మాటేసిన మృత్యువు
32 లక్షల మందిలో క్షయ బ్యాక్టీరియా
28 శాతం మంది పిల్లల్లోనూ..
వ్యాధి నిరోధక శక్తి తగ్గితే ఉగ్రరూపం
జిల్లాలో పెరుగుతున్నక్షయ కేసులు
తీవ్రత గుర్తించని ప్రభుత్వం
కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలో క్షయ నివారణ కేంద్రం(ఓపీ-36)తో పాటు నంద్యాల, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో టీబీ ఆసుపత్రులుఉన్నాయి. వీటితో పాటు నందికొట్కూరు, ఆత్మకూరు, డోన్, కోయిలకుంట్ల, గోనెగండ్ల, పత్తికొండ, ఆలూరు, వెలుగోడు, నంద్యాల(రూరల్), బనగానపల్లి, వెల్దుర్తి, ఎమ్మిగనూరు, ఆదోని(రూరల్), ఆళ్లగడ్డలో టీబీ యూనిట్లు, మైక్రోస్కోప్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మరో 51 మైక్రోస్కోప్ సెంటర్లు కూడా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మొత్తం 51 మైక్రోస్కోపిక్ సెంటర్లలో వ్యాధి నిర్ధారణ చేస్తారు. గత 10 సంవత్సరాల్లో 73,923 మందికి క్షయ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. అందులో 62,835 మంది ఈ వ్యాధి నుంచి విముక్తి పొందారు. డాట్ విధానంలో జిల్లా క్షయ నివారణ సంఘం ద్వారా ప్రభుత్వం ఉచితంగా మందులు పంపిణీ చేస్తోంది.
ఆందోళన కలిగిస్తున్న ఎండీఆర్ టీబీ కేసులు
క్షయ వ్యాధిగ్రస్తులు ఒకసారి 6 నెలలు, రెండవ సారి 8 నెలల పాటు మందులు వాడినా వ్యాధి నయం కాకపోతే దాన్ని మల్టీడ్రగ్ రెసిస్టెన్స్(ఎండీఆర్) టీబీగా గుర్తిస్తారు. వీరి గళ్ల నమూనాలను సేకరించి కర్నూలులోని పరీక్ష కేంద్రంలో సమగ్రమైన వ్యాధి నిర్దారణకు పంపుతారు. ఈ వ్యాధిగ్రస్తులకు రూ.2లక్షల ఖరీదైన మందులు రెండేళ్ల వరకు ప్రత్యక్ష పర్యవేక్షణ పద్ధతిలో ఉచితంగా అందజేస్తారు. జిల్లాలో గత సంవత్సరం 1,305 మందికి ఎండీఆర్ నిర్ధారణ పరీక్ష చేయగా.. 140 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. ఇందులో ప్రస్తుతం 122 మంది చికిత్స పొందుతున్నారు. అధికారుల లెక్కకు చిక్కని వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది.
ఎక్స్రే యూనిట్లు లేక నిర్ధారణ కాని కేసులు
జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్, ఎమ్మిగనూరు, బనగానపల్లి ఆసుపత్రుల్లో మాత్రమే ఎక్స్రే యూనిట్లు ఉన్నాయి. మిగిలిన చోట్ల అందుబాటులో లేవు. ఈ ప్రాంతాల్లో కేవలం గళ్ల పరీక్షపైనే వ్యాధి నిర్ధారణ జరుగుతోంది. ఈ కారణంగా వ్యాధి ఉండి నిర్ధారణ కాని రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీనికి తోడు ఎండీఆర్ టీబీ కేసుల ద్వారా అధిక మందికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త కొత్త వైరస్ల పేరు చెప్పి వచ్చే వ్యాధులకు ఇచ్చే ప్రాధాన్యత చాపకింద నీరులా విస్తరిస్తున్న క్షయను పట్టించుకోకపోవడం దారుణమని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.