రైల్వే కార్మిక సమస్యలపై కేంద్రం మొండి వైఖరి
హైదరాబాద్: రైల్వే కార్మికుల సమస్యలపట్ల కేంద్రం మొండివైఖరి కనబరుస్తోందని ఎన్.ఎఫ్.ఐ.ఆర్, దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య అన్నారు. శుక్రవారం ఇక్కడ లాలాగూడ వర్క్‌షాప్ ఎస్సీఆర్ఈఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సౌత్ ఇన్స్టిట్యూట్లో 20వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్మికులు భారీ ర్యాలీగా ఇన్స్టిట్యూట్కు చేరుకున్నారు. రాఘవయ్య మాట్లాడుతూ 7వ వేతన కమిషన్‌లో రైల్వే కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని విచారం వ్యక్తం చేశారు.
రైల్వేలోని రెండున్నర లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్రం ఓ వైపు ‘మేకిన్ ఇండియా’ అంటూనే రైల్వేను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అప్రెంటీస్లకు ఉద్యోగాలిచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, వర్క్‌షాప్‌లో పనిచేసే ఇంజనీర్లు, సూపర్వైజర్లు, వర్కర్లకు ఇన్సెంటివ్స్, బోనస్‌లను పెంచాలని డిమాండ్ చేశారు. లాలాగూడ వర్క్‌షాప్‌లో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందిన కార్మికుడి కుటుంబసభ్యులకు సంఘ్ ఆధ్వర్యంలో రూ.2 లక్షల చెక్కు అందజేశారు. కార్యక్రమంలో సంఘ్ జోనల్ ప్రెసిడెంట్ ప్రభాకర్ ఆండ్రూ, సెక్రటరీ ఎం.జి.అరుణ్‌కుమార్, సంఘ్ ప్రతినిధులు సాంబశివరావు, హేమంత్‌కుమార్, నర్సింగ్‌రెడ్డి, మోహన్‌రావు, హైమరాజన్, గుణాకర్, బుచ్చాగౌడ్, ముస్తఫా, రమణ, స్వామి తదితరులు పాల్గొన్నారు.