిని తీసుకుని తల్లితో కలిసి ఈనెల 7న హబ్సిగూడలోని తన బంధువుల ఇంటికి వ్యక్తిగత పనిపై వచ్చింది. ముందే వేసుకున్న పథకం ప్రకారం తిరుగు ప్రయాణంలో కిడ్నాప్ డ్రామాను అమలు చేసింది.
తన ఇద్దరు కవల పిల్లలతో యాదగిరిగుట్ట వెళ్లి తిరిగి వస్తూ కరీంనగర్ బస్సు కోసం జూబ్లీ బస్‌స్టేషన్ లో వేచి ఉన్నానని, బాత్‌రూమ్‌కు వెళ్తూ కవల పిల్లల్లో ఒకరిని పక్కనే ఉన్న ప్రయాణికురాలికి ఇవ్వగా పిల్లవాడిని తీసుకొని మాయమైందని మారేడ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ అయిన తన కుమారుడిని తనకు ఇప్పించాలని వేడుకుంది. రజిత ఫిర్యాదుపై అనుమానం వచ్చి పోలీసులు ఆమెపై ఓ కన్నేసి ఉంచారు. తల్లే బాలుడ్ని విక్రయించిందని తెలుసుకొన్నారు.
భుజంగరావు వద్ద ఉన్న చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. బాలుడు కిడ్నాప్ కాలేదని, తల్లే చిన్నారిని విక్రయించిందని పోలీసులు వెల్లడించారు. భర్తకు అనుమానం రాకుండా ఉండేందుకే కిడ్నాప్ డ్రామా ఆడిందా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అన్న అంశంపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్‌లో ఉన్న రజితను అదుపులోకి తీసుకుని విచారించాక అసలు విషయం వెల్లడిస్తామని డీసీపీ జీ.సుధీర్‌బాబు చెప్పారు. రెండ్రోజుల్లోనే కిడ్నాప్ డ్రామాకు తెరదించిన మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ బి.రవీందర్‌రెడ్డి బృందాన్ని డీసీపీ సుధీర్‌బాబు, మహంకాళి ఏసీపీ తిరుపతి అభినందించారు.