fake doctor arrested
-
ఉస్మానియా జనరల్ ఆసుపత్రి: నకిలీ డాక్టర్ ఆరెస్టు
సాక్షి, అఫ్జల్‌గంజ్: ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో నకిలీ డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను ప్రభుత్వ వైద్యుడినని చెప్పుకుంటూ రోగులకు వేద్యసేవలు చేస్తున్న వైద్యుడిని డ్యూటీ సీఎంఓ డాక్టర్ ప్రణీత గుర్తించి వెంటనే ఆర్ఎంఓకు సమాచారం ఇచ్చారు. ఆర్ఎంఓ సిద్ధీఖీ అతడిని విచారించగా పొంతన లేని సమాధానం చెప్పడంతో అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నకిలీ డాక్టర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా చంద్రాయణగుట్ట, బండ్లగూడ ప్రాంతానికి చెందిన మార్వాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌గా (27) గుర్తించారు. ఇతను గతంలోనూ ఉస్మానియా ఆస్పత్రిలో నకిలీ వైద్యుడిగా చలామణి అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సై బాలస్వామి దర్యాప్తు చేపట్టారు. -
కూకట్‌పల్లిలో బయటపడ్డ ఫేక్ డాక్టర్ మోసం!
సాక్షి, కేపీహెచ్‌బీ కాలనీ: నకిలీ ధ్రువపత్రాలతో ఎంబీబీఎస్ డాక్టర్‌గా అవతారమెత్తిన ఓ ఆర్ఎంపీని కేపీహెచ్‌బీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న మెడికల్ కౌన్సిల్ ధ్రువీకరణ పత్రాలను డౌన్లోడ్ చేసి ఫోర్జరీ సంతకాలతో పత్రాలను సృష్టించడంతో పాటు పలు ఆస్పత్రులు, రోగులను మోసం చేసిన నకిలీ డాక్టర్ బాగోతాన్ని అసలు డాక్టర్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ లక్ష్మినారాయణ వివరాలు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా, అల్లవరంకు చెందిన మంగుం కిరణ్‌కుమార్ (48) ఆయుర్వేద క్లీనిక్‌లో కాంపౌండర్‌గా చేరి, ఆర్ఎంపీగా మారి విశాఖపట్నంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద 2013 – 2015లో హైమవతి క్లీనిక్ పేరుతో ఆస్పత్రిని ప్రారంభించాడు. అంతాగా లాభం రాకపోవడంతో మూసేశాడు. ఇంటర్నెట్లో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిష్టర్ అయిన డాక్టర్ల ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తుండగా అతని పేరు, ఇంటి పేరుకు దగ్గరగా ఉన్న కిరణ్‌కుమార్ ఎం (ముక్కు) ఎంబీబీఎస్, ఎండీ, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పత్రం కంటపడింది. వెంటనే దానిని డౌన్లోడ్ చేసి కలర్ ప్రింట్లు తీసుకుని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ హైదరాబాద్ అనే పేరుతో నకిలీ స్టాంపును తయారు చేయించి రిజిస్ట్రార్ సంతకాన్ని తానే ఫోర్జరీ చేశాడు. ఆ సర్టిఫికెట్లను చూపించి శ్రీకాకుళం జిల్లా రాజాంలోని జీఎంఆర్ ఆస్పత్రిలో డాక్టర్‌గా చేరి నెలకు రూ. 80 వేల జీతం పొందాడు. ఆ తర్వాత కిరణ్‌కుమార్ పనితీరుపై ఆసుపత్రి వర్గాలకు అనుమానం రావటంతో చెప్పా పెట్టకుండా అక్కడి నుంచి అమలాపురంలోని శ్రీనిధి ఆస్పత్రిలో రెండు నెలల పనిచేశాడు. ఆ తర్వాత భీమవరంలోని ఇంపీరియల్ ఆస్పత్రిలో చేరాడు. వారికి కూడా అనుమానం రావడంతో 2019లో ఆస్పత్రులకు వెళ్లటం మానేసి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో యూనివర్సిల్ క్లీనిక్‌లో, కాంటినెంటల్ ఆసుపత్రిలో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్‌గా పనిచేస్తున్న అసలైన డాక్టర్ కిరణ్‌కుమార్ ముక్కు, తన ఇన్‌కంటాక్స్ రిటర్న్‌ల కోసం ఐటి శాఖను సంప్రందించగా, అక్కడ అతని పేరుతో అప్పటికే రెండు పాన్ కార్డులు జారీ అయినట్లు తెలిసింది. దీంతో అనుమానం వచ్చిన కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదుతో నకిలీ డాక్డర్ కిరణ్‌కుమార్ మంగుంను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఐదు చదివిన ‘డాక్టర్’.. అరెస్ట్
సాక్షి, మేడిపల్లి: డాక్టర్‌నంటూ నమ్మబలికాడు.. మంచి డాక్టర్‌గా అందరి ముందు నటించాడు.. అందరితోనూ ప్రశంసలూ పొందాడు.. రాచకొండ పోలీసులకే చికిత్స చేసి భేష్ అనిపించుకున్నాడు.. తీరా అతని గుట్టు రట్టు అయ్యే సరికి అందరూ నివ్వెరపోయారు. ఈ సంఘటన రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో తీవ్ర సంచలనం రేపింది. మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం బొడ్డువారిపాలెం గ్రామానికి చెందిన వెంకట్రావు కుమారుడు తేజ అలియాస్ తేజారెడ్డి అలియాస్ అవినాష్ రెడ్డి అలియాస్ వీరగంధం తేజ(23) నగరంలోని బోడుప్పల్ వెస్ట్ బాలాజీ హిల్స్‌లో నివాసం ఉంటున్నాడు. 5వ తరగతితోనే చదువు ఆపేశాడు. తండ్రి వీరగంధం వెంకట్రావ్, మిత్రుడు శ్రీనివాస్‌రావు సహకారంతో తేజ పేరుతో నకిలీ గుర్తింపు కార్డులను సంపాదించాడు. అంతేకాకుండా టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణత పత్రాలను సాధించాడు. భారతీయ శిక్షా పరిషత్ లక్నో, ఉత్తర్‌ప్రదేశ్ పండిత్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ మెమోరియల్ హెల్త్, ఆయూష్ యూనివర్సిటీ, రాయిచూర్ ఛత్తీష్‌ఘడ్, అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్ హిమాలయన్ యూనివర్సిటీల నుంచి ఎంబీబీఎస్, బీబీఏ, ఎంబీఏ నకిలీ ధృవపత్రాలను సంపాదించాడు. మొదట బెంగుళూరులోని సప్తగిరి ఆస్పత్రిలో జూనియర్ డీఎంవోగా పని చేశాడు. అనంతరం ఏఎస్పీ దేవగిరి అంటూ కొన్ని పోలీస్స్టేషన్లలో తనిఖీలు చేసి స్థానికంగా సంచలనం సృష్టించాడు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఎం.ఎన్.రెడ్డి కుమారుడినంటూ అక్కడ పోలీసులను సైతం తప్పుదోవ పట్టించాడు. ఈ మేరకు అక్కడి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం చెప్పాడు. ఈ మేరకు పోలీసులు అతన్ని జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలయ్యాక తన మకాన్ని హైదరాబాద్‌కు మార్చాడు. నగరంలోని అనేక కార్పొరేట్ ఆస్పత్రులలో వైద్యుడిగా కొనసాగాడు. ఫిబ్రవరి వరకు వైద్య శిబిరాలను సైతం నిర్వహించాడు. లాక్డౌన్ మొదలైన తర్వాత పోలీసులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి మందులను అందించాడు. రాచకొండ కోవిడ్ కంట్రోల్ రూమ్‌లో వలంటీర్‌గా చేరి అక్కడ వారికి చికిత్స చేశాడు. కరోనా బారినపడిన సిబ్బందికి సైతం వైద్యం చేశాడు. సీనియర్ పోలీసులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి రాచకొండ పోలీసులకే మస్కా కొట్టాడు. చికిత్స తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలను ఏర్పరచుకున్నాడు. ఓ ముఖ్యమంత్రికి బంధువునంటూ అందరినీ మోసం చేశాడు. రూ. 15 లక్షల రుణం ఎగ్గొట్టాడు. గుంటూరుకు చెందిన జయలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు విడాకులు ఇవ్వకుండానే ఈ ఏడాది జూలైలో డెంటిస్ట్ అమృత సౌందర్యను రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యను కూడా వేధింపులకు గురిచేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అతనికి పోలీసులతో ఉన్న సంబంధాలను ఉపయోగించుకొని ఓ రౌడీషీటర్‌పై ఉన్న రౌడీషీట్‌ను ఎత్తేయిస్తానంటూ రూ. 5 లక్షలు వసూలు చేశాడు. దీనికి తోడు రౌడీషీటర్‌కు చెందిన వాహనానికి ప్రభుత్వ వాహనం అని స్టిక్కర్ వేయించుకొని తిరిగాడు. పోలీసులకు అనుమానమొచ్చి ఆరాతీస్తే అసలు సంగతి బయటపడింది. నకిలీ వైద్యుడిగా చెలామణి అవుతున్న తేజ, ఒంగోలులోని గీతాంజలి కన్సల్టెన్సీ నిర్వాహకుడు బోకూడి శ్రీనివాస్‌రావు(50), తేజ తండ్రి వీరగంధం వెంకటరావులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో సాయపడిన మరో ఆరుగురు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అతని నుంచి 21 రకాల నకిలీ ధ్రువీకరణ పత్రాలు, రూ. 4.70 లక్షలు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. రిజిస్ట్రేషన్ ఫీజు వాపస్ అంటూ మోసం సాక్షి,హైదరాబాద్: ఓ జాబ్ పోర్టల్‌లో కొన్ని రోజుల క్రితం రిజిస్టర్ చేసుకున్న నగరవాసి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించాడు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఉద్యోగం ఇవ్వలేమని, ఫీజు వాపస్ ఇస్తామంటూ ఫోన్ చేసిన నమ్మించిన సైబర్ నేరగాళ్లు రూ. 96 వేలు కాజేశారు. ఇతడితో పాటు వివిధ నేరాల్లో నష్టపోయిన బాధితులు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువకుడు కొన్నాళ్ల క్రితం నౌకరీ.కామ్ సైట్లో తన ప్రొఫైల్ అప్లోడ్ చేశాడు. అప్పట్లో కొంత రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించాడు. ఆపై లాక్‌డౌన్‌తో ఎక్కడి కార్యకలాపాలు అక్కడ ఆగిపోయాయి. రెండు రోజుల క్రితం ఆ సైట్ ప్రతినిధిగా చెప్పుకుంటూ ఓ సైబర్ నేరగాడు ఈ యవకుడికి ఫోన్ చేశాడు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఉద్యోగం ఇప్పించలేమని, రిజిస్ట్రేషన్ ఫీజు వాపస్ ఇస్తామంటూ నమ్మబలికాడు. రీఫండ్ కోసమంటూ ఓ వెబ్‌లింక్ పంపి, అందులో వివరాలు నింపమన్నాడు. నిజమని నమ్మిన బాధితుడు ఆ లింకులో తన బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ తదితరాలు నింపాడు. వీటి సహకారంతో సదరు సైబర్ నేరగాడు బాధితుడి ఖాతా నుంచి రూ. 96 వేలు కాజేశాడు. తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన మరో యువకుడు క్వికర్ సైట్లో ఉద్యోగ ప్రకటన చూశాడు. దానికి ఆకర్షితుడై అందులో పేర్కొన్న నంబర్‌కు సంప్రదించాడు. తనతో పాటు మరికొందరికీ ఉద్యోగం కావాలని చెప్పడంతో సైబర్ నేరగాడు అంగీకరించాడు. ఆపై రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో రూ. 2 లక్షలు వసూలు చేసి మోసం చేశాడు. యూసఫ్‌గూడకు చెందిన వ్యక్తికి పేటీఎం సంస్థ పేరుతో ఫోన్ కాల్ వచ్చింది. దాని కేవైసీ అప్డేట్ చేయాలంటూ సైబర్ నేరగాడు వివరాలు తెలుసుకున్నాడు. వీటి సాయంతో బాధితుడి ఖాతా నుంచి రూ. లక్ష కాజేశాడు. అలాగే అంబర్‌పేటకు చెందిన వ్యక్తికి ఎస్బీఐ బ్యాంకు నుంచి అంటూ కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు కేవైసీ అప్డేట్ పేరు చెప్పి, కార్డు వివరాలు తెలుసుకుని రూ. 80 వేలు కాజేశారు. టోలిచౌకీకి చెందిన వ్యక్తి ఏటీఎం కార్డును క్లోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ఢిల్లీలోని ఏటీఎం కేంద్రం నుంచి రూ. లక్ష డ్రా చేశారు. ఆయా బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మెఫిడ్రోన్ విక్రయం గుట్టురట్టు సాక్షి, హైదరాబాద్: నిషేధిత మాదకద్రవ్యమైన మెఫిడ్రోన్‌ను (ఎండీ) రాజస్థాన్ నుంచి తీసుకువచ్చి సిటీలో విక్రయిస్తున్న ముఠా గుట్టును మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. శుక్రవారం ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి, వారి నుంచి 90 గ్రాముల డ్రగ్ స్వాధీనం చేసుకున్నట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం వెల్లడించారు. రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాకు చెందిన మనోజ్ కుమార్ పన్వార్, మనోహర్ బిష్ణోయ్ స్నేహితులు. వీరిద్దరూ ప్రస్తుతం సిటీలోని వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం వీరిద్దరూ డ్రగ్స్ దందా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. దీన్ని అమలులో పెడుతూ రాజస్థాన్‌లో ఉన్న తమ స్నేహితుడు జలరామ్ను సంప్రదించారు. ఈ దందాకు మనోజ్ సూత్రధారి కాగా... తనకు సహకరిస్తే నెలకు రూ. 20 వేల జీతం ఇస్తానంటూ మనోహర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. రాజస్థాన్ వెళ్లిన మనోజ్ 100 గ్రాములు ఎండీ తీసుకుని నాలుగు రోజుల సిటీకి చేరుకున్నాడు. అక్కడ గ్రాము రూ. 2 వేలకు ఖరీదు చేసి... ఇక్కడ మాదకద్రవ్యాలు వినియోగించే వారికి రూ. 3 వేల నుంచి రూ. 3,500కు విక్రయిస్తున్నారు. వీరు ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు గ్రాముల లెక్కన ఎండీ విక్రయించడానికి తమతో జేబులో ఇమిడిపోయే వేయింగ్ మిషన్ కూడా తీసుకుని వెళ్తున్నారు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల్ జావేద్ నేతృత్వంలో ఎస్ఐలు కె.శ్రీనివాసులు, మహ్మద్ షానవాజ్ షఫీ వలపన్ని ఇద్దరినీ పట్టుకున్నారు. వీరి నుంచి 90 గ్రాముల ఎండీని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం అంబర్‌పేట పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న జల్రామ్ కోసం గాలిస్తున్నారు. -
కేవలం ఇంటర్‌తో.. డాక్టర్ అయ్యాడు!
రాజస్థాన్: ఇంటర్ మాత్రమే చదివిన అతనికి రైలులో ఎంబీబీఎస్ సర్టిఫికేట్ దొరకడంతో...ఏకంగా డాక్టర్‌గా చెప్పుకొని 90,000 మంది రోగులను చికిత్స పేరిట మోసం చేశాడు. 44 ఏళ్ల మన్ సింగ్ బాగెల్ రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన ఓ ఆసుపత్రిలో డాక్టర్‌గా చెప్పుకొంటూ ప్రజలను మోసం చేస్తున్న అతన్ని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కేవలం 12 వ తరగతి వరకు మాత్రమే చదివి, ఆస్పత్రిలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూ నెలకు లక్ష రూపాయల వేతనం పొందుతూ..5 నెలలుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతన్ని పోలీసులు ఆసుపత్రిలో అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో భాగంగా..ఐదేళ్ల క్రితం మధురాలో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా తనకు డాక్టర్ మనోజ్ కుమార్ మెడికల్ డిగ్రీ దొరికిందని బాగెల్ పోలీసులకు చెప్పాడు. దీంతో తాను డిగ్రీ తీసుకోకుండా ఆగ్రాలో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించానని పోలీసులకు చెప్పాడు. బాగెల్ ఆసుపత్రిలో ఇచ్చిన నకిలీ డిగ్రీ కాపీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాగెల్ గత సంవత్సరం సికార్ ఆసుపత్రిలో 'డాక్టర్ కావలెను' అన్న ప్రకటన చూసి, ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంటర్వ్యూకు హాజరయ్యి, ఎంపికయ్యాడు. అతను చేరిన కొన్ని నెలల తర్వాత ఆసుపత్రి అధికారులు బాగెల్ చికిత్స గురించి ఫిర్యాదులు స్వీకరించడం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఒక సందర్భంలో రోగి పరిస్థితి క్షీణించడంతో.. అతన్ని మరో ఆసుపత్రికి పంపవలసి వచ్చింది. బాగెల్‌ను 420 (మోసం), 467 (ఫోర్జరీ ఆఫ్ డాక్యుమెంట్), 468 (మోసం కోసం ఫోర్జరీ) కింద పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలావుండగా.. బాగెల్ ఇద్దరు తమ్ముళ్ళు ఆగ్రాలో మెడికల్ షాపులు నడుపుతున్నారు. -
టెన్త్ చదివి.. స్టెత్ చేతబట్టి!
కర్నూలు(హాస్పిటల్): అతను చదివింది పదో తరగతి. కానీ గర్భిణి కడుపులో ఉన్నది ఆడో మగో చెప్పేస్తాడు. ఆడ అని తేలితే నిర్ధాక్షిణ్యంగా అబార్షన్ చేసేస్తాడు. జిల్లా కేంద్రంలోని తన ఇంట్లోనే స్కానింగ్ మిషన్, ఆపరేషన్ థియేటరు ఏర్పాటు చేసుకొని కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు గాకుండా నడుపుతున్న ఈ తతంగం శనివారం బట్టబయలైంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మారువేషాల్లో పక్కాగా రెక్కీ నిర్వహించి ఇతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కోడుమూరు పట్టణంలోని కొండపేటకు చెందిన రామయ్య కుమారుడు వై.వేణుగోపాల్‌శెట్టి స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత కర్నూలులో ఐదేళ్లపాటు ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేశాడు. కొంత కాలం కిరాణాషాపు నిర్వహించాడు. అనంతరం కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 8 ఏళ్ల పాటు హెల్పర్‌గా పనిచేసి మానేశాడు. ఆ తర్వాత బళ్లారి చౌరస్తాలో కేకేహెచ్ హాస్పిటల్ పక్కన మెడికల్‌షాపు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆర్ఎంపీలతో పరిచయం ఏర్పరుచుకొని ప్రకాష్ నగర్‌లోని ఓ ఇంట్లో పాత స్కానింగ్ మిషన్‌తో అనధికార క్లినిక్ తెరిచాడు. జిల్లా నలుమూలల నుంచి ఆర్ఎంపీలు తీసుకొచ్చే గర్భిణులకు లింగనిర్ధారణ పరీక్షలు చేయడం ప్రారంభించాడు. అందు కు రూ.2,500లు ఫీజు వసూలు చేసి, రూ.1000లు ఆర్ఎంపీకి కమిషన్‌గా ఇస్తున్నాడు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తేలితే భార్యాభర్తల కోరిక మేరకు అదే ఇంట్లో అబార్షన్ కూడా చేసేస్తున్నాడు. మారువేషాలతో రెక్కీ.. లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్ జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రీజినల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శివకోటి బాబురావు ఆదేశాల మేరకు డీసీటీఓ వెంకటరమణ, సీఐ లక్ష్మయ్య, ఎస్ఐ జయన్న, కానిస్టేబుళ్లు శేఖర్‌బాబు, సుబ్బరాయుడు, శివరాముడు మారువేషాలలో ప్రకాష్ నగర్‌లోని వేణుగోపాల్‌శెట్టి క్లినిక్‌పై రెక్కీ నిర్వహించారు. శనివారం లింగనిర్ధారణ పరీక్షల కోసమని వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా వేణుగోపాల్శెట్టిని పట్టుకున్నారు. లింగనిర్ధారణ చేస్తే జైలు అర్హులైన వైద్యులే లింగనిర్ధారణ పరీక్షలు చేయడానికి భయపడుతున్న ఈ రోజుల్లో పదో తరగతి చదివిన వ్యక్తి యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు చేయడం దారుణం. ఎలాంటి భయమూ లేకుండా పాత స్కానింగ్ మిషన్‌తో ఇతను ఈ పరీక్షలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ విషయమై తమ శాఖ పూర్తి స్థాయిలో విచారణ చేయనుంది. అర్హులైన వైద్యులు కూడా లింగనిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరం. అలాంటి వారు తప్పకుండా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. – డాక్టర్ జేవీవీఆర్‌కే ప్రసాద్, డీఎంహెచ్ఓ ఇంట్లోనే ఆపరేషన్ థియేటర్..: డాక్టర్ వై.వేణుగోపాల్శెట్టిగా పేరు మార్చుకున్న ఈ వ్యక్తి.. ఇంట్లో పాత స్కానింగ్ మిషన్‌తో పాటు చిన్న పాటి ఆపరేషన్ థియేటర్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇందుకు అవసరమైన స్పిరిట్, గాజు, కాటన్, గ్లౌజులు, పల్స్ ఆక్సీమీటర్లు, మానిటర్లు, ఆపరేషన్ థియేటర్ లైట్లు, టేబుళ్లతో పాటు యాంటి బయాటిక్స్, పెయిన్ కిల్లర్లు, ప్రొటీన్ పౌడర్లు, మల్టీవిటమిన్ మందులు అతని వద్ద లభ్యమయ్యాయి. కేకేహెచ్ హాస్పిటల్‌కు సంబంధించి వ్యాధి నిర్ధారణ పరీక్షల ప్రిస్కిప్షన్లు, ఆర్ఎంపీలకు రెఫరల్ చీటీలు పెద్ద ఎత్తున కనిపించాయి. అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ మహిళా డాక్టర్ అరెస్ట్
తిరుత్తణి: ప్లస్‌టూ వరకు చదువుకుని క్లినిక్ పెట్టి వైద్య సేవలు అందించిన నకిలీ మహిళ డాక్టర్‌ను ఆరోగ్యశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువళ్లూరు జిల్లాలో విష జ్వరాలు, డెంగీతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విషజ్వరాలు, డెంగీతో బాధపడుతున్న గ్రామీణులకు అవగాహన లేక తమ ప్రాంతంలోని నిర్వహిస్తున్న వైద్య కేంద్రాలకు వెళ్లి చికిత్స పొందడం ద్వారా ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ విషయమై స్థానికుల ఫిర్యాదు మేరకు జిల్లా యంత్రాంగం స్పందించి నకిలీ వైద్యులను గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. తిరుత్తణి సమీపంలోని కేజీ.కండ్రిగలో వారం రోజుల కిందట నకిలీ డాక్టర్‌ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో బుధవారం జిల్లా ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ దయాళన్ ఆధ్వర్యంలో వైద్య బృందం కేజీ.కండ్రిగలో బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షణ్ముగసుందరం పేరిట క్లినిక్ నిర్వహిస్తున్న స్వప్న(32) అనే మహిళను అదుపులో తీసుకుని విచారించగా ప్లస్‌టూ వరకు చదువుకుని క్లినిక్ నిర్వహించి వైద్య సేవలు చేస్తున్నట్లు గుర్తించారు. ఆరోగ్యశాఖ అధికారుల సూచన మేరకు తిరుత్తణి పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఐటీఐ చదివి.. డాక్టర్ అయ్యాడు
గోదావరిఖని: ఐటీఐ చదువుకొని ఆ పై బంగారు నగల దుకాణంలో పనిచేసి అటునుంచి డాక్టర్ అవతారమెత్తాడో ప్రబుద్ధుడు. నేచురోపతి పేరుతో దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తానని అమాయకుల వద్ద నుంచి అందిన కాడికి దోచుకుంటున్న ఓ నకిలీ డాక్టర్ ఆట కట్టించారు పోలీసులు. కరీంనగర్ జిల్లాలోని గోదావరి ఖని మార్కండేయ కాలనీలో నివాసముంటున్న సంపత్‌కుమార్ ఐటీఐ చదువుకున్నాడు. అనంతరం పొట్టకూటి కోసం కాగజ్‌నగర్‌లోని ఓ గోల్డ్ షాపులో కూలీగా పని చేశాడు. అక్కడి నుంచి మెరుగైన జీవనం కోసం హైదరాబాద్ చేరుకొని ఆ పని ఈ పని చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో సులభంగా డబ్బు సంపాధించాలనే కాంక్షతో.. నేచురోపతి నకిలీ సర్టిఫికెట్ సంపాదించి మార్కండేయ కాలనీలో ఆయుర్వేదిక్ క్లినిక్ తెరిచాడు. దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తానని నమ్మించి రోగుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడు. ఇతని వ్యవహారం పై అనుమానం వచ్చిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పక్కా ప్లాన్‌తో క్లినిక్ పై దాడులు నిర్వహించిన పోలీసులు సంపత్‌ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి నకిలీ సర్టిఫికెట్లు, ఓ ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. -
మరో నకిలీ డాక్టర్ అరెస్ట్
పళ్లిపట్టు: డెంగీ సహా వెరైస్ జ్వరాల విజృంభన నేపథ్యంలో నకిలీ డాక్టర్లను ఏరివేసే పనుల్లో జిల్లా వైద్యశాఖ ఉత్సాహం చూపుతున్నది. తిరువళ్లూరు జిల్లాలో గత నెల ప్రబలిన డెంగీ, విష జ్వరాలతో ఇంత వరకు పది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. పైగా వందలాది మంది జ్వరాలతో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో నకిలీ డాక్టర్ల వైద్యంతోనే ప్రజలకు జ్వరం సమస్య పెరగి ప్రాణాలు కోల్పోతున్నట్లు జిల్లా యంత్రాంగం గుర్తించి వెంటనే జిల్లా వ్యాప్తంగా నకిలీ డాక్టర్లను ఏరివేసే పనులను చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుందరవల్లి ఆదేశించారు. దీంతో జిల్లా వైద్యశాఖ అదనపు డెరైక్టర్ మోహన్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం నకిలీ డాక్టర్లను గుర్తించే పనుల్లో నిమగ్నమైయ్యారు. ఇంత వరకు 27 మంది నకిలీ డాక్టర్లను గుర్తించి అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగా మంగళవారం పళ్లిపట్టు నగరి రోడ్డు మార్గంలో క్లీనిక్ నిర్వహించే మురళి(38) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టగా పదో తరగతి వరకు మాత్రమే చదువుకుని మూడేళ్ల నుంచి రోగులకు చికిత్స చేస్తున్నట్లు గుర్తించి చర్యలు చేపట్టారు. మురళిని అదుపులోకి తీసుకుని పళ్లిపట్టు పోలీసులకు అప్పగించారు పోలీసులు కేసు నమోదు చేసి నకిలీ డాక్టర్ మురళిని అరెస్ట్ చేశారు. దీంతో ఇంత వరకు 28 మంది నకిలీ డాక్టర్లు అరెస్ట్ చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. -
విద్యార్థినిపై అత్యాచారం?
నకిలీ డాక్టర్ అరెస్ట్ టీనగర్: మెడికల్ సెంటర్‌కు చికిత్స కోసం వెళ్లిన విద్యార్థినికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారం జరిపిన నకిలీ డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన వాళప్పాడిలో సంచలనం కలిగించింది. సేలం జిల్లా వాళప్పాడి సమీపంలోగల ఓలప్పాడికి చెందిన నవాబ్ (48). ఇతను పెద్దనాయకన్ పాళయంలో నశీం ఫార్మశీ పేరిట మెడికల్ సెంటర్ నడుపుతున్నాడు. ఈ దుకాణం లోపలే రోగులకు వైద్య చికిత్స చేస్తుంటాడు. ఇతని మెడికల్ సెంటర్ సమీపంలో నివశిస్తున్న ప్లస్‌టూ విద్యార్థినికి అనారోగ్యం ఏర్పడడంతో శనివారం రాత్రి నవాబ్ మెడికల్ సెంటర్‌కు వెళ్లింది. ఆ సమయంలో విద్యార్థినికి నవాబ్ ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో కొంత సేపట్లోనే విద్యార్థిని మత్తులోకి జారుకుంది. కొద్దిసేపట్లో మత్తు నుంచి తేరుకున్న విద్యార్థినికి నవాబ్ మందులు ఇచ్చి ఇంటికి పంపించేశాడు. విద్యార్థిని ఇంటికి వెళ్లగానే ఒంట్లో నలతగా ఉన్నట్లు గమనించింది. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిపింది. దీనిపై వారు విచారణ జరపగా విద్యార్థినికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నవాబ్ అత్యాచారం చేసినట్లు తెలిసింది. ఆగ్రహించిన స్థానికులు నవాబ్‌పై దాడి చేశారు. అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు. సెంటర్ బయట వున్న మోటార్ సైకిల్‌కు నిప్పంటించి కాల్చివేశారు. సమాచారం అందుకున్న ఏత్తాప్పూర్ పోలీసులు సంఘటన స్థలం చేరుకుని విచారణ జరిపారు. తర్వాత నవాబ్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. బాధిత విద్యార్థినిని వైద్య పరీక్షల కోసం పంపేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. టెన్త్ వరకు మాత్రమే విద్య నభ్యసించిన నవాబ్ మెడికల్ సెంటర్ నడపడమే కాకుండా మందుల కోసం వచ్చేవారికి చికిత్స అందిస్తాడు. పోలీసులు అతని వద్ద తీవ్ర విచారణ జరుపుతున్నారు. -
పోలీసులకు చిక్కిన నకిలీ డాక్టర్ రమేష్?
నల్లజర్ల రూరల్ : పది రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న నల్లజర్ల వైబీ ఆసుపత్రి నకిలీ డాక్టర్ జువ్వల రమేష్ శనివారం ఏలూరులో పోలీసులకు చిక్కినట్టు సమాచారం. శుక్రవారం సీహెచ్.పోతేపల్లిలో ప్రత్యక్షమై పోలీసులకు చిక్కినట్టే చిక్కి మాయమయ్యాడు. అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు చివరకు ఏలూరులో చిక్కినట్టు తెలుస్తోంది. ఎటువంటి వైద్యానుభవం లేకున్నా మెడికల్ రిప్రెజెంటివ్‌గా పనిచేసిన అనుభవంతో వైబీ హాస్పటల్, జీ.వి.సాగర్, ఎమ్మెస్ జనరల్ పేరుతో మూడేళ్లుగా రమేష్ అనే వ్యక్తి నల్లజర్లలో ఆసుపత్రి నడుపుచున్నాడు. ఆసుపత్రిలో పనిచేసే నర్సు మృతికి కారణమైన అతడిపై కేసు నమోదవడంతో నకిలీ డాక్టర్ గుట్టు రట్టైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సీహెచ్ పోతేపల్లి నుంచి పరారైన అతడు ఏలూరు పోలీసులకు చిక్కాడని తెలిసింది.