Medical Center
-
వైద్యరంగంలో మహిళల భాగస్వామ్యం పెరగాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వైద్యరంగంలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. దేశవ్యాప్తంగా వైద్యవిద్యలోకి అడుగుపెడుతున్న మహిళల సంఖ్య క్రమేపీ పెరుగుతున్నా ఉన్నతవిద్యలో తగ్గుముఖం పడుతోందని, ఈ పరిస్థితి మారాలని అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఆసుపత్రి ఆవరణలో ‘వుమెన్ ఇన్ మెడిసిన్’అన్న అంశంపై ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. వైద్యరంగంలో రాణించిన మహిళలు ఎందరో ఉన్నారని, దేశంలో తొలి మహిళాడాక్టర్ ఆనందిబెన్, కేన్సర్ నిపుణురాలు డాక్టర్ వి.శాంత తదితరులను ఉదహరించారు. కోవిడ్ కష్టకాలంలో భారత్‌లో తయారైన మూడు టీకాల్లో రెండింటికి మహిళలే నేతృత్వం (సుచిత్రా ఎల్లా, మహిమ దాట్ల) వహించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. కార్యక్రమంలో ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్, ప్రముఖ జీర్ణకోశ వ్యాధుల వైద్యులు డాక్టర్ జి.నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ షాపులో భార్య రాసలీలలు.. తట్టుకోలేక అతడిని..
కలకత్తా: కట్టుకున్న భర్త ఉండగా ఓ మెడికల్ దుకాణం యజమానితో భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలిసిన భర్త రెండు మూడు సార్లు వారించాడు. భార్యతో సంబంధాలు కొనసాగిస్తున్న వ్యక్తిని పలుమార్లు హెచ్చరించాడు. అయినా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఇక తట్టుకోలేక అతడిని అంతమొందించాడు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్లోని తూర్పు 24 పరగణాల జిల్లా అశోక్‌నగర్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అశోక్‌నగర్‌లో అపు కహార్ తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అయితే భార్యకు శ్రీకృష్ణాపూర్ ప్రాంతంలో ఉన్న మెడికల్ షాప్ యజమాని మిలాన్ ఘోష్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆయన మెడికల్ దుకాణం నిర్వహిస్తుండడంతో తరచూ ఆమె అక్కడకు వెళ్లేది. కొన్నాళ్లు విషయం భర్త కహర్‌కు తెలిసింది. అతడు మిలాన్‌ను హెచ్చరించాడు. అయినా కూడా వారిద్దరూ సంబంధం కొనసాగిస్తున్నారు. తీవ్ర ఆగ్రహంతో శుక్రవారం మధ్యాహ్నం మిలాన్‌ను చంపేందుకు బయల్దేరాడు. రద్దీగా ఉండే నోట్‌ని మార్కెట్‌కు షాపింగ్ కోసం వెళ్లిన మిలాన్ ఘోష్ వెంటపడ్డాడు. అందరూ చూస్తుండగానే మిలాన్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. అతడిని స్థానికులు నిలువరించారు. గాయాలపాలైన మిలాన్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. దాడికి పాల్పడిన అఫు కహార్‌ను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికాలో నర్సుకు తొలి టీకా
న్యూయార్క్: అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం ఉదయం ప్రారంభమైంది. న్యూయార్క్ నగరంలోని క్వీన్స్‌లో ఉన్న లాంగ్ ఐలాండ్ జ్యుయిష్ మెడికల్ సెంటర్ ఐసీయూలో నర్సుగా పని చేస్తున్న సాండ్రా లిండ్సేకు తొలి వ్యాక్సిన్ డోసు ఇచ్చారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కావడంతో జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఫైజర్–బయోఎన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ డోసును సాండ్రా లిండ్సేకు ఇచ్చారు. కరోనా నుంచి త్వరగా కోలుకుంటానని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. అమెరికా చరిత్రలో బాధాకరమైన సమయం ముగిసిపోవడానికి ఇదొక ప్రారంభం అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌తో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, పూర్తి రక్షణ ఇస్తుందని ప్రజల్లో విశ్వాసం కల్పించాలని తాను కోరుకుంటున్నట్లు వివరించారు. చీకటిలో వెలుగు రేఖ కనిపించినప్పటికీ ప్రజలు కరోనా నియంత్రణ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సాండ్రా సూచించారు. మాస్కులు ధరించాలని కోరారు. కరోనా టీకా తీసుకునేలా ఇతరులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. దేశంలో కరోనా టీకా కార్యక్రమం ప్రారంభం కావడం పట్ల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ‘అమెరికాకు శుభాకాంక్షలు, ప్రపంచానికి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. న్యూయార్క్ గవర్నర్ మాట్లాడుతూ.. కరోనాపై జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికే ఆయుధం వ్యాక్సిన్ అని చెప్పారు. పుస్తకంలోని చివరి అధ్యాయం ఇప్పుడు మొదలైందని పేర్కొన్నారు. తాను కూడా వ్యాక్సిన్ తీసుకుంటానని ఫైజర్ సీఈఓ ఆల్బర్ట్ తెలిపారు. -
విద్యార్థినిపై అత్యాచారం?
నకిలీ డాక్టర్ అరెస్ట్ టీనగర్: మెడికల్ సెంటర్‌కు చికిత్స కోసం వెళ్లిన విద్యార్థినికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారం జరిపిన నకిలీ డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన వాళప్పాడిలో సంచలనం కలిగించింది. సేలం జిల్లా వాళప్పాడి సమీపంలోగల ఓలప్పాడికి చెందిన నవాబ్ (48). ఇతను పెద్దనాయకన్ పాళయంలో నశీం ఫార్మశీ పేరిట మెడికల్ సెంటర్ నడుపుతున్నాడు. ఈ దుకాణం లోపలే రోగులకు వైద్య చికిత్స చేస్తుంటాడు. ఇతని మెడికల్ సెంటర్ సమీపంలో నివశిస్తున్న ప్లస్‌టూ విద్యార్థినికి అనారోగ్యం ఏర్పడడంతో శనివారం రాత్రి నవాబ్ మెడికల్ సెంటర్‌కు వెళ్లింది. ఆ సమయంలో విద్యార్థినికి నవాబ్ ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో కొంత సేపట్లోనే విద్యార్థిని మత్తులోకి జారుకుంది. కొద్దిసేపట్లో మత్తు నుంచి తేరుకున్న విద్యార్థినికి నవాబ్ మందులు ఇచ్చి ఇంటికి పంపించేశాడు. విద్యార్థిని ఇంటికి వెళ్లగానే ఒంట్లో నలతగా ఉన్నట్లు గమనించింది. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిపింది. దీనిపై వారు విచారణ జరపగా విద్యార్థినికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నవాబ్ అత్యాచారం చేసినట్లు తెలిసింది. ఆగ్రహించిన స్థానికులు నవాబ్‌పై దాడి చేశారు. అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు. సెంటర్ బయట వున్న మోటార్ సైకిల్‌కు నిప్పంటించి కాల్చివేశారు. సమాచారం అందుకున్న ఏత్తాప్పూర్ పోలీసులు సంఘటన స్థలం చేరుకుని విచారణ జరిపారు. తర్వాత నవాబ్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. బాధిత విద్యార్థినిని వైద్య పరీక్షల కోసం పంపేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. టెన్త్ వరకు మాత్రమే విద్య నభ్యసించిన నవాబ్ మెడికల్ సెంటర్ నడపడమే కాకుండా మందుల కోసం వచ్చేవారికి చికిత్స అందిస్తాడు. పోలీసులు అతని వద్ద తీవ్ర విచారణ జరుపుతున్నారు. -
పురుడు పోసుకుంది!
అనగనగా ఓ ఊరు.. దాని పేరు వంగర.. అక్కడో ఆరోగ్య కేంద్రం ఉంది. చుట్టుపక్కల పల్లెలకు అదే ఆధారం. అయితే చిన్నాచితకా జ్వరాలకే తప్ప పురుడు పోసుకునేందుకు ఆ ప్రాంత ప్రజలు ఆ ఆస్పత్రి గడప తొక్కేవారు కాదు. 12 ఏళ్లుగా ఇదే పరిస్థితి. కారణం.. ఆ ఆస్పత్రికి దెయ్యం పట్టిందట!.. అక్కడ పుట్టే బిడ్డలను అది చంపేస్తుందట!!.. అదేం చిత్రమో.. ఇంకే ఆధారం లేకపోయినా.. దూరాభారం వెళ్లలేక గర్భిణులు, శిశువులు అసువులు బాస్తున్నా సరే.. దెయ్యం పట్టిన ఆస్పత్రికి రామంటే.. రామని.. బిగదీసుకున్నారు అమాయక పల్లెవాసులు. దాదాపు ఏడాదిన్నర క్రితం వరకు ఇదే దుస్థితి. క్రమంగా పరిస్థితి మారింది. చైతన్యం పురుడు పోసుకుంది. పండంటి బిడ్డలకు జన్మనిస్తూ పీహెచ్సీ తెగ మురిసిపోతోంది.వంగర, న్యూస్‌లైన్:.. ఆరోగ్యకరమైన ఈ మార్పునకు ప్రధాన కారకుడు పీహెచ్సీ వైద్యాధికారి సీతారాం. 2012 జూలై 25న ఇక్కడ బాధ్యతలు చేపట్టిన ఆయన పీహెచ్సీ దుస్థితి చూసి విషయమేంటని ఆరా తీశారు. ఆర్థిక, రవాణా సమస్యలతో పట్టణ ప్రాంతాలకు వెళ్లలేక ఎంతో మంది గర్భిణులు, శిశువులు మరణిస్తున్నా సరే.. ఈ పీహెచ్సీ సేవలు మాత్రం మాకొద్దు బాబోయ్ అంటూ ప్రజలు హడలిపోవడానికి కారణాలు క నుగొన్నారు. అప్పుడు అసలు విషయం తెలిసింది. సమస్యలే అసలు దెయ్యాలు మండల కేంద్రమైన వంగరతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు వైద్య సేవలు కల్పించేందుకు 2000 సంవత్సరంలో ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ) ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయి స్థలం లభించకపోవడంతో ఈ భవనాన్ని గ్రామానికి ఆనుకొని ఉన్న కొండపై నిర్మించారు. దానికి ఆనుకొనే శ్మశాన వాటిక ఉంది. కాగా పీహెచ్‌సీకి రావడానికి కూడా అప్పట్లో సరైన రవాణా సౌకర్యం ఉండేది కాదు. అతి కష్టం మీద గర్భిణులను తీసుకొచ్చినా.. సకాలంలో వైద్యం అందించి, పురుడు పోయించడానికి వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేవారు కాదు. ఇదే కారణంతో పీహెచ్సీ ఏర్పాటైన కొత్తలోనే ఓ మహిళ ప్రసవించిన వెంటనే మరణించింది. తర్వాత కొద్దిసేపటికే శిశువు కూడా మృతి చెందింది. అంతే.. అప్పటి నుంచి ఆస్పత్రిలో దెయ్యం ఉందని.. అదే తల్లీబిడ్డలను కబళించిందని ఆమె బంధువులు అపోహ పడ్డారు. అదే ఆ నోటా ఈ నోటా చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ పాకింది. ఆ భయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అప్పటి నుంచి ప్రసవాలకు ఈ ఆస్పత్రికి రావడం మానుకున్నారు. దాంతో దాదాపు 12 ఏళ్లు అక్కడ ప్రసవాలే జరగలేదు. గాయపడిన మనసులకు చికిత్స బలంగా నాటుకుపోయిన మూఢ విశ్వాసంతో గాయపడిన ప్రజల మనసులకు ముందు చికిత్స చేస్తే తప్ప పరిస్థితి మారదని, ఆస్పత్రి ప్రసవాలకు అవకాశం ఉండదని గుర్తించిన డాక్టర్ సీతారాం ఆ దిశగా కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. మొదట తమ సిబ్బందితోనే ప్రారంభించారు. పీహెచ్సీలో పనిచేసే వారితోపాటు గ్రామాల్లో తిరిగే ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందిని పలుమార్లు సమావేశపరిచి మాట్లాడారు. ఎంత నచ్చజెప్పినా ప్రజలనుంచి దెయ్యం భయాన్ని తొలగించలేకపోతున్నామని వారు చెప్పారు. దాంతో ఆయన నేరుగా గ్రామాల్లోకే వెళ్లడం ప్రారంభించారు. సిబ్బంది సహాయంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. పల్లెకుపోదాం, గ్రామదర్శిని, గ్రామ సభలు, టీకా, పల్స్ పోలియో కార్యక్రమాలను కూడా ఇందుకు ఉపయోగించుకున్నారు. ఏ చిన్న సందర్భం వచ్చినా ఆస్పత్రి ప్రసవాలపై చైతన్యం కలిగించేందుకు వినియోగించుకున్నారు. ఆస్పత్రిలో దెయ్యం లేదని, అదంతా అపోహ, భయమేనని స్పష్టం చేస్తూ గర్భిణులను తీసుకురండి.. ప్రసవం చేయించి.. సురక్షితంగా పంపించే పూచీ నాదని’ భరోసా ఇస్తూ.. మెల్లగా వారి మనసుల్లో గూడు కట్టుకున్న భ యాన్ని తొలగించారు. స్వల్ప కాలంలోనే ఎంతో మార్పు అంతే మార్పు మొదలైంది. గత ఏడాది మే నెల నుంచి గర్భిణులు పీహెచ్సీ తలుపు తట్టడం ప్రారంభించారు. మొదట్లో ఒకరిద్దరే రాగా.. వారికి సుఖప్రసవం చేయించి తల్లీబిడ్డలను సురక్షితంగా ఇళ్లకు పంపించడంతో ప్రజల్లో నమ్మకం పెరిగింది. మారుమూల గ్రామాల నుంచి గర్భిణులు రావడం క్రమంగా పెరిగింది. పీహెచ్సీలో ప్రసవాలు సంఖ్యా గణనీయంగా పెరిగింది. గత పుష్కర కాలంలో ఒక్క కాన్పు కూడా జరగని ఈ పీహెచ్సీలో గత ఏడాది మే నుంచి డిసెంబర్ వరకు ఏడు నెలల్లోనే 70 మంది గర్భిణులు ఇక్కడ పురుడు పోసుకొని పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. పీహెచ్సీ కళకళ అప్పుడే ఈ లోకంలోకి అడుగుపెట్టిన బిడ్డల కేరింతలు.. తల్లిదండ్రుల ఆనందోత్సాహాలతో ఆరోగ్య కేంద్రం కొత్త కళ సంతరించుకుంది. గత ఏడాది వరకు ఇక్కడి ప్రసవాల గది పట్లు పట్టి దుమ్మూధూళి, చెత్తాచెదారాలతో నిండి ఉండేది. ఇప్పుడు వాటి స్థానంలో వైద్య పరికరాలు బెడ్లు తళతళలాడుతూ కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి అందిన వివిధ పథకాల నిధులతో అవసరమైన పరికరాలు దశలవారీగా కొనుగోలు చేశారు. పుట్టిన శిశువుల ఆరోగ్య పరిరక్షణకు వార్మర్ సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. తల్లీబిడ్డలకు అవసరమైన అన్ని రకాల మందులు ఉన్నాయి.