హాయ్ అన్నా , హలో అన్నా... సంస్కృతంలోనే!
పరమేశ్వరుని ఢమరుక నాదం నుంచి వెలువడిన శబ్దమే సంస్కృతం అని అంటారు. ప్రపంచంలోని 876 భాషలకు సంస్కృతమే మాతృక అని పండితులు అంగీకరిస్తారు. భారత భాషలకైతే సంస్కృతం ఉచ్ఛ్వాసప్రాయం. అన్నింటికీ మించి సంస్కృతాన్ని దైవభాషగా గౌరవిస్తారు. గంధర్వులు, కిన్నరలు, యక్షులు సంస్కృత భాషలోనే మాట్లాడారని భావిస్తారు, ఇలా పురాతన భారతావనిలో అధికార భాషగా, నాగరికుల భాషగా ఉండిన సంస్కృతం భారతదేశంలో క్రమంగా వాడుక నుంచి మాయమైంది.
అయితే భాషలకూ మాండలికాలకూ యాసలకూ కొదవలేని భారతదేశంలో ఇప్పటికీ సంస్కృత భాష అక్కడక్కడా వాడుక భాషగా వర్ధిల్లుతోంది. అలాంటి వాటిలో ప్రముఖమైన ప్రాంతం కర్ణాటకలోని మత్తూరు. తుంగ నదీ తీరాన ఉండే ఈ గ్రామంలోని ప్రజలకు సంస్కృతం వ్యవహార భాష. ఇక్కడ పలకరింపుల దగ్గర నుంచి చదువుల వరకూ అన్నీ సంస్కృతంలోనే సాగుతాయి. తరతరాలుగా సంస్కృత భాషను వారసత్వంగా ఇస్తున్నారు ఇక్కడి పెద్దలు.
హరి ఓం.. అని పలకరిస్తారు!
మత్తూరులో హలోలు, హాయ్లు ఉండవు. ఎవరినైనా ‘హరి ఓం’ అని పలకరిస్తారు. ‘భవతా నామ్ కిమ్?’ అంటే ‘నీ పేరు ఏంటి?’ అని! ‘కథమ్ అస్తి’ అంటే ‘ఎలా ఉన్నారు?’ అని. కాఫీ తాగుతారా? లేక టీ కావాలా? అని అడగడానికి ‘కాఫీ వ చాయమ్ కిమ్ ఇచ్చితాతి భవన్?’... ఇలా సాగుతుంది మత్తూరు ప్రజల మధ్య సంభాషణ. ఇక్కడ దేవనాగరి లిపిలో సంస్కృతాన్ని రాస్తారు. వీధుల పేర్లను, సూచన బోర్డులను సంస్కృతంలోనే రాస్తారు. ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాన్ని సంస్కృతం మాట్లాడే ప్రజలున్న ప్రాంతంగా గుర్తించింది.
500 ఏళ్లుగా...
విజయనగర సామ్రాజ్య కాలంలో తుంగ ఒడ్డున ఈ గ్రామం ఏర్పడినట్టు తెలుస్తోంది. మనుషుల జీవన శైలిని బట్టి భాషలో పదాల చేరిక ఉంటే ఆ భాష మనుగడకు అవకాశం ఉంటుంది. సంస్కృతం విషయంలో మిగిలిన భారతదేశంలో ఎక్కడా జరగని ప్రయత్నం మత్తూరులో జరిగింది. ఇక్కడి పెద్దలు సంస్కృతాన్ని వ్యవహారిక భాషగా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇక్కడ ‘సంస్కృత భారతి’ అని ఒక సంఘం ఏర్పడింది. ఈ సంఘమే అక్కడ ఇంటింటా సంస్కృతాన్ని వాడుకలోకి తెచ్చింది.