కాబ్స్.. ఓ వీర జవాను
లాస్ వేగాస్ : లాస్ వేగాస్ నరమేథం అమెరికాకు ఓ పీడ కలగా మిగిలింది. మ్యూజిక్ ఫెస్టివల్లో ఉన్న ప్రజలపై ఓ దుండగుడు కనికరం లేకుండా కాల్పులు జరిపి, తనకు తాను కాల్చుకుని మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీసిన ఓ ఫొటో కొద్ది రోజులుగా సోషల్ మీడియా వైరల్ అవుతోంది.
బుల్లెట్ల వర్షానికి ఎదురెళ్లిన ఓ అమెరికన్ ఆర్మీ జవాను మహిళను రక్షించిన చిత్రమది. దాడి జరుగుతున్న సమయంలో సంఘటనాస్థలి వైపు దూసుకెళ్లిన వీర జవాను 'కాబ్స్' మహిళకు బుల్లెట్లు తగులకుండా తన శరీరాన్ని అడ్డుగా పెట్టాడు. అంతేకాదు పక్కన ఉన్న వారు బుల్లెట్ల తగిలి కుప్పుకూలుతున్న దృశ్యాన్ని ఆమె కంటపడకుండా ఉంచేందుకు ముఖానికి తన చేతిని అడ్డుగా పెట్టాడు.
దుండగుడు కాల్పులు ఆపిన మరుక్షణమే ఆమెను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించాడు. అనంతరం మిగిలిన వారిని రక్షించేందుకు వెళ్లాడు కాబ్స్. గాయాలతో నెత్తురోడుతున్న వారి శరీరాల నుంచి బుల్లెట్లను తన వేళ్లతో బయటకు తీసి అత్యవసర చికిత్సకు తీసుకెళ్లెందుకు కాబ్స్ సాయంగా నిలిచినట్లు తెలిసింది.
తొలుత ఫొటో ఆన్లైన్ వైరల్ అయిన సమయంలో ఆమె మరణించినట్లు అందరూ భావించారు. అయితే, ఘటన అనంతరం వారు సేఫ్‌గా తప్పించుకున్నారని ఫొటోను తీసిన ఫొటోగ్రాఫర్ ఓ అంతర్జాతీయ పత్రికకు చెప్పారు. లాస్ వెగాస్‌లో మ్యూజిక్ ఫెస్టివల్‌పై జరిగిన దాడిలో 59 మంది మరణించిన విషయం విదితమే.