24 కాదు 12 గంటలే..
పవర్ హాలిడే కోతలో సగం కుదింపు
పరిశ్రమలకు స్వల్ప ఊరట
నేటి నుంచి అమల్లోకి..
సాక్షి,సిటీబ్యూరో: చిన్నతరహా, భారీపరిశ్రమల నిర్వాహకులకు శుభవార్త. ఇప్పటివరకు వారంలో ఒకరోజు పూర్తిగా పవర్హాలిడే(24 గంటల విద్యుత్తుకోత) విధిస్తుండగా దాన్ని 12గంటలకు కుదించారు. ఈమేరకు డిస్కం నిర్ణయం తీసుకుంది. ఇది గురువారం (నేటినుంచి) నుంచి అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. దీంతో విద్యుత్తుకోతల నుంచి పరిశ్రమలకు స్వల్పఊరట లభించనుంది.
పవర్హాలిడే పేరుతో ఇప్పటివరకు వారానికి ఒకరోజు వేతనాన్ని కోల్పోయిన కార్మికులు, ఆశించినస్థాయిలో ఉత్పత్తిలేక నష్టాలను చవిచూసిన యజమానులకు ఈ నిర్ణయం లబ్ధి చేకూర్చనుంది. ఇటీవల వ్యవ సాయానికి కరెంటు వినియోగం తగ్గడంతో ఈ మిగులు విద్యుత్తును నగరంలోని పరిశ్రమలు, గృహాలకు మళ్లిస్తున్నారు.
ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని కొన్ని ఏరియాల్లోని గృహాలకు అధికారిక కోతలు ఎత్తేసి పూర్తిస్థాయిలో కరెంటును సరఫరా చేస్తున్నారు. అసలే ఎండలు మండిపోతుండడం, కొన్నిప్రాంతాల్లో అనధికారికంగా కోత విధిస్తుండడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమలకు మాత్రం కరెంటు కోత తగ్గించడం హర్షనీయమని పరిశ్రమల యజమానులు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో కోత తీసివేస్తే పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుతుందని వారు అన్నారు.