meesala Geeta
-
టీడీపీ రెండు ముక్కలైంది..
జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ రెండు ముక్కలైంది. ఎప్పటినుంచో అంతర్గతంగా ఉన్న విభేదాలు మరోసారి వెలుగు చూశాయి. తరతరాల రాచరిక పెత్తనానికి చరమగీతం పాడుతూ మహిళా నేత తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. విజయనగరంలో కొత్తగా టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇన్నాళ్లుగా రాజుగారి బంగ్లాలోనే పెద్దాయన కనుసన్నల్లో సాగుతున్న పార్టీ కార్యకలాపాలకు చెక్‌పెట్టారు. సాక్షి, విజయనగరం: జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గడ్డు పరిస్థితులు మొదలై చాలా కాలమైంది. 2019 ఎన్నికల ముందు ఆ పార్టీకి జిల్లాలో ఏడుగురు శాసన సభ్యులుండేవారు. వీరిలో బొబ్బిలి రాజు రాష్ట్ర మంత్రిగా ఉండగా, కేంద్ర మంత్రిగా అశోక్‌గజపతిరాజు కొనసాగారు. అప్పుడు మహంతి చిన్నంనాయుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసే వారు. జిల్లాకే కాదు రాష్ట్ర టీడీపీకి కూడా అశోక్ గజపతే పెద్దదిక్కుగా భావించేవారు. జిల్లా పార్టీ మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడిచేది. ఆయన మాత్రం జిల్లాలో ఏ కార్యక్రమాన్ని నిర్వహించేవారు కాదు. పార్టీ కార్యక్రమాలకు కూడా వచ్చే వారు కాదు. పూర్తిగా ఢిల్లీ లేదా బంగ్లాకు పరిమితమైపోయేవారు. అదే సమయంలో ఆయన కుమార్తె అదితి గజపతి రంగంలోకి దిగారు. విజయనగరంలో ఏర్పాటైన కొత్త కార్యాలయం పార్టీ కేడర్‌కు అడపాదడపా దర్శనమిస్తూ, అప్పుడప్పుడు కార్యక్రమాల్లో మెరిసేవారు. అప్పుడు విజ యనగరం ఎమ్మెల్యేగా మీసాల గీత ఉన్నారు. పేరుకి ఆమె ఎమ్మెల్యేగానీ, నియోజకవర్గంలో ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా చేయాలని అశోక్, అదితి ప్రయత్నించారు. అదే సమయంలో విశాఖపట్నానికి చెందిన అప్పటి రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుకు జిల్లాను చక్కబెట్టే బాధ్య తలు అప్పగించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అప్పుడే అశోక్ పతనం అధికారికంగా మొదలైందని చెప్పవచ్చు. గంటా ప్రవేశంతో పార్టీలో ముసలం జిల్లాలో గంటా శ్రీనివాసరావు పెత్తనం మొదలైన తరువాత మీసాలగీత, గజపతినగరం అప్పటి ఎమ్మెల్యే కె.ఎ.నాయు డు వంటి వారు గంటా పంచన చేరారు. వీరంతా ఒక వర్గంగా ఏర్పడ్డారు. ఈ విషయాన్ని అధినేత వద్ద చూపించుకుని గత ఎన్నికల్లో మీసాల గీతకు పార్టీ టిక్కెట్టు రాకుండా చేశా రు అశోక్. ఆమె స్థానంలో తన కుమార్తె అదితి గజపతిని పార్టీ తరఫున ఎన్నికల బరిలో దింపారు. బీసీ మహిళకు వెన్నుపోటు పొడిచి తెచ్చుకున్న టిక్కెట్టుతో వైఎస్సార్సీపీ ప్రభంజనం ముందు నిలవలేక, కుమార్తెను గెలిపించుకోలేక, ఎంపీగా తానూ విజయం సాధించలేక ఘోర పరాజ యం పాలయ్యారు. అంతే కాదు అశోక్ పెద్దదిక్కుగా ఉన్న జిల్లాలో టీడీపీకి ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా రాకుండా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అయినా దానికి ఆయన ఏమాత్రం బాధపడలేదు. నైతిక బాధ్యత వహించి పార్టీ నుంచి తప్పుకోలేదు. పైపెచ్చు ఇటీవల జరిగిన పార్టీ నియామకాల్లో తన కుమార్తె అదితి గజపతికి విజయనగరం నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు ఇప్పించుకున్నారు. రాచరిక పెత్తనానికి చరమ‘గీతం’ జిల్లా టీడీపీ సమావేశాలు, పత్రికా సమావేశాలను అశోక్ గజపతి బంగ్లా ఆవరణలోని చెట్టుకిందే నిర్వహించడమేది ఎప్పటి నుంచో కొనసాగుతోంది. కానీ ఈ సమావేశాలకు గానీ, పార్టీ కార్యక్రమాలకు గానీ తనకు ఎలాంటి సమాచా రం లేకపోవడంతో, ఎన్నికల ముందు నుంచీ జరుగుతున్న పరిణామాలకు మనస్తాపంతో ఉన్న మీసాలగీత టీడీపీకి మరో కార్యాలయం అవసరమనే నిర్ణయానికి వచ్చారు. ఆమెకు మొదటి నుంచీ తోడుగా ఉన్న కె.ఎ.నాయుడు, మరికొంత మంది జిల్లా నేతలు మద్దతు పలికారు. అంతే విజయనగరంలో కె.ఎ.నాయుడుకు చెందిన భవనంలోనే కొత్త కార్యాలయాన్ని బుధవారం తెరిచారు. ఊహించని ఈ హఠా త్ పరిణామానికి అశోక్ గజపతి షాక్‌కు గురయ్యారు. టీడీపీ ని అస్థిరపరచాలనే ఉద్దేశంతో అధికారపార్టీ నేతలే మీసాల గీతతో వేరు కుంపటి పెట్టించారని ఆయన ఆరోపించారు. కానీ గీత మాత్రం తరతరాల రాచరిక పెత్తనానికి చరమగీతం పాడేందుకే తాను పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించానని చెబుతున్నారు. వ్యూహం పెద్దదే... అశోక్‌కుగానీ, విజయనగరం నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న అదితి జగపతికి గానీ, విజయనగరం పార్లమెంటరీ జిల్లా ఇన్చార్జ్గా ఇటీవలే నియమితులైన కిమిడి నాగార్జునకుగానీ చెప్పకుండా, వారిని ఆహ్వానించకుండా స్వతంత్రంగా నిర్ణ యం తీసుకుని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారంటే దీనివెనుక భారీ వ్యూహాలే ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నా యి. మరోవైపు ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఇంతవరకూ స్పందించలేదంటే పార్టీలో తన స్థానం, ప్రాధాన్యం ఏమిటో అర్ధం చేసుకుంటున్న అశోక్ భవిష్యత్‌పై ఆలోచనలో పడ్డారనేది బంగ్లా వేగుల మాట. ఏది ఏమైనా జిల్లాలో ఏమీ లేని టీడీపీ ఇప్పుడు ఇలా రెండు ముక్కలవ్వడం పార్టీ నేత లు తమ వర్గాలను బహిర్గతం చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యాలయం ఏర్పా టు చేయలేక స్థలపరిశీలనకే పరిమితమైన మీసాల గీత ఇ ప్పుడు కొత్త కుంపటి పెట్టుకుని మాత్రం సాధించేదేముంద ని అశోక్ వర్గం అంటుంటే, జిల్లా టీడీపీలో అశోక్‌గజపతి శ కం ముగింపునకు చేరినట్టేనని గీత వర్గం ప్రచారం చేస్తోంది. -
టీడీపీలో రాజుకుంటున్నటిక్కెట్ల చిచ్చు
సాక్షిప్రతినిధి, విజయనగరం: అందరూ ఊహించినట్టే టీడీపీలో టిక్కెట్ల చిచ్చు రాజుకుంటోంది. సిట్టింగ్‌లపై సొంత పార్టీలోనే తలెత్తిన అసంతృప్తిని పట్టించుకోని అధినేత వైఖరిపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇందరు వద్దంటున్నా... వారికే ఎలా టిక్కెట్లు కేటాయిస్తారంటూ భగ్గుమంటోంది. చీపురుపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే తనయుడికి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని ఆ నియోజకవర్గ అసమ్మతినేతలు శనివారం తమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఇంకా పార్వతీపురం... విజయనగరం... తదితర నియోజకవర్గాల్లోనూ ఆందోళనకు కేడర్ సిద్ధమవుతోంది. తెలుగుదేశం పార్టీలో సీట్ల ప్రకటన తర్వాత అసంతృప్తి జ్వాలలు మరింతగా రేగుతున్నాయి. నాలుగున్నరేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న టీడీపీలో అంతర్గత విభేదాలు ఎన్నికల నేపథ్యంలో బహిర్గతమయ్యాయి. టిక్కెట్ల కేటాయింపునకు ముందే తన్నుకున్న టీడీపీ నేతలు బెర్త్ కన్ఫమ్ అయిన తర్వాత కూడా శాంతించడం లేదు. చీపురుపల్లిలో మాజీ ఇన్చార్జ్ త్రిమూర్తులురాజు, ఎంపీపీ భర్త కామునాయుడు, జెడ్పీటీసీ వరహాలనాయుడు, జెడ్పీ వైస్ చైర్మన్ బలగం కృష్ణ, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు, మెరకముడిదాం మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి గోవింద్ ఏకంగా విలేకరుల సమావేశం పెట్టి మరీ తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అంతేనా... భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. పార్వతీపురంలో ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ తమ్ముడు, మాజీ కౌన్సిలర్ ద్వారపురెడ్డి శ్రీనివారావు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ వైఖరి ఏమిటో తెలపాలని ప్రశ్నించారు. తనను పార్టీ పట్టణ అధ్యక్షుడు సస్పెండ్ చేసినట్లు ప్రకటించి దాదాపు నెలరోజులు కావస్తున్నా తనకు సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వకపోవడంతో తాను పార్టీలో ఉన్నాననే భావిస్తున్నారా లేననుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఉన్నట్లైతే తనను పార్టీ కార్యక్రమాలకు ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. ఇక్కడ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి ఇప్పటికే పార్టీపై తన వ్యతిరేకతను బయటపెట్టారు. విజయనగరంలో అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అశోక్ గజపతిరాజుకు వ్యతిరేకంగా, సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతకు మద్దతుగా చర్చలు జరిపారు. అశోక్ గజపతి తన కుమార్తె అదితిని నిలబెడతానని ఏనాడూ ఎక్కడా టీడీపీ కేడర్‌తో చర్చించలేదని, ఇప్పుడు అకస్మాత్తుగా ఆమెను తెరపైకి ఎలా తెస్తారంటూ రగిలిపోయారు. బీసీలు అధికంగా ఉన్న నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీసీ సామాజిక వర్గానికి చెందిన గీతను కాదని అదితికి టిక్కెట్టు ఎలా ఇస్తారని, తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన నేతకే టిక్కెట్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావుకు టిక్కెట్టు లభించడంతో ఆయన తమ్ముడు బేబీనాయన తీవ్రంగా మనస్థాపం చెందారు. అన్నదమ్ముల మధ్య వైరం మరింతగా పెరిగి, వారి రాజకీయ భవిష్యత్‌పై ప్రభావం చూపే స్థాయికి వెళ్లింది. పార్టీ కోసం, అన్న కోసం ఇప్పటికే చేతి చమురు చాలానే వదిలించుకున్న బేబీ నాయన, తనకు చివరికి అప్పులే మిగిలాయని అన్నతో వాగ్వాదానికి దిగారు. దీంతో కుటుంబ పెద్దలు ఇరువురి మధ్య ఆర్ధిక సెటిల్మెంట్కు ప్రయత్నిస్తున్నారు. అది కూడా ఇంకా పూర్తికాకపోవడంతో బొబ్బిలి రాజుల కోటలో నిశ్శబ్దం అలముకుంది. మిగతా నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రస్తుతానికి అసమ్మతి నేతలు బయటపడలేదు. కానీ కురుపాం నియోజకవర్గం నుంచి తమ కుటుంబ సభ్యులకు టిక్కెట్టు ఆశించిన శత్రుచర్ల విజయరామరాజు, చంద్రశేఖరరాజు జనార్దన్ థాట్రాజ్‌కు ఏమాత్రం సహకరిస్తారనేది ప్రశ్నార్థకమే. సాలూరులో ఆర్పి భంజ్‌దేవ్ నాయకత్వాన్ని అక్కడి మహిళా నేత, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ఇప్పటికే వ్యతిరేకిస్తుండగా, ఆమె వర్గం నేతలు, కార్యకర్తలు భంజ్‌దేవ్ ఓటమికి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. గజపతినగరంలో కె.ఎ.నాయుడికి అతని అన్న రూపంలో అసమ్మతి వెంటాడుతూనే ఉంది. కోళ్ల లలిత కుమారితో కలిసినట్లు కనిపిస్తున్న శోభా హైమావతి, ఆమె కుమార్తె శోభా స్వాతిరాణికి టీడీపీ చేసిన అన్యాయం కారణంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఆ ప్రభావం కోళ్లపైనే పడనుంది. -
ఏడు సార్లు గెలిచినా టికెట్ ఇవ్వరా..!
సాక్షి, అమరావతి : టీడీపీలో టికెట్ల పంచాయతీ ఆ పార్టీ సీనియర్ నేతల్లో తీవ్ర అసహనానికి కారణమైంది. విజయనగరం జిల్లా టీడీపీలో టికెట్ల రగడ కొనసాగుతోంది. ప్రధానంగా బీసీ ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించే అంశాన్ని చంద్రబాబు కావాలనే పెండింగ్‌లో పెడుతున్నారని టీడీపీ సీనియర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు సీటు ఇవ్వకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. 80 ఏళ్ల వయస్సులో 5 రోజులుగా సీఎం ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నానని వాపోయారు. కనీసం తన వయస్సుని గౌరవించకుండా తిప్పించుకుంటున్నారని మండిపడ్డారు. నెల్లిమర్ల అసెంబ్లీ సీటును నారాయణస్వామికి ఇచ్చే అవకాశం ఉన్నా.. భోగాపురం ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, ఆనంద్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కడగల ఆనంద్‌కుమార్ అడ్డుపడుతున్నారనే ప్రచారం సాగుతోంది. పతివాడ తన కుమారుడు అప్పలనాయుడికి టికెట్టు ఆశిస్తున్నట్టు తెలిసింది. ఇక మరో బీసీ మహిళ ఎమ్మెల్యే మీసాల గీత టికెట్ కూడా పెండింగ్‌లోనే ఉన్నట్టు తెలిసింది. తొలి జాబితాలో అవినీతి ఆరోపణలు ఉన్న నేతలకు, రాజులకే అగ్రస్థానం ఇచ్చారని ఆమె ఆరోపించారు. కాగా, తన కుమార్తె అదితికి టికెట్ ఇప్పించుకునేందుకు గీతను ఎంపీ అశోక్ గజపతి రాజు టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గీత ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం శాసనసభా స్థానాన్నితన కుమార్తెకు ఇవ్వాలని అశోక్ పట్టుబడుతున్నట్టు సమాచారం. బీసీ మహిళకు ఒక్క సీటు కూడా ఇవ్వరా అని టీడీపీ తీరుపై బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నేనంటే... నేనే..
విజయనగరం నియోజకవర్గ అభ్యర్థిత్వం తెలుగుదేశం పార్టీలో కొత్త చికాకులు సృష్టిస్తోంది. సిటింగ్‌ను కాదంటే... మేమంటే మేమంటూ ఎవరికి వారే పలువురు నాయకులు యత్నాలు ముమ్మరం చేస్తుంటే... వీరి వ్యవహారం కుమార్తెను రంగంలోకి దించాలని యోచిస్తున్న అశోక్‌కు శిరోభారంగా మారుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ముఖాలు తెరపైకి వస్తూ గందరగోళానికి దారి తీస్తున్నారు. మొత్తమ్మీద మునిసిపల్ చైర్పర్సన్... కౌన్సిలర్... వంటివారు సైతం అభ్యర్థిత్వం కోసం పోటీపడటం చర్చనీయాంశమైంది. సాక్షిప్రతినిధి, విజయనగరం: అధికార తెలుగుదేశం పార్టీలో అభ్యర్థిత్వాల గోల గందరగోళంగా మారుతోంది. పార్టీ పరిస్థితి అందులోని నేతలకే అర్థం కాకుండా పోతోంది. విజయనగరం నియోజకవర్గంలో పార్టీ ఎవరికి ఎమ్మెల్యే టికెట్టు వస్తుందన్నది ఇంకా స్పష్టత లేకపోవడంతో రోజుకో కొత్త ముఖం వెలుగులోకి వస్తూ కొత్త వర్గాలు పురుడు పోసుకుంటున్నాయి. ఈ పరిస్థితి పార్టీకి ఉన్న ఆ కాస్త కేడర్‌ను అయోమయంలో పడేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌పై సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతతో పాటు మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ ఇప్పటికే ఆశలు పెట్టుకోగా తాజాగా ఈ రేసులోకి కౌన్సిలర్ కంది మురళీనాయుడు వచ్చి చేరారు. అయితే కేంద్ర మాజీ మంత్రి అశోక్ కూడా ఈ సారి ఎన్నికల్లో తన కుమార్తెను రంగంలోకి దించాలనుకుంటున్నారు. సిట్టింగ్‌ను మార్చాలన్న యోచనతోనే... గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయిపోయిన మీసాల గీతపై సహజంగానే నియోజకవర్గంలో వ్యతిరేకత వచ్చింది. అది కేవలం ప్రజలకే పరిమితం కాలేదు. పార్టీ నేతల్లోనూ అది గట్టిగా బలపడింది. తమ సమస్యలు వినేందుకుడానీ, కనీసం తమను కలిసేందుకుగానీ ఎమ్మెల్యే అవకాశం ఇవ్వరని, ఫోన్లలోనూ స్పందించరని ఆమెపై నెపం వేస్తూ దూరమవుతున్నారు. మరోవైపు విజయనగరం ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజును కాదని మీసాల గీత జిల్లా ఇన్చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గంలో చేరారు. ఈ వ్యవహారం ఆమెను అశోక్‌కు దూరం చేసింది. గంటా ద్వారా మళ్లీ విజయనగరం టిక్కెట్టు పదిలం చేసుకోవాలన్నది ఆమె ఆలోచన. అతిథికి ఆతిధ్యం లభించేనా... ఇక కేంద్ర మాజీ మంత్రి, విజయనగరం ఎంపీగా ఉన్న అశోక్‌గజపతిరాజు వ్యూహాలు ఆ పార్టీ పెద్దలకే అంతుబట్టకుండా ఉన్నాయి. తన కుమార్తె అతిథిని ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిలబెట్టాలని తన మనసులో ఉన్నా ఆ విషయాన్ని ఇంత వరకూ ఎప్పుడూ, ఎక్కడా బయటపెట్టలేదు. కానీ పట్టణంలో గీతకు వ్యతిరేకంగా తన కుమార్తెకు ప్రాధాన్యమిచ్చి సీఎం చంద్రబాబుకే అనుమానాలు రేకెత్తించారు. ఇటీవల సీఎం సభలకు, సమావేశాలకు కూడా డుమ్మాకొట్టి తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తీకరించారు. తన కుమార్తెకు టీడీపీ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్టు తెచ్చుకుని, తాను కేంద్ర నామినేటెడ్ పదవులకు లేదా, ఏదైనా రాష్ట్ర గవర్నర్ పదవికి వెళ్లిపోవాలనే ఆలోచనలో అశోక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టికెట్టు ఎవరికి వస్తుందనేదానిపై టీడీపీలో వారిలో వారే మల్లగుల్లాలుపడుతూ ఎవరికివారు వేరు కుంపట్లు పెట్టుకుంటున్నారు. నేనే సీనియర్ అంటున్న ప్రసాదుల మరోనేత మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ కూడా ఈసారి ఎమ్మెల్యే టికెట్టుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన భార్య కనకమహాలక్ష్మి రెండుసార్లు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ప్రస్తుతం రామకృష్ణ ఆ పదవిలో ఉన్నారు. ఈ లెక్కన గీత కంటే తానే సీనియర్‌నని ఆయన బాహాటంగా చెబుతున్నారు. అందుకే ఆమెను అడుగడుగునా వ్యతిరేకిస్తూ... ఆమెకు అన్నివేళలా దూరంగా ఉంటున్నారు. వీరి మధ్య వివాదం మరింత జటిలంగా మారుతోంది. ఇప్పుడు వీరి మధ్య 37వ వార్డు కౌన్సిలర్ కంది వెంకట మురళినాయుడు కొత్తగా చేరారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. టికెట్టు కోసం నేరుగా చంద్రబాబుకు దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. విజయనగరం పట్టణంలో గత ఎన్నికల్లో తూర్పుకాపు సామాజిక వర్గం నుంచి మీసాల గీత గెలవగా ఈ సారి ఆమెకు టిక్కెట్టు ఇవ్వరని ప్రచారం జరుగుతున్నందున అదే సామాజిక వర్గానికి చెందిన తన పేరును పరిశీలించాలని మురళి కోరుతున్నారు. అయితే సీనియర్లను కాదని మురళికి టిక్కెట్టు రావడం అంత సులభమేమీ కాదు. -
టీడీపీలో అసమ్మతి ‘గీత’ం...అనుమాన స్వరం
ఎక్కడైనా ప్రత్యర్థి పార్టీల మధ్య యుద్ధం సాగుతుంది. ఒకరి ఎత్తులకు మరొకరు పైఎత్తులు వేస్తూ పావులు కదుపుతారు. వ్యూహాలు రచిస్తారు. అయితే విజయనగరం టీడీపీలో దీనికి భిన్నంగా అంతర్యుద్ధం సాగుతోంది. టీడీపీ నేతలను ఆపార్టీ అభ్యర్థే నమ్మడంలేదు. అలాగే అభ్యర్థి సొంతపార్టీ నేతలను విశ్వసించడంలేదు. కాంగ్రెస్, గతంలో పీఆర్పీలో పనిచేసిన నేతలతో నజరానాల పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. దీంతో తమనే అనుమానిస్తారా అంటు తెలుగుతమ్ముళ్లు తెగ ఇదైపోతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : టీడీపీ శ్రేణులను ఆ పార్టీ అభ్యర్థి మీసాల గీత నమ్మడం లేదు. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న అనుమానంతో అడుగడుగునా నిఘా పెడుతున్నారు. తన రాకను వ్యతిరేకించి న టీడీపీ నాయకులందరిపైనా కన్నేసి ఉంచా రు.డబ్బు తీసుకుని ముఖం చాటేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. వారికిచ్చిన డబ్బు లు కింది స్థాయికి వెళ్లడం లేదని భావిస్తున్నారు. అభద్రతా భావంతో కాంగ్రెస్ శ్రేణులపైనే ఆశ లు పెట్టుకున్నారు. తనకున్న కాంగ్రెస్ సన్నిహితులు, ప్రజారాజ్యంలో తన వెంట ఉన్న నాయకుల ద్వారానే పంపకాలు చేపడుతున్నట్టు తెలి సింది. దీంతో పార్టీని దృష్టిలో ఉంచుకుని పనిచేస్తున్న టీడీపీ నాయకులంతా అంతర్మథనంలో పడ్డారు. మీసాల గీత టీడీపీలోకి రావడం ఆ పార్టీ నాయకులకు ఇష్టం లేదు. ఆమెకు అసెం బ్లీ టిక్కెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో చాలా మంది ఎన్నికల ప్రచారానికి దూరమయ్యారు. ఇంకొందరు మనసు చం పుకొని పనిచేస్తుండగా, మరికొందరు పార్టీని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నారు. అయితే, ఇప్పుడా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న నాయకులు కూడా డిఫెన్స్‌లో పడ్డారు. దీనికీ మీసాల గీత అపనమ్మకమే కారణంగా తెలుస్తోంది. విజయనగరంలో మునుపెన్నడూలేని విధంగా టీడీపీ అభ్యర్థి మీసాల గీత డబ్బు వెదజల్లుతున్నారు. విందులతో పాటు రకరకాల తాయిలాలతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణుల ద్వారా చేపడుతున్న పంపకాలు సక్రమంగా జరగడం లేదని భావిస్తున్నారు. పార్టీని దృష్టిలో పెట్టుకుని పని చేస్తున్న నాయకులు కూడా తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని గీత అనుమానం పడుతున్నారు. డబ్బులు తీసుకుని డ్రామాలాడేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇచ్చిన సొమ్ము క్షేత్రస్థాయిలో పంపిణీ చేయడం లేదని భావిస్తున్నారు. దీంతో సదరు టీడీపీ నాయకులపై నిఘా పెట్టారు. వారి వెంట తన వేగులను పంపిస్తున్నారు. లోపాయికారీగా ఏం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బులిచ్చారో లేదో అని చెక్ చేయిస్తున్నారు. దీంతో కొన్నిచోట్ల అనుమానించినట్టే జరగడంతో... టీడీపీ శ్రేణులను నమ్ముకుంటే సొమ్ము వృథా తప్ప ఫలితం ఉండదనే అభిప్రాయానికొచ్చినట్టు తెలిసింది. దీంతో కాంగ్రెస్‌లో తనకున్న సన్నిహితులు, ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు తన వెంట నడిచిన నాయకులను ఆశ్రయించినట్టు సమాచారం. వారి ద్వారానే డబ్బు పంపకాలకు శ్రీకారం చుట్టినట్టు తెలియవచ్చింది. దీంతో టీడీపీ శ్రేణులు ఇరకాటంలో పడ్డాయి. మనస్సు చంపుకొని పనిచేస్తుంటే తమపైనే అనుమానమా అని అంతర్మథనం చెందుతున్నాయి. పార్టీలోకి రానీవ్వడమే పెద్ద తప్పిదమని, ఏకు మేకై కూర్చొనట్టు దశాబ్ధాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులపైనే నిఘా పెడతారా అని ఓ వర్గం తెగ మథనపడుతోంది. ఇలాగైతే ఎన్నికల్లో పనిచేయలేమంటూ చేతులేత్తేస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా వినేది లేదని మొండికేసి కూర్చొన్నట్టు తెలుస్తోంది. డబ్బుతో ఏం చేసైనా ఎన్నికల్లో గట్టెక్కొచ్చనే అభిప్రాయంతో ఉన్న మీసాల గీతకు తాజా పరిణామాలు తీవ్ర ప్రతికూలంగా మారాయి. -
కాంగ్రెస్ పార్టీకి గీత రాజీనామా
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్ : విజయనగరం మున్సిపల్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మీసాల గీత పార్టీకి ఆదివారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని డీసీసీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామికి పంపించారు. చిరంజీవిపై అభిమానంతో ప్రజారాజ్యంలో చేరిన గీత తర్వాత చోటుచేసుకున్న పరిణామాల వల్ల కాంగ్రెస్‌లో కొనసాగారు. అయితే పార్టీలో చేరినప్పటి నుంచి తనను, వర్గీయులను పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.