పురుడు పోసుకుంది!
పురుడు పోసుకుంది!
Published Mon, Feb 17 2014 3:17 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
అనగనగా ఓ ఊరు.. దాని పేరు వంగర.. అక్కడో ఆరోగ్య కేంద్రం ఉంది. చుట్టుపక్కల పల్లెలకు అదే ఆధారం. అయితే చిన్నాచితకా జ్వరాలకే తప్ప పురుడు పోసుకునేందుకు ఆ ప్రాంత ప్రజలు ఆ ఆస్పత్రి గడప తొక్కేవారు కాదు. 12 ఏళ్లుగా ఇదే పరిస్థితి. కారణం.. ఆ ఆస్పత్రికి దెయ్యం పట్టిందట!.. అక్కడ పుట్టే బిడ్డలను అది చంపేస్తుందట!!.. అదేం చిత్రమో.. ఇంకే ఆధారం లేకపోయినా.. దూరాభారం వెళ్లలేక గర్భిణులు, శిశువులు అసువులు బాస్తున్నా సరే.. దెయ్యం పట్టిన ఆస్పత్రికి రామంటే.. రామని.. బిగదీసుకున్నారు అమాయక పల్లెవాసులు. దాదాపు ఏడాదిన్నర క్రితం వరకు ఇదే దుస్థితి. క్రమంగా పరిస్థితి మారింది. చైతన్యం పురుడు పోసుకుంది. పండంటి బిడ్డలకు జన్మనిస్తూ పీహెచ్‌సీ తెగ మురిసిపోతోంది.వంగర, న్యూస్‌లైన్:.. ఆరోగ్యకరమైన ఈ మార్పునకు ప్రధాన కారకుడు పీహెచ్‌సీ వైద్యాధికారి సీతారాం. 2012 జూలై 25న ఇక్కడ బాధ్యతలు చేపట్టిన ఆయన పీహెచ్‌సీ దుస్థితి చూసి విషయమేంటని ఆరా తీశారు. ఆర్థిక, రవాణా సమస్యలతో పట్టణ ప్రాంతాలకు వెళ్లలేక ఎంతో మంది గర్భిణులు, శిశువులు మరణిస్తున్నా సరే.. ఈ పీహెచ్‌సీ సేవలు మాత్రం మాకొద్దు బాబోయ్ అంటూ ప్రజలు హడలిపోవడానికి కారణాలు క నుగొన్నారు. అప్పుడు అసలు విషయం తెలిసింది.
సమస్యలే అసలు దెయ్యాలు
మండల కేంద్రమైన వంగరతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు వైద్య సేవలు కల్పించేందుకు 2000 సంవత్సరంలో ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయి స్థలం లభించకపోవడంతో ఈ భవనాన్ని గ్రామానికి ఆనుకొని ఉన్న కొండపై నిర్మించారు. దానికి ఆనుకొనే శ్మశాన వాటిక ఉంది. కాగా పీహెచ్‌సీకి రావడానికి కూడా అప్పట్లో సరైన రవాణా సౌకర్యం ఉండేది కాదు. అతి కష్టం మీద గర్భిణులను తీసుకొచ్చినా.. సకాలంలో వైద్యం అందించి, పురుడు పోయించడానికి వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేవారు కాదు. ఇదే కారణంతో పీహెచ్‌సీ ఏర్పాటైన కొత్తలోనే ఓ మహిళ ప్రసవించిన వెంటనే మరణించింది. తర్వాత కొద్దిసేపటికే శిశువు కూడా మృతి చెందింది. అంతే.. అప్పటి నుంచి ఆస్పత్రిలో దెయ్యం ఉందని.. అదే తల్లీబిడ్డలను కబళించిందని ఆమె బంధువులు అపోహ పడ్డారు. అదే ఆ నోటా ఈ నోటా చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ పాకింది. ఆ భయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అప్పటి నుంచి ప్రసవాలకు ఈ ఆస్పత్రికి రావడం మానుకున్నారు. దాంతో దాదాపు 12 ఏళ్లు అక్కడ ప్రసవాలే జరగలేదు.
గాయపడిన మనసులకు చికిత్స
బలంగా నాటుకుపోయిన మూఢ విశ్వాసంతో గాయపడిన ప్రజల మనసులకు ముందు చికిత్స చేస్తే తప్ప పరిస్థితి మారదని, ఆస్పత్రి ప్రసవాలకు అవకాశం ఉండదని గుర్తించిన డాక్టర్ సీతారాం ఆ దిశగా కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. మొదట తమ సిబ్బందితోనే ప్రారంభించారు. పీహెచ్‌సీలో పనిచేసే వారితోపాటు గ్రామాల్లో తిరిగే ఏఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందిని పలుమార్లు సమావేశపరిచి మాట్లాడారు. ఎంత నచ్చజెప్పినా ప్రజలనుంచి దెయ్యం భయాన్ని తొలగించలేకపోతున్నామని వారు చెప్పారు. దాంతో ఆయన నేరుగా గ్రామాల్లోకే వెళ్లడం ప్రారంభించారు. సిబ్బంది సహాయంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. పల్లెకుపోదాం, గ్రామదర్శిని, గ్రామ సభలు, టీకా, పల్స్ పోలియో కార్యక్రమాలను కూడా ఇందుకు ఉపయోగించుకున్నారు. ఏ చిన్న సందర్భం వచ్చినా ఆస్పత్రి ప్రసవాలపై చైతన్యం కలిగించేందుకు వినియోగించుకున్నారు. ఆస్పత్రిలో దెయ్యం లేదని, అదంతా అపోహ, భయమేనని స్పష్టం చేస్తూ గర్భిణులను తీసుకురండి.. ప్రసవం చేయించి.. సురక్షితంగా పంపించే పూచీ నాదని’ భరోసా ఇస్తూ.. మెల్లగా వారి మనసుల్లో గూడు కట్టుకున్న భ యాన్ని తొలగించారు.
స్వల్ప కాలంలోనే ఎంతో మార్పు
అంతే మార్పు మొదలైంది. గత ఏడాది మే నెల నుంచి గర్భిణులు పీహెచ్‌సీ తలుపు తట్టడం ప్రారంభించారు. మొదట్లో ఒకరిద్దరే రాగా.. వారికి సుఖప్రసవం చేయించి తల్లీబిడ్డలను సురక్షితంగా ఇళ్లకు పంపించడంతో ప్రజల్లో నమ్మకం పెరిగింది. మారుమూల గ్రామాల నుంచి గర్భిణులు రావడం క్రమంగా పెరిగింది. పీహెచ్‌సీలో ప్రసవాలు సంఖ్యా గణనీయంగా పెరిగింది. గత పుష్కర కాలంలో ఒక్క కాన్పు కూడా జరగని ఈ పీహెచ్‌సీలో గత ఏడాది మే నుంచి డిసెంబర్ వరకు ఏడు నెలల్లోనే 70 మంది గర్భిణులు ఇక్కడ పురుడు పోసుకొని పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు.
పీహెచ్‌సీ కళకళ
అప్పుడే ఈ లోకంలోకి అడుగుపెట్టిన బిడ్డల కేరింతలు.. తల్లిదండ్రుల ఆనందోత్సాహాలతో ఆరోగ్య కేంద్రం కొత్త కళ సంతరించుకుంది. గత ఏడాది వరకు ఇక్కడి ప్రసవాల గది పట్లు పట్టి దుమ్మూధూళి, చెత్తాచెదారాలతో నిండి ఉండేది. ఇప్పుడు వాటి స్థానంలో వైద్య పరికరాలు బెడ్లు తళతళలాడుతూ కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి అందిన వివిధ పథకాల నిధులతో అవసరమైన పరికరాలు దశలవారీగా కొనుగోలు చేశారు. పుట్టిన శిశువుల ఆరోగ్య పరిరక్షణకు వార్మర్ సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. తల్లీబిడ్డలకు అవసరమైన అన్ని రకాల మందులు ఉన్నాయి.
Advertisement
Advertisement