అంగన్వాడీలకు త్వరలో టాబ్లు
మార్టేరు (పెనుమంట్ర) : పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే క్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ కార్యకర్తలకు త్వరలోనే టాబ్లు అందించనున్నట్టు ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.చంద్రశేఖర్ తెలిపారు. మార్టేరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇందుకోసం ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయన్నారు. అలాగే కంప్యూటర్ టాబ్లు కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు. కాగా ప్రతి కార్యకర్తకు వీటి వినియోగంపై తగిన శిక్షణ కూడా ఇస్తామని చెప్పారు. తద్వారా కార్యకర్తలకు ప్రస్తుతానికి రికార్డుల పనిభారం తగ్గుతుందన్నారు. భవిష్యత్ కాలంలో కాగితరహితంగా కేంద్రాల నిర్వహణ సాగనుందన్నారు. ఉద్యోగుల వేలిముద్రల నిర్వహణలో రాష్ట్రవ్యాప్తంగా మన జిల్లా ముందంజలో ఉందన్నారు. ప్రతి అంగన్వాడీ కార్యకర్త, ఆయా సమీపంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో తప్పనిపరిగా వేలిముద్రలు వేయాలని ఆయన సూచించారు. అందుకు సహకరించని గ్రామ పంచాయతీలపై తమ సిబ్బంది ఫిర్యాదు చేస్తే తాము వెంటనే జిల్లా కలెక్టర్కు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. రూ.7.5 లక్షల వ్యయంతో జిల్లావ్యాప్తంగా 324 అంగన్వాడీ కేంద్రాలను నూతనంగా నిర్మిస్తున్నామని చెప్పారు. అలాగే రెండేళ్లుగా పెండింగ్లో మాతృత్వ సంయోజన పథకం అమలుకు రూ.23 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెనుమంట్ర ప్రాజెక్టు అధికారిణి టి.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.