బతికున్నా చంపేశారు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు (కావలిరూరల్) : మండలంలోని అన్నగారిపాళెం పంచాయతీ ఒట్టూరుకు చెందిన వృద్ధుడు మర్రి జాలయ్య బతికున్నా అధికారులు చనిపోయినట్టుగా ధ్రువీకరించారు. సామాజిక పింఛన్ల జాబితాలో చనిపోయినట్టుగా నమోదు చేసి పింఛన్‌ను సైతం నిలిపివేశారు. వివరాలు.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జాలయ్యకు పింఛన్ మంజూరైంది. అప్పట్నుంచి నెల నెలా అందే పింఛన్ సొమ్ముతో మందులు తెచ్చుకునేవాడు. గత ఏడాది నవంబర్‌లో జాలయ్యకు పింఛన్‌ను నిలిచిపోయింది. అధికారులను అడిగితే బ్యాంకులో జమ చేస్తున్నామని తెలిపారు. జాలయ్య తిరగలేక మంచంలో ఉండడంతో పింఛన్ సంగతి పట్టించుకోలేదు.
ఇటీవల జాలయ్య కుటుంబ సభ్యులు పింఛన్ కార్డు పట్టుకుని మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని ఆరా తీయగా అధికారులు ఆన్లైన్లో మరణించాడని చూపుతోందని, పింఛన్ అందుకే రావడం లేదని చెప్పడంతో అవాక్కయ్యారు. జాలయ్య బతికున్నాడని, ఇలా చనిపోయాడని చెప్పడమేంటని అడగగా, ఏమో ఆన్లైన్లో అలాగే చూపుతోందని చెప్పారు. పింఛన్‌ను పునరుద్ధరించమని కోరగా, ఇప్పుడు కష్టం తిరిగి నూతన ంగా దరఖాస్తు చేసుకోమని సూచించారు. దీంతో ఏమి చేయాలో పాలుపోక వెనుదిరిగారు.