అమిత్ షాకు కోర్టు సమన్లు
సాక్షి, గాంధీనగర్ : బీజేపీ చీఫ్ అమిత్ షాకు గుజరాత్ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. 2002 నరోదా గామ్ ఊచకోత ఘటనలో జీవిత ఖైదు అనుభవిస్తున్న బీజేపీ మాజీ మంత్రి మాయా కొద్నాని అభ్యర్థన మేరకు కేసులో సాక్షిగా ఈ నెల 18న కోర్టు ముందు హాజరుకావాలని ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
ఊచకోత జరిగిన సమయంలో కొద్నాని అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన కొద్నాని అల్లర్ల సమయంలో తాను అప్పటి ఎమ్మెల్యే అమిత్ షాను అసెంబ్లీలో కలిశానని, ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లానని చెబుతున్నారు. నిజ నిరూపణకు అమిత్ షాతో పాటు మరో 13 మందిని కేసులో సాక్షులుగా పరిగణించాలని కొద్నాని ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలిసారి కోర్టును కోరారు.
నరోదా గామ్‌లో మారణహోమం సృష్టించిన గుంపును లీడ్ చేసినట్లు కొద్నానిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసును విచారించిన కోర్టు కొద్నానికి జీవిత ఖైదు విధించింది. అయితే, ఆరోగ్య సమస్యల రీత్యా 2014 నుంచి ఆమె బెయిల్‌పై బయటే ఉంటున్నారు.