medak csi church
-
Medak CSI Church: మెతుకు పంచిన కోవెల.. ప్రత్యేకతలకు నిలయం..
మెదక్ జోన్: శాంతి, ప్రేమ, అహింస, పరోపకారం, సోదరభావాలను సందేశంగా అందించే పవిత్ర స్థలం. కరువు కాలంలో అన్నార్థులను ఆదుకున్న అమృతహస్తం. రోజ్‌వుడ్ కలప, స్పెయిన్ గ్లాస్‌పై కరుణా మయుడి జీవన వృత్తాంతంతో కనువిందు చేసే అత్యద్భుత కట్టడం. ఎల్లలు దాటి సందర్శకులను ఆకర్షిస్తున్న చర్చి మెతుకుసీమకు తలమానికంగా భాసిల్లుతోంది. ఆకలి తీర్చిన ఆలయం.. ►అది మొదటి ప్రపంచయుద్ధం జరుగుతున్న సమయం. అగ్రరాజ్యాల ఆధిపత్యపోరులో సమిధలైన జనం అనేకం. దీనికి భారతదేశం కూడా మినహాయింపు కాలేదు. ►పనిలేక.. బతుకుదెరువు కరువై.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. ►భయంకరమైన కరువు ఏర్పడి గుక్కెడు మెతుకుల కోసం మెతుకు సీమ ప్రజలు అల్లాడుతున్న సమయంలో చార్లెస్ వాకర్ పాస్నెట్ కరుణామయుని కోవెల నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ►ఆలయ నిర్మాణంతో కరువుతో అల్లాడుతున్న ప్రజలకు పట్టెడన్నం దొరికింది. మరోవైపు అద్భుతమైన ఏసయ్య మందిరం నిర్మాణం జరిగింది. దీంతో ఆకలితీర్చిన ఆలయంగా మెదక్ సీఎస్ఐ చర్చి పేరొందింది. అపురూపం.. సుందర కట్టడం ►చారిత్రక కట్టడానికి సంబంధించిన చర్చి గోపురం ఎత్తు 175 అడుగులు. పొడవు 200 అడుగులు, వెడల్పు 100 అడుగులు. ఈ కట్టడానికి మూడు గవాక్షములు, పలు రంగుటద్దములతో ప్రతిష్టింపజేశారు. ►తూర్పున క్రీస్తు జన్మవృత్తాంతం. పడమర శిలువేసి చంపిన దృశ్యం. ఉత్తరాన క్రీస్తు చనిపోయి మూడో రోజు సజీవుడై ఆరోహనమై పోతున్న దృశ్యాలు కనిపిస్తాయి. ►ఇంగ్లాండ్‌కు చెందిన ఫ్రాంకోఓ, సాలిస్‌బరి అనే చిత్రకారులు కేవలం సూర్యకాంతితోనే ఈ మూడు దృశ్యాలు కనిపించేలా తీర్చిదిద్దారు. ►వీటికోసం ప్రత్యేకంగా ప్రతి అద్దానికి మధ్యలో తగరాన్ని ఘనస్థితి నుంచి ద్రవస్థితిలోకి తీసుకొచ్చి, గ్లాస్‌కు మధ్యలో అమర్చి ఉంచారు. దేవాలయ పైకప్పు లోపలి భాగం ప్రతిష్టించిన మూడేళ్ల వరకు ప్రతిధ్వనించేదని చెబుతుంటారు. ►1927లో ఇంగ్లాండ్‌కు చెందిన బాడ్షా, గ్యాస్‌హోప్ అనే ఇంజనీర్లు గోళాకారంలో ఉన్న లోపలి భాగాన్ని రబ్బరు, కాటన్, మరికొన్ని రసాయనాలను ఉపయోగించి ప్రతి ధ్వనించకుండా చేశారు. ►ఈ చారిత్రాత్మక కట్టడం ఆసియాలోనే విస్తీర్ణంలో పెద్దది. ఈ మొత్తం దేవాలయ నిర్మాత ఇంగ్లాండ్‌కు చెందిన రన్‌కోన్ పట్టణ వాసి రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్నెట్. చారిత్రక కట్టడాల్లో సుందర కట్టడంగా పేరొందిన మెదక్ కెథడ్రల్ చర్చి ఎందరో మహానుభావుల అర్కెటిక్ పనితనంతో విరాజిల్లుతోంది. ప్రత్యేకంగా క్రిస్మస్ సందర్భంగా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. చారిత్రాత్మక మందిరానికి పునాది.. ►1914 సంవత్సరం.. అప్పటికే ప్రపంచాన్ని పాలిస్తున్న ఆంగ్లేయులు మత ప్రచారంలో భాగంగా మద్రాస్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో నిర్మించిన చర్చిల్లో విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నారు. ►ఇదే క్రమంలో చార్లెస్ వాకర్ పాస్నెట్ ఇంగ్లాండ్ నుంచి ఆరు నెలల పాటు ఓడలో ప్రయాణించి.. హైదరాబాద్ ప్రాంతంలోని సనత్‌నగర్ చర్చికి.. అక్కడి నుంచి మత ప్రచారంలో భాగంగా బదిలీపై మెదక్‌కు వచ్చారు. ►ఈ క్రమంలో బిషప్ బంగ్లాలో ఒకరాత్రి బస చేశాడు. చర్చి ఎత్తు తక్కువ.. బిషప్ బంగ్లా ఎత్తు ఎక్కువగా ఉండటంతో చర్చిని అందంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో 1914లో పనికి ఆహార పథకం పేరుతో ఈ మహా దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ►అప్పటికే మెతుకు సీమలో ఆకలి చావులతో అల్లాడుతున్న ప్రజలకు ఉపాధి దొరకడంతో తండోపతండాలుగా తరలివచ్చి చర్చి నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ►పదేళ్ల పాటు కొనసాగిన చర్చి నిర్మాణం 1924లో పూర్తికాగా అదే సంవత్సరం డిసెంబర్ 25న ప్రతిష్ఠించారు. అప్పట్లో ఈ నిర్మాణానికి రూ. 14 లక్షలు ఖర్చు అయినట్లు అంచనా. పరలోక దేవుడి పవిత్ర ఆలయం మానవుల పాపాలను తొలగించేందుకు పరలోక దేవుడైన ఏసయ్య కన్య గర్భమందు జని్మంచి.. పాపుల రక్షణకోసం సిలువ వేయబడ్డాడు. ఆయన ప్రతిరూపం కోసమే మెదక్‌లో పవిత్ర ఆలయాన్ని నిర్మించారు. ఈ చర్చి ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందింది. పవిత్రతో ప్రార్థన చేస్తే ప్రత్యక్షమయ్యే ఏసయ్య ఆలయం అద్భుతం. – అండ్రూస్ ప్రేమ్‌కుమార్, చర్చి ప్రెస్బిటరి ఇన్చార్జి, మెదక్ -
కరుణామయుని కోవెలలో..
సాక్షి, మెదక్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చికి భారీ ఎత్తున భక్త జనం తరలివచ్చారు. ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉండే రహదారులు బుధవారం వాహనాలు, భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే భక్తు ల రాక ప్రారంభమైంది. ఉదయం 4.30 గంటలకు జరిగిన మొదటి ఆరాధనలో సీఎస్ఐ చర్చి బిషప్ సాల్మన్‌రాజ్ దైవసందేశం ఇచ్చారు. చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవులతోపాటు హిందువులు, ముస్లింలు కూడా రాగా.. మతసామరస్యం వెల్లివిరిసింది. కాగా, క్రిస్మస్ సందర్భంగా చర్చి ప్రాంగణం జాతరను తలపించింది. పోలీసులు అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించారు. అధికారులతోసహా మొత్తం 450 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. అయితే.. పట్టణంలో కేటాయించిన మూడు పార్కింగ్ స్థలాలు కిక్కిరిసి పోగా.. రహదారుల వెంటే వాహనాలను పార్కింగ్ చేయడంతో పలుచోట్ల ట్రాఫిక్ సమస్య నెలకొంది. దేవుడి ఆశీస్సులతో అభివృద్ధి: హరీశ్‌రావు ఏసయ్య జీవితాంతం ప్రజల కోసమే బతికారని మం త్రి హరీశ్‌రావు అన్నారు. దయ, కరుణ, ప్రేమ గుణాల ను ప్రతీ మనిషి కలిగి ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ దేవుడి ఆశీస్సులతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. అంతకు ముందు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. సీఎస్ఐ చర్చి ముందు భక్తుల రద్దీ -
కనులపండువగా క్రిస్మస్..
మెదక్: ప్రసిద్ధి చెందిన మెదక్ సీఎస్ఐ చర్చిలో శుక్రవారం క్రిస్మస్ వేడుకలు కనుల పండువగా జరిగాయి. ఉత్సవాలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. మెదక్ పట్టణంలోని సీఎస్ఐ చర్చి భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం జరిగిన మొదటి ఆరాధాన కార్యక్రమంలో సుమారు 50 వేల మంది వరకు పాల్గొన్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, దైవ సందేశం, గీతాలాపన తదితర కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 10 గంటలకు రెండవ ఆరాధాన జరగనుంది. మధ్యాహ్నం తర్వాత సుమారు లక్ష నుంచి రెండు లక్షల మంది ప్రార్థనలకు రానున్నట్టు తెలుస్తుంది. -
క్రిస్మస్ వెలుగుల్లో మెదక్ చర్చి
క్రిస్మస్ వేడుకలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చి ముస్తాబైంది. శుక్రవారం జరిగే వేడుకలను పురస్కరించుకుని చర్చిని మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు భక్తులను ఉద్దేశించి మెదక్ డయాసిస్ వైస్‌చైర్మన్ ఏసీ సాలమోన్రాజు సందేశమిస్తారు. ఉదయం పది గంటలకు రెండో ఆరాధన నిర్వహిస్తారు. మెదక్ డయాసిస్ పరిధిలోని మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి, వివిధ దేశాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు రానున్నారు. -
లోకరక్షకా.. నీవే రక్ష
మెదక్/మెదక్‌టౌన్: లోకరక్షకా... నీవే మాకు రక్ష అంటూ... లక్షలాది మంది భక్తులు ఎల్లలు దాటి వెల్లువలా తరలివచ్చారు. కరుణామయుని జన్మదిన వేడుకలను తిలకించడానికి వచ్చిన భక్తులతో మెదక్ మహాదేవాలయ ప్రాంగణం జనారణ్యంగా మారింది. న్యూజిలాండ్ దేశంలోని అక్లాండ్ నగర చర్చి పాస్టర్ డాక్టర్ ప్రమోదరావు వేడుకలు ప్రారంభించగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు రాపోలు అనందభాస్కర్లు వేడుకలకు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మెదక్ సీఎస్ఐ చర్చిలో గురువారం తెల్లవారు జామున ఏసయ్య జన్మదిన వేడుకలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రాలు, జిల్లాలు దాటి తరలివచ్చిన లక్షలాది భక్తులు, సందర్శకులు ఏసయ్య దీవేనల కోసం బారులు తీరారు. గజగజ వణికిస్తున్న చలిని సైతం లెక్క చేయకుండా చెదరని భక్తితో బుధవారం రాత్రి నుంచే భక్తులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున మెదక్ సీఎస్ఐ చర్చికి తరలివచ్చారు. తెల్లవారు జామున 5గంటల ప్రాంతంలో గురువులు శిలువతో చర్చి చుట్టూ ప్రదక్షణ చేసి మహాదేవాలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం జరిగిన మొదటి ఆరాధనలో న్యూజిలాండ్ దేశానికి చెందిన పాస్టర్ ప్రమోదరావు భక్తులకు వాక్యోపదేశం చేశారు. దీనజనోద్ధరణకు మహాప్రభు మానవ జన్మ ఎత్తి అభాగ్యులను అక్కున చేర్చుకున్నారన్నారు. పాపులను క్షమించి.. వారికి దివ్యజ్ఞానాన్ని ప్రసాదించినట్లు తెలిపారు. కులమత, ప్రాంతీయ భేదాలు లేకుండా దేవుని నామస్మరణలతో పాపాలను ప్రక్షాళన చేసుకోవాలన్నారు. ఈ లోకమంతా ఆయురారోగ్యాలతో...సుఖ సంతోషాలతో..పిల్లా పాపలతో.. సకల సంపదలతో విరాజిల్లాలని ఈ సందర్భంగా తాను ప్రభువును వేడుకుంటున్నట్లు తెలిపారు. అజ్ఞానాంధకారాన్ని పారద్రోలడానికి ఏసుక్రీస్తు పునఃజన్మించారన్నారు. మానవత్వమే ప్రభువు అభిమతమని, అందుకే ఆయన చూపిన మార్గం అనుసరణీయమన్నారు. శాంతి, కరుణ, ప్రేమప్రభువు బోధనలన్నారు. వాటి స్థాపనకై దైవ కుమారుడిగా ఏసయ్య భూమి మీదకు వచ్చాడన్నారు. దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత దొరుకుతుందన్నారు. మొదటి ఆరాధనల్లో పాల్గొన్న భక్తులకు ప్రత్యేక ప్రార్థనలు చేసి గురువులు ఆశీర్వదించారు. ఉదయం 7.30గంటల ప్రాంతంలో అక్లాండ్ నగర చర్చి పాస్టర్ డాక్టర్ ప్రమోదరావు క్రిస్మస్ కేక్‌ను కట్‌చేసి ఏసయ్య జన్మదిన వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేక్‌ను ఒకరికొకరు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రెండో ఆరాధనలో పాస్టర్ డాక్టర్ ప్రమోదరావు దైవ సందేశం అందించారు. భక్తులు చర్చి ప్రాంగణంలోని శిలువ వద్ద క్యాండిల్స్ వెలిగించి, కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. చర్చిలోపల వేసిన పశువుల పాక, క్రిస్మస్ ట్రీ, చర్చి ప్రాంగణంలో గల శాంతక్లాజ్ బెలూన్లతోపాటు జిన్నారం మండలం గుమ్మడిదలకు చెందిన భాస్కరచారి థర్మకోల్‌తో తయారు చేసిన చర్చి నమూనాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో చర్చి ప్రెస్బిటరీ ఇన్చార్జి రెవరెండ్ వై.రాబిన్సన్, అసిస్టెంట్ ఇన్చార్జి విజయ్‌కుమార్, కరుణాకర్, గురువులు జార్జ్లతోపాటు సీఎస్ఐ నిర్వాహకులు, మెదక్ పాస్పెట్ కెథడ్రల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్, రాజ్యసభసభ్యుడు: డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్భాస్కర్లు చర్చి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వేర్వేరుగా క్రిస్మస్ కేక్‌ను కట్‌చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో క్రైస్తవులకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. అనంతరం రాజ్యసభసభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ మాట్లాడుతూ చర్చి అభివృద్ధి కోసం ఎంపీ నిధుల నుంచి రూ.18లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. విద్యుత్‌కాంతుల్లో మెరిసిన మహాదేవాలయం: రంగు రంగుల ఎల్ఈడీ లైట్ల వెలుగులో కరుణామయుని కోవెల వింతకాంతులీనింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన చర్చి అందాలకు లెడ్‌లైట్లు మరింత ఆకర్షణగా నిలిచాయి. చర్చి చుట్టూరా, పై గోపురం వరకు, ఆలయం ముందు ఏడు రంగుల లెడ్లైట్లతో అలంకరించారు. భారతి సిమెంట్స్ ఆధ్వర్యంలో పాల వితరణ క్రిస్మస్ ఉత్సవాలలో పాల్గొన్న భక్తులకు భారతి సిమెంట్స్ ఆధ్వర్యంలో పాల వితరణ చేశారు. ఆ సంస్థ జనరల్ మేనేజర్ ఎం.సి.మల్లారెడ్డి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఏ.కొండల్‌రెడ్డి, కరుణాకరన్, టెక్నికల్ మేనేజర్ ఓబుల్‌రెడ్డి, అసిస్టింట్ టెక్నికల్ మేనేజర్ నరెష్కుమార్, సతీష్‌కుమార్, యశ్వంత్, ప్రసాద్, అరవింద్, మల్లిఖార్జున్ ట్రేడర్, రామలింగేశ్వర ట్రేడర్స్ డీలర్లు కిరణ్, లింగమూర్తిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రతి యేడాది లాగే ఈసారి కూడా క్రిస్మస్ వేడుకల్లో భారతిసిమెంట్స్ ద్వార భక్తులకు ఉచితంగాపాలు పంపిణిచేశారు.అనంతరం చర్చ్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేసి భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. భారీ బందోబస్తు క్రిస్మస్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా మెదక్ డీఎస్పీ రాజారత్నం, సీఐలు సాయీశ్వర్‌గౌడ్, రామకృష్ణల నేతృత్వంలో భారీ బస్తు ఏర్పాటు చేశారు. భారీగా తరలివచ్చిన భద్రత సిబ్బంది పట్టణంలోని ప్రలు ప్రధాన కూడళ్లు, బస్టాండ్లతోపాటు చర్చి ప్రధాన ద్వారంతోపాటు ఇతర ప్రాంతాల్లో గస్తి నిర్వహించారు. కిటకిటలాడిన మెదక్పట్టణం క్రిస్మస్ సంబరాలకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులతో మెదక్ పట్టణం కిటకిటలాడింది. పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, స్వీట్‌హౌస్‌లు జనసంద్రంగా మారాయి. ప్రధాన రహదారిపై వాహనాల రాక పోకలకు ప్రయానికులు ఒకింత ఇబ్బందులకు గురయ్యారు. క్రిస్మస్ ఉత్సవాలకోసం ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. -
మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఆరంభం
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మెదక్‌లోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ముందుగా శిలువను ఊరేగించారు. దీంతో వేడుకలు ఆరంభమయ్యాయి. దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలం వైస్ చైర్మన్ రెవరెండ్ సాల్మన్ ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు దైవసందేశాన్ని అందజేశారు. భక్తబృందం పలు పాటలు ఆలపించింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో మెదక్ చర్చికి వచ్చారు. దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు క్రిస్మస్ సందర్భంగా ఇక్కడకు వస్తారని అంచనా వేస్తున్నారు. కులమతాలకు అతీతంగా పలువురు ఇక్కడకు వస్తుండటం ఈసారి విశేషం. తాము గత ఐదేళ్ల నుంచి మెదక్ చర్చికి వస్తున్నామని, ఇది తమకు అలవాటుగా మారిందని హైదరాబాద్‌కు చెందిన ఓ జంట చెప్పారు.