Maya Kodnani
-
నరోదా పాటియా ఊచకోత కేసులో సంచలన తీర్పు
గాంధీనగర్: గుజరాత్ నరోదా పాటియా ఊచకోత కేసులో అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. బీజేపీ నేత మాయా కొద్నానితో సహా 69 మందిని నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు. ఇందులో బజరంగ్ దళ్ సభ్యుడు బాబూ బజరంగీతో పాటు వీహెచ్‌పీ నేత జయదీప్ పటేల్ కూడా ఉన్నారు. గురువారం సాయంత్రం స్పెషల్ జడ్జి సుభదా బాక్సి తీర్పు వెలువరించగా.. బయట నిందితుల మద్ధతుదారులు, బంధువుల ‘జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై..’ నినాదాలు చేశారు. 2002 ఫిబ్రవరి 28వ తేదీన నరోదా పాటియాలో చెలరేగిన అల్లర్లలో మొత్తం 97 మంది మరణించారు. అయితే.. నరోదా గామ్ కుంభర్ వ్యాస్ ఏరియాలో ‘ముస్లిం మహోల్లా’గా పేరున్న నివాస సముదాయంలో నరమేధం జరిగింది. మొత్తం 11 మంది మరణించారు. నరోదా పీఎస్‌లో ఇందుకు సంబంధించిన కేసు నమోదు అయ్యింది. ఈ కేసులోనే గుజరాత్ మాజీ మంత్రి మాయా కొద్నాని, వీహెచ్‌పీ, ఆరెస్సెస్ నేతలు, ఇతరులను నిందితులుగా చేర్చారు. 👉 గుజరాత్ అల్లర్ల కేసుల విచారణ కోసం ఏర్పాటైన అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు.. ఈ కేసులో ఏప్రిల్ 5వ తేదీతోనే వాదనలు పూర్తి చేసుకుంది. తీర్పును ఇవాళ్టికి(ఏప్రిల్ 20కి)రిజర్వ్ చేసింది. చివరికి.. నరమేధం జరిగిన 21 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. 👉 ఈ కేసు దర్యాప్తు ప్రారంభంలో మొత్తం 86 మంది పేర్లను నిందితుల జాబితాలో చేర్చగా.. 17 మందిని ట్రయల్ దశలోనే నిర్దోషులుగా వదిలేశారు. మిగతా 69 మందిని నిందితులుగా కొనసాగించారు. అంతా ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి దాదాపు 182 మందిని ప్రాసిక్యూషన్ సాక్షులుగా పేర్కొన్నారు. 👉 నరోదా గామ్ ఊచకోత కేసు.. గోద్రా సబర్మతి రైలు దహనం ఘటన జరిగిన మరుసటిరోజు నుంచి గుజరాత్లో తొమ్మిది ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లలో ఒకటి. పైగా గుజరాత్ అల్లర్లలో ‘‘భారీ నరమేధం’’గా నరోదా పాటియా కేసును అభివర్ణిస్తుంటారు. 👉 ఈ కేసులో మాయా కొద్నాని ప్రధాన సూత్రధారి అంటూ అభియోగాలు నమోదు అయ్యాయి. ఆ సమయంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) గుజరాత్ ప్రభుత్వానికి ఓ నివేదిక సైతం సమర్పించింది. అయినప్పటికీ.. 2008లో సుప్రీం కోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం నివేదిక 70 మంది నిందితులకు వ్యతిరేకంగా నివేదిక సమర్పించింది. 61 మందిపై అభియోగాలు మోపింది. 31 మందిని సూత్రధారులుగా తేల్చింది. 👉 నివేదికల ఆధారంగా 2012లో.. గుజరాత్ మాజీ మంత్రి మాయా కొద్నానికి 28 ఏళ్ల శిక్ష విధించింది అహ్మదాబాద్ ట్రయల్ కోర్టు. తీర్పు సందర్భంగా స్పెషల్ జడ్జి జ్యోత్స్న యాగ్నిక్, కొద్నానిని ఈ మత ఘర్షణకు ప్రధాన సూత్రధారిగా పేర్కొన్నారు కూడా. కొద్నానీకి 28 ఏళ్ల జైలు శిక్ష. బజిరంగీకి జీవిత ఖైదు. ఎనిమిది మందికి 31 ఏళ్ల శిక్ష. 22 మందికి 24 ఏళ్ల చొప్పున శిక్ష విధించారు ట్రయల్ కోర్టు జడ్జి జ్యోత్స్న యాగ్నిక్. 👉 అయితే.. మాయా కొద్నాని సహా 10 మంది ప్రధాన నిందితులకు విధించిన జీవిత ఖైదును మరణశిక్షగా మార్చాలంటూ గుజరాత్ ప్రభుత్వం 2013 ఏప్రిల్‌లో అప్పీల్‌కు వెళ్లింది. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే అప్పటి మోదీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. చివరికి మే 14వ తేదీన ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. 👉 సాధారణంగా కింది కోర్టు(ఈ కేసులో ట్రయల్ కోర్టు) తీర్పును పైకోర్టులో మూడు నెలల్లోనే సవాల్ చేయాలి. కానీ, అప్పుడు ఏడు నెలల గ్యాప్ తర్వాత సవాల్ చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం ప్రయత్నించడం గమనార్హం. 👉 2013లో టీబీ కారణంగా మూడు నెలలపాటు బెయిల్ మీద బయటకు వచ్చిన ఆమె.. 2014లో అనారోగ్యం కారణంగా ఏకంగా ఆమె జైలు శిక్షను సస్పెండ్ చేస్తూ గుజరాత్ హైకోర్టు బెయిల్ మంజూరు అయ్యింది. 👉 ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. కొద్నాని స్వయంగా అల్లరి మూకకు కత్తులు అందించారు. ముస్లింలపై దాడులకు ఉసిగొల్పారు. ఒకానొక టైంలో తుపాకీతోనూ ఆమె కాల్పులు జరిపారు. అయితే.. ఆరోజు ఉదయం తాను అప్పటి చట్టసభ్యుడు అమిత్ షాతో అసెంబ్లీలో ఉన్నానని, ఆపై ఆయనతో కలిసి గోద్రా మారణకాండ బాధితుల్ని పరామర్శించేందుకు ఆస్పత్రికి సైతం వెళ్లినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా 2017లో కొద్నాని తరపున సాక్షిగా ఇప్పటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు కూడా. 👉 ఆపై గుజరాత్ హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లగా.. 2018లో కొద్నానితో పాటు 17 మందిని నిర్దోషులుగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. అయితే.. బజరంగితోపాటు 16 మందిని మాత్రం దోషులుగా తేల్చింది. 👉 ఇప్పుడు(ఏప్రిల్ 20, 2023).. గుజరాత్ అల్లర్ల కేసుల్ని విచారణ జరుపుతున్న అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు నరోదా పాటియా ఊచకోత కేసులో కొద్నానితో పాటు నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. 👉 ఇక గుజరాత్ అల్లర్లపై జస్టిస్ నానావతి కమిషన్ సమర్పించిన నివేదికలో సాక్షుల స్టేట్మెంట్ ఆధారంగా ‘‘ఆ సమయంలో ముస్లింలకు సాయం చేసేందుకు పోలీసులు ఎవరూ రాలేదు. నిస్సహాయంగా వాళ్లు ఆర్తనాదాలు చేశారు. సాయంత్రానికే పోలీసులు అక్కడికి చేరుకున్నారు అని పేర్కొంది. అయితే.. కమిషన్ ఎదుట హాజరైన పోలీసులు మాత్రం అంతకన్నా తీవ్ర పరిస్థితులు ఉన్న ప్రాంతంలో తాము మోహరించామని, నరోదా గామ్‌కు చేరుకునే పరిస్థితులు కూడా లేవని స్టేట్మెంట్ ఇచ్చారు. మాయా కొద్నాని నేపథ్యం.. పూర్తి పేరు మాయా సురేంద్రకుమార్ కొద్నాని.. గుజరాత్ మాజీ మంత్రి. నరోదా నుంచి బీజేపీ తరపున ఆమె గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. సింధి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యుడి కూతురు ఈమె. 👉 తండ్రిబాటలో పయనించి.. రాష్ట్రీయ సేవీకా సమితిలో(ఆరెస్సెస్ మహిళావ విభాగం) చేరారామె. ఎంబీబీఎస్ చేసి గైనకాలిస్టుగా స్పెషలైజేషన్ చేసిన కొద్నాని.. నరోదాలోనే ఓ ఆస్పత్రిలో పని చేశారు. ఆమె భర్త సురేంద్రకుమార్ కొద్నాని ఫిజీషియన్‌గా పని చేశారు. 👉 1995 అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల నుంచి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత మూడుసార్లు ఆమె నరోదా ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. గుజరాత్ అల్లర్లు జరిగిన అదే ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లోనూ ఆమె ఘన విజయం సాధించారు. 👉 2007 ఎన్నికల్లోనూ నెగ్గిన తర్వాత ఆమె మహిళా శిశుసంక్షేమ అభివృద్ధి శాఖా మంత్రిగా మోదీ కేబినెట్లో పని చేశారు. అయితే.. 2009లో నరోదా పాటియా నరమేధానికి సంబంధించిన అభియోగాలతో ఆమె అరెస్ట్ కావడంతో.. తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ కేసును తనకు వ్యతిరేకంగా జరిగిన రాజకీయ కుట్రగా అభివర్ణిస్తుంటారామె. :::సాక్షి వెబ్ ప్రత్యేకం -
మాయా కొద్నానీ నేరం చేయలేదా!????!
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌లోని నరోదా పాటియాలో 2002లో జరిగిన మారణ హోమం కేసులో భజరంగ్ దళ్ నాయకుడు బాబు భజరంగీని దోషిగా నిర్ధారించిన గుజరాతీ హైకోర్టు నిన్న (శుక్రవారం) బీజేపీ మాజీ మంత్రి మాయా కొద్నాని నిర్ధోషిగా ప్రకటించింది. 97 మంది ముస్లింలు, మహిళలు, పిల్లలను బలిగొన్న నరోదా పాటియా మారణహోమానికి కీలక సూత్రదారి మాయా కొద్నాని అంటూ 2012లో ట్రయల్ కోర్టు నిర్ధారించి 20 ఏళ్లకు పైగా జైలు శిక్షకూడా విధించింది. భారత్‌లో జరిగిన మత ఘర్షణల్లో ఓ మంత్రికి జైలు శిక్ష పడడం తొలిసారి అంటూ నాడు పత్రికలు, టీవీలు వ్యాఖ్యానించాయి. బీజేపీ, దాని సంఘ్ పరివారుకు చెందిన వారు వరుసగా హైకోర్టుల్లో విజయం సాధిస్తూ వస్తున్న నేపథ్యంలోనే మాయా కొద్నానీకి కూడా విముక్తి లభించింది. అసీమానంద్, ప్రజ్ఞాసింగ్ ఠాకూర్లు ఇటీవలనే కేసుల నుంచి విముక్తి పొందిన విషయం తెల్సిందే. బరోడా వైద్య కళాశాలలో మెడిసిన్ చదువుతున్నప్పుడే ఆరెస్సెస్ మహిళా విభాగమైన రాష్ట్రీయ సేవికా సమితిలో మాయా కొద్నాని చేరారు. ఆ తర్వాత అహ్మదాబాద్‌లో గైనకాలజిస్ట్‌గా ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. 1995లో రాజకీయాల్లోకి వచ్చి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.1998లో ఆమె బీజేపీ తరఫున నరోడా నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అహ్మదాబాద్ సిటీ బీజేపీ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం నరోదా పాటియా, నరోదా గ్రామ్‌లలో మాయా కొద్నానీ ముస్లిలకు వ్యతిరేకంగా అల్లర్లను రెచ్చగొట్టారు. ఈ సంఘటనలపై దర్యాప్తు జరిపిన ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ 2003లో వెల్లడించిన నివేదిక ప్రకారం మహిళలను, బాలికలను బహిరంగంగా గ్యాంగ్ రేప్‌లు చేశారు. అనంతరం వారిని దహనం చేశారు. మగవాళ్లను కత్తులతో నరికి చంపారు. నూరాని మసీదును గ్యాస్ సిలిండర్లతో పేల్చి వేశారు. ఈ రెండు సంఘటనలకు నాటి నరోడా బీజేపీ ఎమ్మెల్యే మాయా కొద్నానీ, గుజరాత్ విశ్వహిందూ పరిషద్ జనరల్ సెక్రటరీ జైదీప్ పటేల్‌లు రింగ్ లీడర్లని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక పేర్కొంది. అయినప్పటికీ కొద్నానీపై న్యాయపరమైన చర్యలు తీసుకోలేదు. 2007లో ఆమె నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మంత్రిగా చేరారు. ఆ తర్వాత పోలీసు అధికారి రాహుల్ శర్మ 2002లో అల్లర్ల సందర్భంగా మాయా కొద్నానీ తన అనుచర వర్గంతో మాట్లాడిన ఫోన్‌కాల్ డేటాను పూర్తిగా బయటపెట్టారు. అల్లర్లప్పుడు భావ్‌నగర్ ఎస్పీగా పనిచేసిన రాహుల్ శర్మ 400 మంది విద్యార్థులున్న మదర్సాను తగులబెట్టేందుకు కుట్ర జరిగిందని తెల్సి అక్కడికెళ్లి 400 మంది విద్యార్థులను రక్షించారు. దీంతో ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం అహ్మదాబాద్‌లో డెస్క్జాబ్కు బదిలీ చేసింది. దాంతో ఆయన 2002 అల్లర్ల నాటి నిందితుల కాల్ డేటాను వెలుగుతీయడం ప్రారంభించారు. అలా మాయా కొద్నానీ కాల్ డేటాను పూర్తిగా బయటకుతీశారు. సుప్రీం కోర్టు గుజరాత్ అల్లర్లపై ఏర్పాటు చేసిన సిట్ ఆ కాల్ డేటాను పరిగణలోకి తీసుకొని 2009లో ఆమెకు సమన్లు జారీ చేసింది. సమన్లకు ఆమె ఎంతకు స్పందించకపోవడంతో సుప్రీం కోర్టు ఆమెను పరారీలో ఉన్న నిందితురాలిగా ప్రకటించింది. కొంతకాలం అజ్ఞాతవాసంలోకి వెళ్లిన మాయా కొద్నానీ తన పదవికి రాజీనామా చేసి కోర్టు ముందు లొంగిపోయారు. ఆమె కేసును విచారించిన ట్రయల్ కోర్టు కేసులో ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతోపాటు కాల్ డేటాను అనుబంధ సాక్ష్యంగా తీసుకొని 2012, ఆగస్టు 29వ తేదీన ఆమెకు 28 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. నాడు తీర్పు విన్న కొద్నానీ కోర్టులోనే ఏడుస్తూ కుప్పకూలి పోయారు. ఇదే కేసులో అప్పీల్‌ను విచారించిన గుజరాత్ హైకోర్టు శుక్రవారం మాయా కొద్నానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమ్మశక్యంగా లేవంటూ కేసును కొట్టి వేసింది. కాల్ డేటా గురించి అసలు పట్టించుకున్నట్లు లేదు. బాబు భజరంగీని దోషిగా తేల్చిన ప్రత్యక్ష సాక్ష్యుల వాంగ్మూలాలు కొద్నాని ఎందుకు దోషిగా తేల్చలేకపోయాయో! మాయా కొద్నానీ ‘రాజకీయ క్రీడలకు’ బలయ్యారని 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆయన ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల్లో, అంటే జూలై నెలలో అనారోగ్య కారణాలతో మాయా కొద్నాని జైలు శిక్షను గుజరాత్ హైకోర్టు రద్దుచేసి ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఇది రాజకీయ క్రీడ కాదంటారా?! -
‘నరోడా’ కేసులో కొడ్నానీ నిర్దోషి
అహ్మదాబాద్: నరోడా పటియా అల్లర్ల కేసులో నిందితురాలిగా ఉన్న బీజేపీ మాజీ మంత్రి మాయా కొడ్నానీని శుక్రవారం గుజరాత్ హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ కేసులో బజరంగ్దళ్ మాజీ నేత బాబూ భజరంగీని దోషిగా తేల్చింది. 2002లో గోద్రా అల్లర్ల తర్వాత జరిగిన నరోడా అల్లర్లలో 97 మంది మృతి చెందారు. కొడ్నానీ నేరం చేసినట్లు ఎలాంటి ఆధారాలను ప్రాసిక్యూషన్ సమర్పించలేకపోయిందని కోర్టు పేర్కొంది. కాగా, భజరంగీని దోషిగా తేలుస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. అల్లర్లకు భజరంగీ కుట్ర పన్నినట్లు నిరూపి తమైందని కోర్టు పేర్కొంది. భజరంగీకి హైకోర్టు 21 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు దోషులుగా తేల్చిన 32 మందిలో 13 మందిని హైకోర్టు దోషులుగా నిర్ధారించింది. -
గుజరాత్ అల్లర్ల కేసులో మాజీ మంత్రికి ఊరట
-
గుజరాత్ అల్లర్ల కేసులో మాజీ మంత్రికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ అల్లర్ల కేసులో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మాజీ మంత్రి మాయా కొద్నానీ నిర్దోషిగా విడుదల అయ్యారు. 2002 గుజరాత్లో జరిగిన అల్లర్ల సమయంలో అహ్మదాబాద్‌లోని నరోదా పటియాలో నరమేథం జరిగింది. ఈ నరమేథం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాయా కొద్నానీని శుక్రవారం గుజరాత్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సంశయ లాభం కింద కొద్నానీని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. 2002లో నరోదా నరమేథంలో 100 మంది ముస్లింలు హత్యకు గురయ్యారు. వృత్తి రీత్యా వైద్యురాలైన కొద్నానీ అల్లర్లకు పురిగొల్పారని ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఘటన మరుసటి రోజున ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం అల్లర్లకు కొద్నానీయే రెచ్చగొట్టారని తేల్చింది. దీంతో ఆమెను అరెస్టు చేశారు. అప్పటినుంచి 10 ఏళ్ల పాటు సాగిన విచారణ అనంతరం ప్రత్యేక కోర్టు కొద్నానీకి జీవిత ఖైదును విధించింది. 2014లో కొద్నానీ బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న భజరంగ్ దళ్ నేత బాబు భజరంగీని దోషిగా తేల్చిన న్యాయస్థానం క్రింది కోర్టు ఇచ్చిన శిక్షను ఖరారు చేసింది. భజరంగీకి 2012లో ప్రత్యేక కోర్టు 28 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఇరువురితో పాటు ఆరోపణలను ఎదుర్కొంటున్న మరో 29 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. -
మాయాకోద్నాని కేసు: అమిత్ షా వాంగ్మూలం
సాక్షి, అహ్మదాబాద్: 2002 గుజరాత్ అల్లర్ల కేసులో డిఫెన్స్ సాక్షిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం కోర్టుకు హాజరయ్యారు. బీజేపీ నేత, గుజరాత్ మాజీ మంత్రి మాయా కోద్నాని తరఫు సాక్షిగా అహ్మదాబాద్ సెషన్స్ కోర్టులో ఆయన వాంగ్మూలం ఇచ్చారు. గుజరాత్ అల్లర్లు జరిగిన రోజు మాయా కోద్నాని నరోదా గామ్‌లో లేదని షా పేర్కొన్నారు. గోద్రా రైల్వే స్టేషన్లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ను తగులబెట్టిన మర్నాడైన ఫిబ్రవరి 28, 2002న మాయాను గుజరాత్ అసెంబ్లీలో, ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రిలో కలిసినట్టు చెప్పారు. 'ఆ రోజు మాయా కోద్నాని నరోదా గామ్‌లో లేరు. ఆమెను ఉదయం 8.30 గంటలకు అసెంబ్లీలో, ఆ తర్వాత 9.30 నుంచి 9.45 గంటల సమయంలో సివిల్ ఆస్పత్రిలో నేను కలిశాను' అంటూ ఆమెకు అనుకూలంగా షా సాక్ష్యం చెప్పారు. నరోదా గామ్‌లో 11మంది ముస్లింలను చంపేసిన కేసులో నిందితులుగా ఉన్న 82మందిలో మాయా కోద్నాని ఒకరు. 97 మంది ముస్లింల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న నరోదా పాటియా ఉచకోత కేసులో మాయా కోద్నానికి ఇప్పటికే జీవితఖైదు శిక్ష పడిన సంగతి తెలిసిందే. నరోదా గామ్ కేసులో కోర్టు సమన్లు జారీచేసిన 14మంది డిఫెన్స్ సాక్షుల్లో అమిత్ షా ఒకరు. -
అమిత్ షాకు కోర్టు సమన్లు
సాక్షి, గాంధీనగర్ : బీజేపీ చీఫ్ అమిత్ షాకు గుజరాత్ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. 2002 నరోదా గామ్ ఊచకోత ఘటనలో జీవిత ఖైదు అనుభవిస్తున్న బీజేపీ మాజీ మంత్రి మాయా కొద్నాని అభ్యర్థన మేరకు కేసులో సాక్షిగా ఈ నెల 18న కోర్టు ముందు హాజరుకావాలని ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఊచకోత జరిగిన సమయంలో కొద్నాని అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన కొద్నాని అల్లర్ల సమయంలో తాను అప్పటి ఎమ్మెల్యే అమిత్ షాను అసెంబ్లీలో కలిశానని, ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లానని చెబుతున్నారు. నిజ నిరూపణకు అమిత్ షాతో పాటు మరో 13 మందిని కేసులో సాక్షులుగా పరిగణించాలని కొద్నాని ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలిసారి కోర్టును కోరారు. నరోదా గామ్‌లో మారణహోమం సృష్టించిన గుంపును లీడ్ చేసినట్లు కొద్నానిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసును విచారించిన కోర్టు కొద్నానికి జీవిత ఖైదు విధించింది. అయితే, ఆరోగ్య సమస్యల రీత్యా 2014 నుంచి ఆమె బెయిల్‌పై బయటే ఉంటున్నారు.