చల్లనమ్మపై సప్తనదుల ధార
-తలుపులమ్మకు వైభవంగా సహస్ర ఘటాభిషేకం
–లోవలో ముగిసిన ఆషాఢ మాసోత్సవాలు
తుని రూరల్ : ఆషాఢమాసోత్సవాల ముగింపు సందర్భంగా లోవ దేవస్థానంలో తలుపులమ్మతల్లికి వైభవంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ఆదివారం, అమావాస్య, ఆషాఢమాసం చివరిరోజును పురస్కరించుకుని వేదపండితులు ముష్టి వెంకటపురుషోత్తమ శర్మ, రాణి సుబ్రహ్మణ్యశర్మ, శశాంక్ త్రిపాఠి, అర్చకులు 1008 కలశాలలో సప్తనదీ జలాలు, సుగంధ ద్రవ్యాలను ఆవాహనం చేశారు. భక్తులు, ధర్మకర్తల సమక్షంలో వేదమంత్రోచ్చరణలతో సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించారు. ప్రధాన గర్భాలయంలో తలుపులమతల్లికి, పంచలోహ విగ్రహాలకు, అద్దాలమండపంలో అమ్మవారికి విశేషాలంకరణ చేసి భక్తులకు దర్శనాలను కల్పించారు. ఆలయంలో అన్నివిభాగాలనూ వివిధ రకాల పూలతో శోభాయమానంగా అలంకరించారు. ధర్మకర్తల చైర్మన్ కరపా అప్పారావు, అసిస్టెంట్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్, ఆలయ ఇన్స్పెక్టర్లు నాయుడు, గుబ్బల రామకృష్ణ, ధర్మకర్తలు నారాయణాచార్యులు, అత్తి అచ్చుతరావు, కిల్లి శ్రీను, యాదాల లోవకృష్ణ, పలువురు భక్తులు పాల్గొన్నారు.
60 వేల మంది భక్తుల రాక
ఆషాఢమాసం, ఆఖరి ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో తలుపులమ్మ అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. కోస్తాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నుంచి భక్తులు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. కాటేజీలు నిండుకోవడంతో భక్తులు చెట్ల కింద, ప్రైవేట్ పాకల్లో వంటలు, భోజనాలు చేశారు. 60 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు అసిస్టెంట్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. వివిధ విభాగాల నుంచి రూ.5,27,705 ఆదాయం లభించిందన్నారు. తాడేపల్లిగూడెంకు చెందిన కళాకారిణి ‘గౌరికల్యాణం’ హరికథను గానం చేశారు.