వాళ్లు వచ్చేది డబ్బు కోసమే..!
గాయంతో తప్పుకున్న ఆటగాళ్లపై ఫెడరర్ వ్యాఖ్య
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో తొలి రౌండ్లోనే (సింగిల్స్) ఓటమిపాలైనా ప్రతీ ఆటగాడికి 35 వేల పౌండ్ల (దాదాపు రూ. 29.31 లక్షలు) కనీస ప్రైజ్‌మనీ లభిస్తుంది. ఇది కొన్ని చిన్న స్థాయి టోర్నీలు గెలుచుకుంటే వచ్చేదానికంటే ఎక్కువే! ఒక ఆటగాడు మ్యాచ్ మధ్యలో గాయంతో తప్పుకున్నా కూడా అతనికి ఈ మొత్తం దక్కుతుంది. ఈ సారి టోర్నీ తొలి రౌండ్లో ఏకంగా ఎనిమిది మంది ఆటగాళ్లు (పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి) మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నారు.
దీనిపై స్టార్ ప్లేయర్, ఏడు సార్లు వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన రోజర్ ఫెడరర్ అసహనం వ్యక్తం చేశాడు. వారు డబ్బు కోసమే ఆడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఫెడరర్ ప్రత్యర్థి డల్గొపలోవ్ (ఉక్రెయిన్) ఇలాగే నిష్క్రమించగా, జొకోవిచ్‌తో తలపడిన మార్టిన్ క్లిజాన్ (స్లొవేకియా) కూడా గాయంతోనే ఆటను మధ్యలో ముగించాడు. ‘నా దృష్టిలో వారికి దక్కుతున్న మొత్తం చాలా ఎక్కువే. గాయంతో కూడా ఇక్కడికి వచ్చి వారు ఏదో అద్భుతం జరగవచ్చని ఆశిస్తారు.
పూర్తి ఫిట్‌గా లేని ఆటగాళ్లు ముందే తప్పుకొని వేరేవాళ్లకు అవకాశం ఇస్తే మంచిది. ఇలాంటి ఆటగాళ్లు డబ్బు కోసమే బరిలోకి దిగుతున్నారని చెప్పగలను’ అని ఫెడరర్ వ్యాఖ్యానించాడు. సెంటర్ కోర్టులో పెద్ద ఆటగాళ్ల మ్యాచ్ చూసేందుకు భారీ మొత్తమున్న టికెట్లు కొని జనం వస్తారని, ఇది వారిని తీవ్రంగా నిరాశపరుస్తుందని అతను చెప్పాడు. నష్టపోయిన ప్రేక్షకుల కోసం తానూ, జొకోవిచ్ కలిసి మ్యాచ్ ఆడాల్సిందేమోనని ఫెడెక్స్ సరదాగా అన్నాడు.
‘ఆట బోర్ కొట్టింది’...
ఆస్ట్రేలియా ఆటగాడు బెర్నార్డ్ టామిక్ ప్రదర్శన కూడా వివాదాస్పదంగా మారింది. అతను పూర్తి ఫిట్‌గా ఉన్నా మిషా జ్వెరెవ్ (జర్మనీ)తో జరిగిన మ్యాచ్‌లో కనీస పోటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. పైగా మ్యాచ్ ముగిసిన తర్వాత ‘ఎందుకో కారణం చెప్పలేను కానీ నాకు ఆ సమయంలో టెన్నిస్ బోర్ కొట్టింది’ అని చెప్పుకున్నాడు. దాంతో టామిక్ తన ప్రైజ్‌మనీ వెనక్కి ఇవ్వాలంటూ అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ అతను... ఫెడరర్, జొకోవిచ్ ఇలాగే ఇచ్చేస్తే నేను కూడా ఏదో ఒక సంస్థకు విరాళంగా ఇస్తాను అని వ్యాఖ్యానించాడు.