కర్నూలు(హాస్పిటల్): అతను చదివింది పదో తరగతి. కానీ గర్భిణి కడుపులో ఉన్నది ఆడో మగో చెప్పేస్తాడు. ఆడ అని తేలితే నిర్ధాక్షిణ్యంగా అబార్షన్ చేసేస్తాడు. జిల్లా కేంద్రంలోని తన ఇంట్లోనే స్కానింగ్ మిషన్, ఆపరేషన్ థియేటరు ఏర్పాటు చేసుకొని కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు గాకుండా నడుపుతున్న ఈ తతంగం శనివారం బట్టబయలైంది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మారువేషాల్లో పక్కాగా రెక్కీ నిర్వహించి ఇతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కోడుమూరు పట్టణంలోని కొండపేటకు చెందిన రామయ్య కుమారుడు వై.వేణుగోపాల్‌శెట్టి స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత కర్నూలులో ఐదేళ్లపాటు ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేశాడు. కొంత కాలం కిరాణాషాపు నిర్వహించాడు. అనంతరం కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 8 ఏళ్ల పాటు హెల్పర్‌గా పనిచేసి మానేశాడు. ఆ తర్వాత బళ్లారి చౌరస్తాలో కేకేహెచ్ హాస్పిటల్ పక్కన మెడికల్‌షాపు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆర్‌ఎంపీలతో పరిచయం ఏర్పరుచుకొని ప్రకాష్ నగర్‌లోని ఓ ఇంట్లో పాత స్కానింగ్ మిషన్‌తో అనధికార క్లినిక్ తెరిచాడు. జిల్లా నలుమూలల నుంచి ఆర్‌ఎంపీలు తీసుకొచ్చే గర్భిణులకు లింగనిర్ధారణ పరీక్షలు చేయడం ప్రారంభించాడు. అందు కు రూ.2,500లు ఫీజు వసూలు చేసి, రూ.1000లు ఆర్‌ఎంపీకి కమిషన్‌గా ఇస్తున్నాడు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తేలితే భార్యాభర్తల కోరిక మేరకు అదే ఇంట్లో అబార్షన్ కూడా చేసేస్తున్నాడు.
మారువేషాలతో రెక్కీ..
లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్ జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రీజినల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ శివకోటి బాబురావు ఆదేశాల మేరకు డీసీటీఓ వెంకటరమణ, సీఐ లక్ష్మయ్య, ఎస్‌ఐ జయన్న, కానిస్టేబుళ్లు శేఖర్‌బాబు, సుబ్బరాయుడు, శివరాముడు మారువేషాలలో ప్రకాష్ నగర్‌లోని వేణుగోపాల్‌శెట్టి క్లినిక్‌పై రెక్కీ నిర్వహించారు. శనివారం లింగనిర్ధారణ పరీక్షల కోసమని వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా వేణుగోపాల్‌శెట్టిని పట్టుకున్నారు.
లింగనిర్ధారణ చేస్తే జైలు
అర్హులైన వైద్యులే లింగనిర్ధారణ పరీక్షలు చేయడానికి భయపడుతున్న ఈ రోజుల్లో పదో తరగతి చదివిన వ్యక్తి యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు చేయడం దారుణం. ఎలాంటి భయమూ లేకుండా పాత స్కానింగ్ మిషన్‌తో ఇతను ఈ పరీక్షలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ విషయమై తమ శాఖ పూర్తి స్థాయిలో విచారణ చేయనుంది. అర్హులైన వైద్యులు కూడా లింగనిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరం. అలాంటి వారు తప్పకుండా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
– డాక్టర్ జేవీవీఆర్‌కే ప్రసాద్, డీఎంహెచ్‌ఓ
ఇంట్లోనే ఆపరేషన్ థియేటర్..: డాక్టర్ వై.వేణుగోపాల్‌శెట్టిగా పేరు మార్చుకున్న ఈ వ్యక్తి.. ఇంట్లో పాత స్కానింగ్ మిషన్‌తో పాటు చిన్న పాటి ఆపరేషన్ థియేటర్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇందుకు అవసరమైన స్పిరిట్, గాజు, కాటన్, గ్లౌజులు, పల్స్ ఆక్సీమీటర్లు, మానిటర్లు, ఆపరేషన్ థియేటర్ లైట్లు, టేబుళ్లతో పాటు యాంటి బయాటిక్స్, పెయిన్ కిల్లర్లు, ప్రొటీన్ పౌడర్లు, మల్టీవిటమిన్ మందులు అతని వద్ద లభ్యమయ్యాయి. కేకేహెచ్ హాస్పిటల్‌కు సంబంధించి వ్యాధి నిర్ధారణ పరీక్షల ప్రిస్కిప్షన్లు, ఆర్‌ఎంపీలకు రెఫరల్ చీటీలు పెద్ద ఎత్తున కనిపించాయి. అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment