మాయాకోద్నాని కేసు: అమిత్ షా వాంగ్మూలం
సాక్షి, అహ్మదాబాద్: 2002 గుజరాత్ అల్లర్ల కేసులో డిఫెన్స్ సాక్షిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం కోర్టుకు హాజరయ్యారు. బీజేపీ నేత, గుజరాత్ మాజీ మంత్రి మాయా కోద్నాని తరఫు సాక్షిగా అహ్మదాబాద్ సెషన్స్ కోర్టులో ఆయన వాంగ్మూలం ఇచ్చారు. గుజరాత్ అల్లర్లు జరిగిన రోజు మాయా కోద్నాని నరోదా గామ్‌లో లేదని షా పేర్కొన్నారు. గోద్రా రైల్వే స్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ను తగులబెట్టిన మర్నాడైన ఫిబ్రవరి 28, 2002న మాయాను గుజరాత్ అసెంబ్లీలో, ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రిలో కలిసినట్టు చెప్పారు. 'ఆ రోజు మాయా కోద్నాని నరోదా గామ్‌లో లేరు. ఆమెను ఉదయం 8.30 గంటలకు అసెంబ్లీలో, ఆ తర్వాత 9.30 నుంచి 9.45 గంటల సమయంలో సివిల్ ఆస్పత్రిలో నేను కలిశాను' అంటూ ఆమెకు అనుకూలంగా షా సాక్ష్యం చెప్పారు.
నరోదా గామ్‌లో 11మంది ముస్లింలను చంపేసిన కేసులో నిందితులుగా ఉన్న 82మందిలో మాయా కోద్నాని ఒకరు. 97 మంది ముస్లింల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న నరోదా పాటియా ఉచకోత కేసులో మాయా కోద్నానికి ఇప్పటికే జీవితఖైదు శిక్ష పడిన సంగతి తెలిసిందే. నరోదా గామ్ కేసులో కోర్టు సమన్లు జారీచేసిన 14మంది డిఫెన్స్ సాక్షుల్లో అమిత్ షా ఒకరు.