లోకరక్షకా.. నీవే రక్ష
మెదక్/మెదక్‌టౌన్: లోకరక్షకా... నీవే మాకు రక్ష అంటూ... లక్షలాది మంది భక్తులు ఎల్లలు దాటి వెల్లువలా తరలివచ్చారు. కరుణామయుని జన్మదిన వేడుకలను తిలకించడానికి వచ్చిన భక్తులతో మెదక్ మహాదేవాలయ ప్రాంగణం జనారణ్యంగా మారింది. న్యూజిలాండ్ దేశంలోని అక్లాండ్ నగర చర్చి పాస్టర్ డాక్టర్ ప్రమోదరావు వేడుకలు ప్రారంభించగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు రాపోలు అనందభాస్కర్‌లు వేడుకలకు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన మెదక్ సీఎస్‌ఐ చర్చిలో గురువారం తెల్లవారు జామున ఏసయ్య జన్మదిన వేడుకలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రాలు, జిల్లాలు దాటి తరలివచ్చిన లక్షలాది భక్తులు, సందర్శకులు ఏసయ్య దీవేనల కోసం బారులు తీరారు. గజగజ వణికిస్తున్న చలిని సైతం లెక్క చేయకుండా చెదరని భక్తితో బుధవారం రాత్రి నుంచే భక్తులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున మెదక్ సీఎస్‌ఐ చర్చికి తరలివచ్చారు.
తెల్లవారు జామున 5గంటల ప్రాంతంలో గురువులు శిలువతో చర్చి చుట్టూ ప్రదక్షణ చేసి మహాదేవాలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం జరిగిన మొదటి ఆరాధనలో న్యూజిలాండ్ దేశానికి చెందిన పాస్టర్ ప్రమోదరావు భక్తులకు వాక్యోపదేశం చేశారు. దీనజనోద్ధరణకు మహాప్రభు మానవ జన్మ ఎత్తి అభాగ్యులను అక్కున చేర్చుకున్నారన్నారు. పాపులను క్షమించి.. వారికి దివ్యజ్ఞానాన్ని ప్రసాదించినట్లు తెలిపారు. కులమత, ప్రాంతీయ భేదాలు లేకుండా దేవుని నామస్మరణలతో పాపాలను ప్రక్షాళన చేసుకోవాలన్నారు.
ఈ లోకమంతా ఆయురారోగ్యాలతో...సుఖ సంతోషాలతో..పిల్లా పాపలతో.. సకల సంపదలతో విరాజిల్లాలని ఈ సందర్భంగా తాను ప్రభువును వేడుకుంటున్నట్లు తెలిపారు. అజ్ఞానాంధకారాన్ని పారద్రోలడానికి ఏసుక్రీస్తు పునఃజన్మించారన్నారు. మానవత్వమే ప్రభువు అభిమతమని, అందుకే ఆయన చూపిన మార్గం అనుసరణీయమన్నారు. శాంతి, కరుణ, ప్రేమప్రభువు బోధనలన్నారు. వాటి స్థాపనకై దైవ కుమారుడిగా ఏసయ్య భూమి మీదకు వచ్చాడన్నారు. దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత దొరుకుతుందన్నారు.
మొదటి ఆరాధనల్లో పాల్గొన్న భక్తులకు ప్రత్యేక ప్రార్థనలు చేసి గురువులు ఆశీర్వదించారు. ఉదయం 7.30గంటల ప్రాంతంలో అక్లాండ్ నగర చర్చి పాస్టర్ డాక్టర్ ప్రమోదరావు క్రిస్మస్ కేక్‌ను కట్‌చేసి ఏసయ్య జన్మదిన వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేక్‌ను ఒకరికొకరు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రెండో ఆరాధనలో పాస్టర్ డాక్టర్ ప్రమోదరావు దైవ సందేశం అందించారు. భక్తులు చర్చి ప్రాంగణంలోని శిలువ వద్ద క్యాండిల్స్ వెలిగించి, కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు.
చర్చిలోపల వేసిన పశువుల పాక, క్రిస్మస్ ట్రీ, చర్చి ప్రాంగణంలో గల శాంతక్లాజ్ బెలూన్‌లతోపాటు జిన్నారం మండలం గుమ్మడిదలకు చెందిన భాస్కరచారి థర్మకోల్‌తో తయారు చేసిన చర్చి నమూనాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో చర్చి ప్రెస్బిటరీ ఇన్‌చార్జి రెవరెండ్ వై.రాబిన్‌సన్, అసిస్టెంట్ ఇన్‌చార్జి విజయ్‌కుమార్, కరుణాకర్, గురువులు జార్జ్‌లతోపాటు సీఎస్‌ఐ నిర్వాహకులు, మెదక్ పాస్పెట్ కెథడ్రల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్, రాజ్యసభసభ్యుడు:
డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్‌భాస్కర్‌లు చర్చి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వేర్వేరుగా క్రిస్మస్ కేక్‌ను కట్‌చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో క్రైస్తవులకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. అనంతరం రాజ్యసభసభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ మాట్లాడుతూ చర్చి అభివృద్ధి కోసం ఎంపీ నిధుల నుంచి రూ.18లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.
విద్యుత్‌కాంతుల్లో మెరిసిన మహాదేవాలయం:
రంగు రంగుల ఎల్‌ఈడీ లైట్ల వెలుగులో కరుణామయుని కోవెల వింతకాంతులీనింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన చర్చి అందాలకు లెడ్‌లైట్లు మరింత ఆకర్షణగా నిలిచాయి. చర్చి చుట్టూరా, పై గోపురం వరకు, ఆలయం ముందు ఏడు రంగుల లెడ్‌లైట్లతో అలంకరించారు.
భారతి సిమెంట్స్ ఆధ్వర్యంలో పాల వితరణ
క్రిస్మస్ ఉత్సవాలలో పాల్గొన్న భక్తులకు భారతి సిమెంట్స్ ఆధ్వర్యంలో పాల వితరణ చేశారు. ఆ సంస్థ జనరల్ మేనేజర్ ఎం.సి.మల్లారెడ్డి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఏ.కొండల్‌రెడ్డి, కరుణాకరన్, టెక్నికల్ మేనేజర్ ఓబుల్‌రెడ్డి, అసిస్టింట్ టెక్నికల్ మేనేజర్ నరెష్‌కుమార్, సతీష్‌కుమార్, యశ్వంత్, ప్రసాద్, అరవింద్, మల్లిఖార్జున్ ట్రేడర్, రామలింగేశ్వర ట్రేడర్స్ డీలర్లు కిరణ్, లింగమూర్తిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రతి యేడాది లాగే ఈసారి కూడా క్రిస్మస్ వేడుకల్లో భారతిసిమెంట్స్ ద్వార భక్తులకు ఉచితంగాపాలు పంపిణిచేశారు.అనంతరం చర్చ్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేసి భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
భారీ బందోబస్తు
క్రిస్మస్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా మెదక్ డీఎస్పీ రాజారత్నం, సీఐలు సాయీశ్వర్‌గౌడ్, రామకృష్ణల నేతృత్వంలో భారీ బస్తు ఏర్పాటు చేశారు. భారీగా తరలివచ్చిన భద్రత సిబ్బంది పట్టణంలోని ప్రలు ప్రధాన కూడళ్లు, బస్టాండ్లతోపాటు చర్చి ప్రధాన ద్వారంతోపాటు ఇతర ప్రాంతాల్లో గస్తి నిర్వహించారు.
కిటకిటలాడిన మెదక్‌పట్టణం
క్రిస్మస్ సంబరాలకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులతో మెదక్ పట్టణం కిటకిటలాడింది. పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, స్వీట్‌హౌస్‌లు జనసంద్రంగా మారాయి. ప్రధాన రహదారిపై వాహనాల రాక పోకలకు ప్రయానికులు ఒకింత ఇబ్బందులకు గురయ్యారు. క్రిస్మస్ ఉత్సవాలకోసం ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.