MD NVS Reddy
-
‘తెలంగాణ సవారీ తరహాలో యాప్’
సాక్షి, హైదరాబాద్ : మెట్రోరైలు, ఆర్టీసీ అనుసంధానంపై మంగళవారం నగరంలో సమావేశం జరిగింది. తెలంగాణ సవారీ తరహాలో యాప్ రూపొందిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. టీఎస్ ఆర్టీసీ ఎండీ, మైట్రోరైలు ఎండీలతో పాటు సంబంధిత అధికారులు సమావేశానికి హాజరయ్యారు. అంతేకాక అనుసంధానంపై కీలక విషయాలను చర్చించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ టీఎస్ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మ మాట్లాడుతూ.. మెట్రోరైలు, ఆర్టీసీ అనుసంధానంపై టాస్క్ ఫోర్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్టీసీ బస్సులు, మెట్రోరైలు ట్రాకింగ్ పై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘వాహనాల ట్రాకింగ్ కోసం ప్రత్యేక యాప్ రూపకల్పన చేసేందుకు ఆలోచిస్తున్నాం. ప్రైవేట్ వాహన సంస్థలతో పేమెంట్స్ పై చర్చ జరిపాం. ప్రజలకు వేగవంతమైన, సుఖవంతమైన ప్రయాణం కోసం ఆలోచన చేస్తున్నాము.మొదటి మీటింగ్ నిర్వహించాం. రేపు కూడా మళ్లీ సమావేశం ఉంటుంది. మెట్రో, ఆర్టీసీ ప్రయాణ అనుసంధానం పై 2నెలల్లో ప్రణాళికలు రూపొందిస్తాం. గ్రేటర్ సిటీలో ఆర్టీసీ, మెట్రో కలిసి పని చేయాలి. గ్రేటర్ సిటీలో మెట్రో, ఆర్టీసీ కలిసేందుకు మొదటి ప్రయత్నం చేస్తున్నాం. 18వందల బస్సులకు ఇప్పటికే ట్రాకింగ్ సిస్టం ఉంది. మిగతా వాటికి కూడా ఏర్పాటు చేస్తాం. పేదలకు నష్టం కలుగకుండా ప్రణాళికలు చేస్తున్నాం. మెట్రో, ఆర్టీసీ, ఓలా, ఉబర్ సంస్థలతో కలిసి సమన్వయంతో పనిచేస్తాం. ప్రజల అవసరాలు, రద్దీని బట్టి ఆర్టీసీలో మార్పులు ఉంటాయి. ఆర్టీసీలో కొత్త కమిటీ వేశాం.. త్వరలోనే ప్రకటన చేస్తాం’ అని ఎండీ సునీల్ వర్మ తెలిపారు. మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా రవాణా వ్యవస్థ పెరిగితే.. వ్యక్తిగత వాహనాలు తగ్గుతాయన్నారు. తెలంగాణ సవారీ తరహాలో యాప్ రూపొందిస్తామని ఆయన తెలిపారు. సిటీలో ఆర్టీసీలో 33లక్షల మంది, ఎంఎంటీఎస్‌లో 2లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. మెట్రోలో ప్రస్తుతం 8వేల మంది ప్రయాణం చేస్తున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. ‘గ్లోబల్ కంపెనీలు దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కి వస్తున్నాయి. బెంగుళూరు తరహాలో ట్రాఫిక్ లేకుండా హైదరాబాద్‌ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను టాస్క్ ఫోర్స్ చేస్తది. నగరంలో ట్రాఫిక్ తగించడంతో పాటు సుఖవంతమైన ప్రయాణం కోసం కృషి చేస్తున్నాం. దేశంలో ఎక్కడలేని విధంగా మెట్రో రైల్‌ని రూపొందిస్తున్నాం. జీఎచ్ఎంసీ ద్వారా గ్రేటర్లో బస్ షెల్టర్ నిర్మాణం జరుగుతుందని’ ఆయన పేర్కొన్నారు. -
ఆత్మ సంతృప్తి కోసం పని చేయాలి
మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి దోమలగూడ : డబ్బు సంపాదనే ధ్యేయంగా కాకుండా ఆత్మ సంతృప్తి కోసం పని చేయాలని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన దోమలగూడ రామకృష్ణమఠంలోని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో ‘శ్రద్ధ’ పేరుతో నిర్వహించనున్న మూడు రోజుల వాల్యూ ఓరియంటేషన్ రెసిడెన్షియల్ యూత్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతలో సత్ప్రవర్తన తేవడానికి హ్యూమన్ ఎక్స్‌లెన్స్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. స్వామి వివేకానంద స్పూర్తిగా యువత దేశాభివృద్ధికి తమ వంతు ప్రయత్నం చేయాలన్నారు. చైనా యువ శక్తిని సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు. యువత వ్యక్తిగత స్వార్ధం వీడి సమాజాభివృద్ధికి తోడ్పడాలన్నారు. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని సామాన్యులకు అందుబాటులోకి తేవాలని కోరారు. అయితే కొందరు యువకులు మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాధించలేం అన్న నిస్పృహ తగదని, ప్రతి వ్యక్తి లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు. ఓటమికి కృంగి పోకుండా, దానినినాంధిగా మలుచుకోవాలని సూచించారు. రూ.14,132 కోట్లతో అతి పెద్ద మెట్రో రైలు పనులు ప్రారంభించే ముందు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నామని, ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా పనులు సాగిస్తున్నామన్నారు. హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత వేగంగా సాగుతున్న ప్రాజెక్టు అని, మూడేళ్లలోనే దాదాపు 50 కిలోమీటర్లు పూర్తి చేశామన్నారు. అసెంబ్లీ, పాతబస్తీలో అలైన్మెంట్ మార్పుపై అధ్యయనం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రామకృష్ణమఠం అధ్యక్షులు స్వామి జ్ఞానదానంద, హ్యూమన్ ఎక్స్‌లెన్స్ డెరైక్టర్ స్వామి బోధమయానంద తదితరులు పాల్గొన్నారు. -
2017 జూలై నాటికి మెట్రో పూర్తి
సాక్షి, హైదరాబాద్: అన్ని ఆటంకాలనూ అధిగమించి 2017 జూలై నాటికి మెట్రో రైల్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్ఎంఆర్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్అండ్ టీ మెట్రో రైల్ ఎండీ వీబీ గాడ్గిల్ స్పష్టంచేశా రు. నగరంలోని 3 కారిడార్లలో 72 కి.మీ. మార్గంలో మెట్రో రైలును అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ‘హైదరాబాద్ నెక్ట్స్-ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ (మెట్రో ప్రాజెక్టులో భాగంగా వాణిజ్య మాల్స్, రియల్ఎస్టేట్ అభివృద్ధి)’ లోగోను ఆవిష్కరించిన సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి, గాడ్గిల్ ఈ విషయాన్ని వెల్లడించారు. అసెంబ్లీ వెనుకవైపు నుంచి మెట్రో అలైన్మెంట్ మార్పుపై స్పష్టత వచ్చిందని చెప్పారు. సుల్తాన్‌బజార్‌లో మెట్రో మార్గం మార్పుపై ఎల్అండ్టీ సూచించిన 2 ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పాతనగరంలో అలైన్మెంట్ మార్పు చేసిన పక్షంలో తలెత్తే ఇబ్బందులపై అధ్యయనం కొనసాగుతోందని చెప్పారు. పంజాగుట్ట, ఎర్రమంజిల్, హైటెక్‌సిటీల్లో మెట్రో మాల్స్ మెట్రో ప్రాజెక్టుకు మొత్తం రూ.14,132 కోట్లు వ్యయం చేస్తుండగా.. ఇప్పటివరకూ సుమారు రూ.7 వేల కోట్లు ఖర్చు చేశామని గాడ్గిల్ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పంజాగుట్ట, ఎర్రమంజిల్, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో మూడు భారీ మెట్రో మాల్స్ అందుబాటులోకి వస్తాయన్నారు. మొత్తం మూడు కారిడార్లలోని 64 స్టేషన్లు, దశలవారీగా 12 ప్రాంతాల్లో నిర్మించనున్న మెట్రో మాల్స్‌లో 18.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య స్థలాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. వీటిలో ఎంన్సీ కంపెనీల కార్యాలయాలు, మల్టీప్లెక్స్‌లు, హోటళ్లు, ఫుడ్‌కోర్టులు, రిటైల్ షాపింగ్ స్టోర్లు ఉంటాయన్నారు. మెట్రో ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న వాణిజ్య మాల్స్ నిర్మాణానికి, రియల్ఎస్టేట్ అభివృద్ధికి ఎల్అండ్టీ రూ.6,300 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. మెట్రో ప్రాజెక్టులో 50 శాతం ఆదాయం టికెట్ల విక్రయం ద్వారా, మరో 45 శాతం ఆదాయం మాల్స్, వాణిజ్య స్థలాల అభివృద్ధి ద్వారా, మరో ఐదు శాతం స్టేషన్ల వెలుపల, బయటా వాణిజ్య ప్రకటనల ద్వారా సమకూర్చుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన పారిశ్రామిక విధానం ద్వారా నగరానికి పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం పలు రూట్లలో మెట్రో పనులు శరవేగంగా సాగుతున్నాయని, గడువులోగా పనులు పూర్తి చేస్తామన్నారు. మెట్రో ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్‌కు సింగపూర్ లుక్ రానుం దన్నారు. సమశీతల వాతావరణం, కాస్మోపాలిటన్ కల్చర్, భిన్న భాషలు, సంస్కృతులున్న నగరంలో మెట్రో మరో మైలురాయి కానుందన్నారు. ఈ కార్యక్రమంలో మెట్రో కమర్షియల్, అడ్వర్టైజ్మెంట్, స్టేషన్ రిటైల్ బ్రోచర్లను ఎన్వీఎస్ రెడ్డి, గాడ్గిల్ ఆవిష్కరించారు.