Naroda Gam Case: All About Case and BJP Maya Kodnani - Sakshi
Sakshi News home page

గుజరాత్‌ అల్లర్లు.. నరోదా పాటియా ఊచకోత కేసులో సంచలన తీర్పు

Published Thu, Apr 20 2023 7:49 PM | Last Updated on Thu, Apr 20 2023 7:56 PM

Naroda Gam case: All about Case And BJP Maya Kodnani - Sakshi

గాంధీనగర్‌: గుజరాత్‌ నరోదా పాటియా ఊచకోత కేసులో అహ్మదాబాద్‌ ప్రత్యేక కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. బీజేపీ నేత మాయా కొద్నానితో సహా 69 మందిని నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు.  ఇందులో బజరంగ్ దళ్‌ సభ్యుడు బాబూ బజరంగీతో పాటు వీహెచ్‌పీ నేత జయదీప్‌ పటేల్‌ కూడా ఉన్నారు.  గురువారం సాయంత్రం స్పెషల్‌ జడ్జి సుభదా బాక్సి తీర్పు వెలువరించగా.. బయట నిందితుల మద్ధతుదారులు, బంధువుల ‘జై శ్రీరామ్‌, భారత్‌ మాతా కీ జై..’ నినాదాలు చేశారు. 

 2002 ఫిబ్రవరి 28వ తేదీన నరోదా పాటియాలో చెలరేగిన అల్లర్లలో మొత్తం 97 మంది మరణించారు.  అయితే.. నరోదా గామ్‌ కుంభర్‌ వ్యాస్‌ ఏరియాలో ‘ముస్లిం మహోల్లా’గా పేరున్న నివాస సముదాయంలో నరమేధం జరిగింది. మొత్తం 11 మంది మరణించారు. నరోదా పీఎస్‌లో ఇందుకు సంబంధించిన కేసు నమోదు అయ్యింది. ఈ కేసులోనే గుజరాత్‌ మాజీ మంత్రి మాయా కొద్నాని, వీహెచ్‌పీ, ఆరెస్సెస్‌ నేతలు, ఇతరులను నిందితులుగా చేర్చారు.  

 👉 గుజరాత్‌ అల్లర్ల కేసుల విచారణ కోసం ఏర్పాటైన అహ్మదాబాద్‌ ప్రత్యేక కోర్టు.. ఈ కేసులో ఏప్రిల్‌ 5వ తేదీతోనే వాదనలు పూర్తి చేసుకుంది. తీర్పును ఇవాళ్టికి(ఏప్రిల్‌ 20కి)రిజర్వ్‌ చేసింది.  చివరికి.. నరమేధం జరిగిన 21 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. 

 👉 ఈ కేసు దర్యాప్తు ప్రారంభంలో మొత్తం 86 మంది పేర్లను నిందితుల జాబితాలో చేర్చగా.. 17 మందిని ట్రయల్‌ దశలోనే నిర్దోషులుగా వదిలేశారు. మిగతా 69 మందిని నిందితులుగా కొనసాగించారు. అంతా ప్రస్తుతం బెయిల్‌ మీద బయట ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి దాదాపు 182 మందిని ప్రాసిక్యూషన్‌ సాక్షులుగా పేర్కొన్నారు. 

 👉 నరోదా గామ్‌ ఊచకోత కేసు.. గోద్రా సబర్మతి రైలు దహనం ఘటన జరిగిన మరుసటిరోజు నుంచి గుజరాత్‌లో తొమ్మిది ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లలో ఒకటి. పైగా గుజరాత్‌ అల్లర్లలో ‘‘భారీ నరమేధం’’గా నరోదా పాటియా కేసును అభివర్ణిస్తుంటారు.  

 👉 ఈ కేసులో మాయా కొద్నాని ప్రధాన సూత్రధారి అంటూ అభియోగాలు నమోదు అయ్యాయి. ఆ సమయంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు.  ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) గుజరాత్‌ ప్రభుత్వానికి ఓ నివేదిక సైతం సమర్పించింది. అయినప్పటికీ..  2008లో సుప్రీం కోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం నివేదిక 70 మంది నిందితులకు వ్యతిరేకంగా నివేదిక సమర్పించింది. 61 మందిపై అభియోగాలు మోపింది. 31 మందిని సూత్రధారులుగా తేల్చింది. 

 👉 నివేదికల ఆధారంగా 2012లో.. గుజరాత్‌ మాజీ మంత్రి మాయా కొద్నానికి 28 ఏళ్ల శిక్ష విధించింది అహ్మదాబాద్‌ ట్రయల్‌ కోర్టు. తీర్పు సందర్భంగా స్పెషల్‌ జడ్జి జ్యోత్స్న యాగ్నిక్‌, కొద్నానిని ఈ మత ఘర్షణకు ప్రధాన సూత్రధారిగా పేర్కొన్నారు కూడా. కొద్నానీకి 28 ఏళ్ల జైలు శిక్ష. బజిరంగీకి జీవిత ఖైదు. ఎనిమిది మందికి 31 ఏళ్ల శిక్ష. 22 మందికి 24 ఏళ్ల చొప్పున శిక్ష విధించారు ట్రయల్‌ కోర్టు జడ్జి జ్యోత్స్న యాగ్నిక్‌.  

 👉 అయితే.. మాయా కొద్నాని సహా 10 మంది ప్రధాన నిందితులకు విధించిన జీవిత ఖైదును మరణశిక్షగా మార్చాలంటూ గుజరాత్‌ ప్రభుత్వం 2013 ఏప్రిల్‌లో అప్పీల్‌కు వెళ్లింది. సిట్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగానే అప్పటి మోదీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. చివరికి మే 14వ తేదీన ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది.

 👉 సాధారణంగా కింది కోర్టు(ఈ కేసులో ట్రయల్‌ కోర్టు) తీర్పును పైకోర్టులో మూడు నెలల్లోనే సవాల్‌ చేయాలి. కానీ, అప్పుడు ఏడు నెలల గ్యాప్‌ తర్వాత సవాల్‌ చేసేందుకు గుజరాత్‌ ప్రభుత్వం ప్రయత్నించడం గమనార్హం. 

 👉 2013లో టీబీ కారణంగా మూడు నెలలపాటు బెయిల్‌ మీద బయటకు వచ్చిన ఆమె.. 2014లో అనారోగ్యం కారణంగా ఏకంగా ఆమె జైలు శిక్షను సస్పెండ్‌ చేస్తూ గుజరాత్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు అయ్యింది.  

 👉 ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. కొద్నాని స్వయంగా అల్లరి మూకకు కత్తులు అందించారు. ముస్లింలపై దాడులకు ఉసిగొల్పారు. ఒకానొక టైంలో తుపాకీతోనూ ఆమె కాల్పులు జరిపారు. అయితే.. ఆరోజు ఉదయం తాను అప్పటి చట్టసభ్యుడు అమిత్‌ షాతో అసెంబ్లీలో ఉన్నానని, ఆపై ఆయనతో కలిసి గోద్రా మారణకాండ బాధితుల్ని పరామర్శించేందుకు ఆస్పత్రికి సైతం వెళ్లినట్లు ఆమె పేర్కొన్నారు.  ఈ కేసు విచారణ సందర్భంగా 2017లో కొద్నాని తరపున సాక్షిగా ఇప్పటి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హాజరయ్యారు కూడా. 

👉 ఆపై గుజరాత్‌ హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లగా.. 2018లో కొద్నానితో పాటు 17 మందిని నిర్దోషులుగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. అయితే.. బజరంగితోపాటు 16 మందిని మాత్రం దోషులుగా తేల్చింది. 

👉 ఇప్పుడు(ఏప్రిల్‌ 20, 2023).. గుజరాత్‌ అల్లర్ల కేసుల్ని విచారణ జరుపుతున్న అహ్మదాబాద్‌ ప్రత్యేక కోర్టు  నరోదా పాటియా ఊచకోత కేసులో కొద్నానితో పాటు నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. 

👉 ఇక గుజరాత్‌ అల్లర్లపై జస్టిస్‌ నానావతి కమిషన్‌ సమర్పించిన నివేదికలో సాక్షుల స్టేట్‌మెంట్‌ ఆధారంగా  ‘‘ఆ సమయంలో ముస్లింలకు సాయం చేసేందుకు పోలీసులు ఎవరూ రాలేదు. నిస్సహాయంగా వాళ్లు ఆర్తనాదాలు చేశారు. సాయంత్రానికే పోలీసులు అక్కడికి చేరుకున్నారు అని పేర్కొంది. అయితే.. కమిషన్‌ ఎదుట హాజరైన పోలీసులు మాత్రం అంతకన్నా తీవ్ర పరిస్థితులు ఉన్న ప్రాంతంలో తాము మోహరించామని, నరోదా గామ్‌కు చేరుకునే పరిస్థితులు కూడా లేవని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. 


మాయా కొద్నాని నేపథ్యం.. 
పూర్తి పేరు మాయా సురేంద్రకుమార్‌ కొద్నాని.. గుజరాత్‌ మాజీ మంత్రి. నరోదా నుంచి బీజేపీ తరపున ఆమె గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. సింధి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సభ్యుడి కూతురు ఈమె.

👉 తండ్రిబాటలో పయనించి.. రాష్ట్రీయ సేవీకా సమితిలో(ఆరెస్సెస్‌ మహిళావ విభాగం) చేరారామె. ఎంబీబీఎస్‌ చేసి గైనకాలిస్టుగా స్పెషలైజేషన్‌ చేసిన కొద్నాని.. నరోదాలోనే ఓ ఆస్పత్రిలో పని చేశారు. ఆమె భర్త సురేంద్రకుమార్‌ కొద్నాని ఫిజీషియన్‌గా పని చేశారు. 

👉 1995 అహ్మదాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల నుంచి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది.  ఆ తర్వాత మూడుసార్లు ఆమె నరోదా ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. గుజరాత్‌ అల్లర్లు జరిగిన అదే ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లోనూ ఆమె ఘన విజయం సాధించారు.

 👉 2007 ఎన్నికల్లోనూ నెగ్గిన తర్వాత ఆమె మహిళా శిశుసంక్షేమ అభివృద్ధి శాఖా మంత్రిగా మోదీ కేబినెట్‌లో పని చేశారు. అయితే.. 2009లో నరోదా పాటియా నరమేధానికి సంబంధించిన అభియోగాలతో ఆమె అరెస్ట్‌ కావడంతో.. తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ కేసును తనకు వ్యతిరేకంగా జరిగిన రాజకీయ కుట్రగా అభివర్ణిస్తుంటారామె.

:::సాక్షి వెబ్‌ ప్రత్యేకం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement