ఎక్కడైనా ప్రత్యర్థి పార్టీల మధ్య యుద్ధం సాగుతుంది. ఒకరి ఎత్తులకు మరొకరు పైఎత్తులు వేస్తూ పావులు కదుపుతారు. వ్యూహాలు రచిస్తారు. అయితే విజయనగరం టీడీపీలో దీనికి భిన్నంగా అంతర్యుద్ధం సాగుతోంది. టీడీపీ నేతలను ఆపార్టీ అభ్యర్థే నమ్మడంలేదు. అలాగే అభ్యర్థి సొంతపార్టీ నేతలను విశ్వసించడంలేదు. కాంగ్రెస్, గతంలో పీఆర్‌పీలో పనిచేసిన నేతలతో నజరానాల పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. దీంతో తమనే అనుమానిస్తారా అంటు తెలుగుతమ్ముళ్లు తెగ ఇదైపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : టీడీపీ శ్రేణులను ఆ పార్టీ అభ్యర్థి మీసాల గీత నమ్మడం లేదు. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న అనుమానంతో అడుగడుగునా నిఘా పెడుతున్నారు. తన రాకను వ్యతిరేకించి న టీడీపీ నాయకులందరిపైనా కన్నేసి ఉంచా రు.డబ్బు తీసుకుని ముఖం చాటేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. వారికిచ్చిన డబ్బు లు కింది స్థాయికి వెళ్లడం లేదని భావిస్తున్నారు. అభద్రతా భావంతో కాంగ్రెస్ శ్రేణులపైనే ఆశ లు పెట్టుకున్నారు. తనకున్న కాంగ్రెస్ సన్నిహితులు, ప్రజారాజ్యంలో తన వెంట ఉన్న నాయకుల ద్వారానే పంపకాలు చేపడుతున్నట్టు తెలి సింది. దీంతో పార్టీని దృష్టిలో ఉంచుకుని పనిచేస్తున్న టీడీపీ నాయకులంతా అంతర్మథనంలో పడ్డారు. మీసాల గీత టీడీపీలోకి రావడం ఆ పార్టీ నాయకులకు ఇష్టం లేదు. ఆమెకు అసెం బ్లీ టిక్కెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో చాలా మంది ఎన్నికల ప్రచారానికి దూరమయ్యారు. ఇంకొందరు మనసు చం పుకొని పనిచేస్తుండగా, మరికొందరు పార్టీని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నారు. అయితే, ఇప్పుడా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న నాయకులు కూడా డిఫెన్స్‌లో పడ్డారు. దీనికీ మీసాల గీత అపనమ్మకమే కారణంగా తెలుస్తోంది.
విజయనగరంలో మునుపెన్నడూలేని విధంగా టీడీపీ అభ్యర్థి మీసాల గీత డబ్బు వెదజల్లుతున్నారు. విందులతో పాటు రకరకాల తాయిలాలతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణుల ద్వారా చేపడుతున్న పంపకాలు సక్రమంగా జరగడం లేదని భావిస్తున్నారు. పార్టీని దృష్టిలో పెట్టుకుని పని చేస్తున్న నాయకులు కూడా తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని గీత అనుమానం పడుతున్నారు. డబ్బులు తీసుకుని డ్రామాలాడేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇచ్చిన సొమ్ము క్షేత్రస్థాయిలో పంపిణీ చేయడం లేదని భావిస్తున్నారు. దీంతో సదరు టీడీపీ నాయకులపై నిఘా పెట్టారు. వారి వెంట తన వేగులను పంపిస్తున్నారు. లోపాయికారీగా ఏం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బులిచ్చారో లేదో అని చెక్ చేయిస్తున్నారు. దీంతో కొన్నిచోట్ల అనుమానించినట్టే జరగడంతో... టీడీపీ శ్రేణులను నమ్ముకుంటే సొమ్ము వృథా తప్ప ఫలితం ఉండదనే అభిప్రాయానికొచ్చినట్టు తెలిసింది.
దీంతో కాంగ్రెస్‌లో తనకున్న సన్నిహితులు, ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు తన వెంట నడిచిన నాయకులను ఆశ్రయించినట్టు సమాచారం. వారి ద్వారానే డబ్బు పంపకాలకు శ్రీకారం చుట్టినట్టు తెలియవచ్చింది. దీంతో టీడీపీ శ్రేణులు ఇరకాటంలో పడ్డాయి. మనస్సు చంపుకొని పనిచేస్తుంటే తమపైనే అనుమానమా అని అంతర్మథనం చెందుతున్నాయి. పార్టీలోకి రానీవ్వడమే పెద్ద తప్పిదమని, ఏకు మేకై కూర్చొనట్టు దశాబ్ధాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులపైనే నిఘా పెడతారా అని ఓ వర్గం తెగ మథనపడుతోంది. ఇలాగైతే ఎన్నికల్లో పనిచేయలేమంటూ చేతులేత్తేస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా వినేది లేదని మొండికేసి కూర్చొన్నట్టు తెలుస్తోంది. డబ్బుతో ఏం చేసైనా ఎన్నికల్లో గట్టెక్కొచ్చనే అభిప్రాయంతో ఉన్న మీసాల గీతకు తాజా పరిణామాలు తీవ్ర ప్రతికూలంగా మారాయి.
టీడీపీలో అసమ్మతి ‘గీత’ం...అనుమాన స్వరం
Published Sat, May 3 2014 2:31 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement