మెదక్ జోన్: శాంతి, ప్రేమ, అహింస, పరోపకారం, సోదరభావాలను సందేశంగా అందించే పవిత్ర స్థలం. కరువు కాలంలో అన్నార్థులను ఆదుకున్న అమృతహస్తం. రోజ్‌వుడ్ కలప, స్పెయిన్ గ్లాస్‌పై కరుణా మయుడి జీవన వృత్తాంతంతో కనువిందు చేసే అత్యద్భుత కట్టడం. ఎల్లలు దాటి సందర్శకులను ఆకర్షిస్తున్న చర్చి మెతుకుసీమకు తలమానికంగా భాసిల్లుతోంది.
ఆకలి తీర్చిన ఆలయం..
►అది మొదటి ప్రపంచయుద్ధం జరుగుతున్న సమయం. అగ్రరాజ్యాల ఆధిపత్యపోరులో సమిధలైన జనం అనేకం. దీనికి భారతదేశం కూడా మినహాయింపు కాలేదు.
►పనిలేక.. బతుకుదెరువు కరువై.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జనం
బిక్కుబిక్కుమంటూ గడిపారు.
►భయంకరమైన కరువు ఏర్పడి గుక్కెడు మెతుకుల కోసం మెతుకు సీమ ప్రజలు అల్లాడుతున్న సమయంలో చార్లెస్ వాకర్ పాస్నెట్ కరుణామయుని కోవెల నిర్మించేందుకు ముందుకు వచ్చారు.
►ఆలయ నిర్మాణంతో కరువుతో అల్లాడుతున్న ప్రజలకు పట్టెడన్నం దొరికింది. మరోవైపు అద్భుతమైన ఏసయ్య మందిరం నిర్మాణం జరిగింది. దీంతో ఆకలితీర్చిన ఆలయంగా మెదక్ సీఎస్‌ఐ చర్చి పేరొందింది.
అపురూపం.. సుందర కట్టడం
►చారిత్రక కట్టడానికి సంబంధించిన చర్చి గోపురం ఎత్తు 175 అడుగులు. పొడవు 200 అడుగులు, వెడల్పు 100 అడుగులు. ఈ కట్టడానికి మూడు గవాక్షములు, పలు రంగుటద్దములతో ప్రతిష్టింపజేశారు.
►తూర్పున క్రీస్తు జన్మవృత్తాంతం. పడమర శిలువేసి చంపిన దృశ్యం. ఉత్తరాన క్రీస్తు చనిపోయి మూడో రోజు సజీవుడై ఆరోహనమై పోతున్న దృశ్యాలు
కనిపిస్తాయి.
►ఇంగ్లాండ్‌కు చెందిన ఫ్రాంకోఓ, సాలిస్‌బరి అనే చిత్రకారులు కేవలం సూర్యకాంతితోనే ఈ మూడు దృశ్యాలు కనిపించేలా తీర్చిదిద్దారు.
►వీటికోసం ప్రత్యేకంగా ప్రతి అద్దానికి మధ్యలో తగరాన్ని ఘనస్థితి నుంచి ద్రవస్థితిలోకి తీసుకొచ్చి, గ్లాస్‌కు మధ్యలో అమర్చి ఉంచారు. దేవాలయ పైకప్పు లోపలి భాగం ప్రతిష్టించిన మూడేళ్ల వరకు ప్రతిధ్వనించేదని చెబుతుంటారు.
►1927లో ఇంగ్లాండ్‌కు చెందిన బాడ్‌షా, గ్యాస్‌హోప్ అనే ఇంజనీర్లు గోళాకారంలో ఉన్న లోపలి భాగాన్ని రబ్బరు, కాటన్, మరికొన్ని రసాయనాలను ఉపయోగించి ప్రతి ధ్వనించకుండా చేశారు.
►ఈ చారిత్రాత్మక కట్టడం ఆసియాలోనే విస్తీర్ణంలో పెద్దది. ఈ మొత్తం దేవాలయ నిర్మాత ఇంగ్లాండ్‌కు చెందిన రన్‌కోన్ పట్టణ వాసి రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్నెట్. చారిత్రక కట్టడాల్లో సుందర కట్టడంగా పేరొందిన మెదక్ కెథడ్రల్ చర్చి ఎందరో మహానుభావుల అర్కెటిక్ పనితనంతో విరాజిల్లుతోంది. ప్రత్యేకంగా క్రిస్మస్ సందర్భంగా దేదీప్యమానంగా వెలిగిపోతుంది.
చారిత్రాత్మక మందిరానికి పునాది..
►1914 సంవత్సరం.. అప్పటికే ప్రపంచాన్ని పాలిస్తున్న ఆంగ్లేయులు మత ప్రచారంలో భాగంగా మద్రాస్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో నిర్మించిన చర్చిల్లో విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నారు.
►ఇదే క్రమంలో చార్లెస్ వాకర్ పాస్నెట్ ఇంగ్లాండ్ నుంచి ఆరు నెలల పాటు ఓడలో ప్రయాణించి.. హైదరాబాద్ ప్రాంతంలోని సనత్‌నగర్ చర్చికి.. అక్కడి నుంచి మత ప్రచారంలో భాగంగా బదిలీపై మెదక్‌కు వచ్చారు.
►ఈ క్రమంలో బిషప్ బంగ్లాలో ఒకరాత్రి బస చేశాడు. చర్చి ఎత్తు తక్కువ.. బిషప్ బంగ్లా ఎత్తు ఎక్కువగా ఉండటంతో చర్చిని అందంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో 1914లో పనికి ఆహార పథకం పేరుతో ఈ మహా దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
►అప్పటికే మెతుకు సీమలో ఆకలి చావులతో అల్లాడుతున్న ప్రజలకు ఉపాధి దొరకడంతో తండోపతండాలుగా తరలివచ్చి చర్చి నిర్మాణంలో పాలు పంచుకున్నారు.
►పదేళ్ల పాటు కొనసాగిన చర్చి నిర్మాణం 1924లో పూర్తికాగా అదే సంవత్సరం డిసెంబర్ 25న ప్రతిష్ఠించారు. అప్పట్లో ఈ నిర్మాణానికి రూ. 14 లక్షలు ఖర్చు అయినట్లు అంచనా.
పరలోక దేవుడి పవిత్ర ఆలయం
మానవుల పాపాలను తొలగించేందుకు పరలోక దేవుడైన ఏసయ్య కన్య గర్భమందు జని్మంచి.. పాపుల రక్షణకోసం సిలువ వేయబడ్డాడు. ఆయన ప్రతిరూపం కోసమే మెదక్‌లో పవిత్ర ఆలయాన్ని నిర్మించారు. ఈ చర్చి ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందింది. పవిత్రతో ప్రార్థన చేస్తే ప్రత్యక్షమయ్యే ఏసయ్య ఆలయం అద్భుతం.
– అండ్రూస్ ప్రేమ్‌కుమార్, చర్చి ప్రెస్బిటరి ఇన్‌చార్జి, మెదక్
Comments
Please login to add a commentAdd a comment