నేటి నుంచి సురభి నాటకోత్సవాలు
భీమవరం(ప్రకాశం చౌక్) : మావుళ్లమ్మ వార్షికోత్సవాల్లో భాగంగా శుక్రవారం నుంచి ఆలయం వద్ద సురభి నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్టు నీరుల్లి కురగాయల పండ్ల వర్తక ఉత్సవ కమిటీ నాయకులు తెలిపారు. హైదరాబాద్కు చెందిన శ్రీవెంకటేశ్వర నాట్య మండలి ఆధ్వర్యంలో నాటకాలు ప్రదర్శిస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా నాటకమండలి నిర్వాహకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ శుక్రవారం శ్రీకృష్ణ లీలలు, శనివారం భక్తప్రహ్లాద, 12న బాలనాగమ్మ, 13న పాతాళభైరవి, 14న మాయాబజార్ నాటకాలు ఉంటాయని వెల్లడించారు. 60 మంది కళాకారులతో నాటకాలు ప్రదర్శించనున్నట్టు వివరించారు. నాటకోత్సవాల ఏర్పాట్లను ఉత్సవ కమిటీ పర్యవేక్షించింది. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మానే పేరయ్య, ప్రధాన కార్యదర్శి కె.సత్తిబాబు, కార్యదర్శి రంగారావు పాల్గొన్నారు.