విద్యార్థినిపై అత్యాచారం?
నకిలీ డాక్టర్ అరెస్ట్
టీనగర్: మెడికల్ సెంటర్‌కు చికిత్స కోసం వెళ్లిన విద్యార్థినికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారం జరిపిన నకిలీ డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన వాళప్పాడిలో సంచలనం కలిగించింది. సేలం జిల్లా వాళప్పాడి సమీపంలోగల ఓలప్పాడికి చెందిన నవాబ్ (48). ఇతను పెద్దనాయకన్ పాళయంలో నశీం ఫార్మశీ పేరిట మెడికల్ సెంటర్ నడుపుతున్నాడు. ఈ దుకాణం లోపలే రోగులకు వైద్య చికిత్స చేస్తుంటాడు.
ఇతని మెడికల్ సెంటర్ సమీపంలో నివశిస్తున్న ప్లస్‌టూ విద్యార్థినికి అనారోగ్యం ఏర్పడడంతో శనివారం రాత్రి నవాబ్ మెడికల్ సెంటర్‌కు వెళ్లింది. ఆ సమయంలో విద్యార్థినికి నవాబ్ ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో కొంత సేపట్లోనే విద్యార్థిని మత్తులోకి జారుకుంది. కొద్దిసేపట్లో మత్తు నుంచి తేరుకున్న విద్యార్థినికి నవాబ్ మందులు ఇచ్చి ఇంటికి పంపించేశాడు. విద్యార్థిని ఇంటికి వెళ్లగానే ఒంట్లో నలతగా ఉన్నట్లు గమనించింది. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిపింది.
దీనిపై వారు విచారణ జరపగా విద్యార్థినికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నవాబ్ అత్యాచారం చేసినట్లు తెలిసింది. ఆగ్రహించిన స్థానికులు నవాబ్‌పై దాడి చేశారు. అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు. సెంటర్ బయట వున్న మోటార్ సైకిల్‌కు నిప్పంటించి కాల్చివేశారు. సమాచారం అందుకున్న ఏత్తాప్పూర్ పోలీసులు సంఘటన స్థలం చేరుకుని విచారణ జరిపారు.
తర్వాత నవాబ్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. బాధిత విద్యార్థినిని వైద్య పరీక్షల కోసం పంపేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. టెన్త్ వరకు మాత్రమే విద్య నభ్యసించిన నవాబ్ మెడికల్ సెంటర్ నడపడమే కాకుండా మందుల కోసం వచ్చేవారికి చికిత్స అందిస్తాడు. పోలీసులు అతని వద్ద తీవ్ర విచారణ జరుపుతున్నారు.