కోలీ ఉరితీతకు తలారి సిద్ధం
మీరట్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారి వరుస హత్యల కేసు దోషి సురిందర్ కోలీని మీరట్ జైల్లో ఈ నెల 12న ఉరితీయనున్న జైలు తలారి పవన్‌సింగ్ (ఆయనకు ఇదే తొలి ఉరితీత అవకాశం) ప్రస్తుతం వార్తల్లోని వ్యక్తిగా నిలిచాడు. ఉరితీతపై సింగ్ అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు మీరట్‌లోని ఆయన ఇంటి వద్ద రోజూ నిరీక్షిస్తున్నారు. అయితే సింగ్ కుటుంబానికి ఇదేమీ కొత్త కాదు. ఎందుకంటే.. ఆయన తలారీల కుటుంబం నుంచే వచ్చాడు. ఆయన తాత కల్లూ 1982లో రేప్, కిడ్నాపర్ల ద్వయం రంగా, బిల్లాలను ఉరి తీశాడు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో దోషులైన కేహార్, సత్వంత్సింగ్లనూ ఉరితీశాడు.
మొత్తంమీద 12 మంది దోషులను ఆయన ఉరితీశాడు. పవన్ తండ్రి మమ్మూ కూడా మీరట్ జైల్లో తలారిగా పనిచేసినా తన సర్వీసు కాలంలో ఒక్కరిని కూడా ఉరితీయలేదు. ముంబై దాడుల ఉగ్రవాది కసబ్, పార్లమెంటు దాడి దోషి అఫ్జల్ గురును ఉరితీసేందుకు ఉరితాళ్లను తయారు చేసినా అనారోగ్యంతో వారిని ఉరితీసేలోపే మరణించాడు. తండ్రి ఉరితీయాల్సిన వారిద్దరినీ ఉరితీద్దామని పవన్ భావించినా ఆ ఉరిశిక్షల అమలును గోప్యంగా నిర్వహించడంతో ఆ అవకాశం లభించలేదు. అయితే సురిందర్ కోలీని మీరట్ జైల్లో ఉరి తీయాలని కోర్టు ఆదేశించడంతో తొలిసారిగా ఉరితీత అమలుకు సింగ్ సిద్ధమవుతున్నాడు.