ఐదు చదివిన ‘డాక్టర్’.. అరెస్ట్ | Police Arrest Fifth Class Dropout Fake Doctor In Hyderabad | Sakshi
Sakshi News home page

ఐదు చదివిన ‘డాక్టర్’.. అరెస్ట్

Published Sat, Sep 12 2020 9:10 AM | Last Updated on Sat, Sep 12 2020 9:18 AM

Police Arrest Fifth Class Dropout Fake Doctor In Hyderabad - Sakshi

సాక్షి, మేడిపల్లి: డాక్టర్‌నంటూ నమ్మబలికాడు.. మంచి డాక్టర్‌గా అందరి ముందు నటించాడు.. అందరితోనూ ప్రశంసలూ పొందాడు.. రాచకొండ పోలీసులకే చికిత్స చేసి భేష్‌ అనిపించుకున్నాడు.. తీరా అతని గుట్టు రట్టు అయ్యే సరికి అందరూ నివ్వెరపోయారు. ఈ సంఘటన రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో తీవ్ర సంచలనం రేపింది. మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం బొడ్డువారిపాలెం గ్రామానికి చెందిన వెంకట్‌రావు కుమారుడు తేజ అలియాస్‌ తేజారెడ్డి అలియాస్‌ అవినాష్‌ రెడ్డి అలియాస్‌ వీరగంధం తేజ(23) నగరంలోని బోడుప్పల్‌ వెస్ట్‌ బాలాజీ హిల్స్‌లో నివాసం ఉంటున్నాడు. 5వ తరగతితోనే చదువు ఆపేశాడు. తండ్రి వీరగంధం వెంకట్రావ్, మిత్రుడు శ్రీనివాస్‌రావు సహకారంతో తేజ పేరుతో నకిలీ గుర్తింపు కార్డులను సంపాదించాడు.

అంతేకాకుండా టెన్త్, ఇంటర్‌ ఉత్తీర్ణత పత్రాలను సాధించాడు. భారతీయ శిక్షా పరిషత్‌ లక్నో, ఉత్తర్‌ప్రదేశ్‌ పండిత్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ్‌ మెమోరియల్‌ హెల్త్, ఆయూష్‌ యూనివర్సిటీ, రాయిచూర్‌ ఛత్తీష్‌ఘడ్, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఈటానగర్‌ హిమాలయన్‌ యూనివర్సిటీల నుంచి ఎంబీబీఎస్, బీబీఏ, ఎంబీఏ నకిలీ ధృవపత్రాలను సంపాదించాడు. మొదట బెంగుళూరులోని సప్తగిరి ఆస్పత్రిలో జూనియర్‌ డీఎంవోగా పని చేశాడు. అనంతరం ఏఎస్పీ దేవగిరి అంటూ కొన్ని పోలీస్‌స్టేషన్‌లలో తనిఖీలు చేసి స్థానికంగా సంచలనం సృష్టించాడు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఎం.ఎన్‌.రెడ్డి కుమారుడినంటూ అక్కడ పోలీసులను సైతం తప్పుదోవ పట్టించాడు. ఈ మేరకు అక్కడి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం చెప్పాడు.

ఈ మేరకు పోలీసులు అతన్ని జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలయ్యాక తన మకాన్ని హైదరాబాద్‌కు మార్చాడు. నగరంలోని అనేక కార్పొరేట్‌ ఆస్పత్రులలో వైద్యుడిగా కొనసాగాడు. ఫిబ్రవరి వరకు వైద్య శిబిరాలను సైతం నిర్వహించాడు. లాక్‌డౌన్‌ మొదలైన తర్వాత పోలీసులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి మందులను అందించాడు. రాచకొండ కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌లో వలంటీర్‌గా చేరి అక్కడ వారికి చికిత్స చేశాడు. కరోనా బారినపడిన సిబ్బందికి సైతం వైద్యం చేశాడు. సీనియర్‌ పోలీసులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి రాచకొండ పోలీసులకే మస్కా కొట్టాడు. చికిత్స తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలను ఏర్పరచుకున్నాడు. ఓ ముఖ్యమంత్రికి బంధువునంటూ అందరినీ మోసం చేశాడు. రూ. 15 లక్షల రుణం ఎగ్గొట్టాడు. గుంటూరుకు చెందిన జయలక్ష్మిని వివాహం చేసుకున్నాడు.

ఆమెకు విడాకులు ఇవ్వకుండానే ఈ ఏడాది జూలైలో డెంటిస్ట్‌ అమృత సౌందర్యను రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యను కూడా వేధింపులకు గురిచేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అతనికి పోలీసులతో ఉన్న సంబంధాలను ఉపయోగించుకొని ఓ రౌడీషీటర్‌పై ఉన్న రౌడీషీట్‌ను ఎత్తేయిస్తానంటూ రూ. 5 లక్షలు వసూలు చేశాడు. దీనికి తోడు రౌడీషీటర్‌కు చెందిన వాహనానికి ప్రభుత్వ వాహనం అని స్టిక్కర్‌ వేయించుకొని తిరిగాడు. పోలీసులకు అనుమానమొచ్చి ఆరాతీస్తే అసలు సంగతి బయటపడింది. నకిలీ వైద్యుడిగా చెలామణి అవుతున్న తేజ, ఒంగోలులోని గీతాంజలి కన్సల్టెన్సీ నిర్వాహకుడు బోకూడి శ్రీనివాస్‌రావు(50), తేజ తండ్రి వీరగంధం వెంకటరావులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో సాయపడిన మరో ఆరుగురు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అతని నుంచి 21 రకాల నకిలీ ధ్రువీకరణ పత్రాలు, రూ. 4.70 లక్షలు, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. 

రిజిస్ట్రేషన్‌ ఫీజు వాపస్‌ అంటూ మోసం 
సాక్షి,హైదరాబాద్‌: ఓ జాబ్‌ పోర్టల్‌లో కొన్ని రోజుల క్రితం రిజిస్టర్‌ చేసుకున్న నగరవాసి రిజిస్ట్రేషన్‌ ఫీజు కూడా చెల్లించాడు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఉద్యోగం ఇవ్వలేమని, ఫీజు వాపస్‌ ఇస్తామంటూ ఫోన్‌ చేసిన నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు రూ. 96 వేలు కాజేశారు. ఇతడితో పాటు వివిధ నేరాల్లో నష్టపోయిన బాధితులు శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువకుడు కొన్నాళ్ల క్రితం నౌకరీ.కామ్‌ సైట్‌లో తన ప్రొఫైల్‌ అప్‌లోడ్‌ చేశాడు. అప్పట్లో కొంత రిజిస్ట్రేషన్‌ ఫీజు కూడా చెల్లించాడు. ఆపై లాక్‌డౌన్‌తో ఎక్కడి కార్యకలాపాలు అక్కడ ఆగిపోయాయి. రెండు రోజుల క్రితం ఆ సైట్‌ ప్రతినిధిగా చెప్పుకుంటూ ఓ సైబర్‌ నేరగాడు ఈ యవకుడికి ఫోన్‌ చేశాడు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఉద్యోగం ఇప్పించలేమని, రిజిస్ట్రేషన్‌ ఫీజు వాపస్‌ ఇస్తామంటూ నమ్మబలికాడు. రీఫండ్‌ కోసమంటూ ఓ వెబ్‌లింక్‌ పంపి, అందులో వివరాలు నింపమన్నాడు. నిజమని నమ్మిన బాధితుడు ఆ లింకులో తన బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ తదితరాలు నింపాడు.

వీటి సహకారంతో సదరు సైబర్‌ నేరగాడు బాధితుడి ఖాతా నుంచి రూ. 96 వేలు కాజేశాడు. తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన మరో యువకుడు క్వికర్‌ సైట్‌లో ఉద్యోగ ప్రకటన చూశాడు. దానికి ఆకర్షితుడై అందులో పేర్కొన్న నంబర్‌కు సంప్రదించాడు. తనతో పాటు మరికొందరికీ ఉద్యోగం కావాలని చెప్పడంతో సైబర్‌ నేరగాడు అంగీకరించాడు. ఆపై రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్‌ ఫీజుల పేరుతో రూ. 2 లక్షలు వసూలు చేసి మోసం చేశాడు. యూసఫ్‌గూడకు చెందిన వ్యక్తికి పేటీఎం సంస్థ పేరుతో ఫోన్‌ కాల్‌ వచ్చింది. దాని కేవైసీ అప్‌డేట్‌ చేయాలంటూ సైబర్‌ నేరగాడు వివరాలు తెలుసుకున్నాడు. వీటి సాయంతో బాధితుడి ఖాతా నుంచి రూ. లక్ష కాజేశాడు. అలాగే అంబర్‌పేటకు చెందిన వ్యక్తికి ఎస్‌బీఐ బ్యాంకు నుంచి అంటూ కాల్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు కేవైసీ అప్‌డేట్‌ పేరు చెప్పి, కార్డు వివరాలు తెలుసుకుని రూ. 80 వేలు కాజేశారు. టోలిచౌకీకి చెందిన వ్యక్తి ఏటీఎం కార్డును క్లోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు ఢిల్లీలోని ఏటీఎం కేంద్రం నుంచి రూ. లక్ష డ్రా చేశారు. ఆయా బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.  

మెఫిడ్రోన్‌ విక్రయం గుట్టురట్టు 
సాక్షి, హైదరాబాద్‌: నిషేధిత మాదకద్రవ్యమైన మెఫిడ్రోన్‌ను (ఎండీ) రాజస్థాన్‌ నుంచి తీసుకువచ్చి సిటీలో విక్రయిస్తున్న ముఠా గుట్టును మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. శుక్రవారం ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి, వారి నుంచి 90 గ్రాముల డ్రగ్‌ స్వాధీనం చేసుకున్నట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం వెల్లడించారు. రాజస్థాన్‌లోని జాలోర్‌ జిల్లాకు చెందిన మనోజ్‌ కుమార్‌ పన్వార్, మనోహర్‌ బిష్ణోయ్‌ స్నేహితులు. వీరిద్దరూ ప్రస్తుతం సిటీలోని వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం వీరిద్దరూ డ్రగ్స్‌ దందా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. దీన్ని అమలులో పెడుతూ రాజస్థాన్‌లో ఉన్న తమ స్నేహితుడు జలరామ్‌ను సంప్రదించారు. ఈ దందాకు మనోజ్‌ సూత్రధారి కాగా... తనకు సహకరిస్తే నెలకు రూ. 20 వేల జీతం ఇస్తానంటూ మనోహర్‌తో ఒప్పందం చేసుకున్నాడు.

రాజస్థాన్‌ వెళ్లిన మనోజ్‌ 100 గ్రాములు ఎండీ తీసుకుని నాలుగు రోజుల సిటీకి చేరుకున్నాడు. అక్కడ గ్రాము రూ. 2 వేలకు ఖరీదు చేసి... ఇక్కడ మాదకద్రవ్యాలు వినియోగించే వారికి రూ. 3 వేల నుంచి రూ. 3,500కు విక్రయిస్తున్నారు. వీరు ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు గ్రాముల లెక్కన ఎండీ విక్రయించడానికి తమతో జేబులో ఇమిడిపోయే వేయింగ్‌ మిషన్‌ కూడా తీసుకుని వెళ్తున్నారు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ జావేద్‌ నేతృత్వంలో ఎస్‌ఐలు కె.శ్రీనివాసులు, మహ్మద్‌ షానవాజ్‌ షఫీ వలపన్ని ఇద్దరినీ పట్టుకున్నారు. వీరి నుంచి 90 గ్రాముల ఎండీని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం అంబర్‌పేట పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న జల్‌రామ్‌ కోసం గాలిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement