విజయనగరం నియోజకవర్గ అభ్యర్థిత్వం తెలుగుదేశం పార్టీలో కొత్త చికాకులు సృష్టిస్తోంది. సిటింగ్‌ను కాదంటే... మేమంటే మేమంటూ ఎవరికి వారే పలువురు నాయకులు యత్నాలు ముమ్మరం చేస్తుంటే... వీరి వ్యవహారం కుమార్తెను రంగంలోకి దించాలని యోచిస్తున్న అశోక్‌కు శిరోభారంగా మారుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ముఖాలు తెరపైకి వస్తూ గందరగోళానికి దారి తీస్తున్నారు. మొత్తమ్మీద మునిసిపల్ చైర్‌పర్సన్... కౌన్సిలర్... వంటివారు సైతం అభ్యర్థిత్వం కోసం పోటీపడటం చర్చనీయాంశమైంది.
సాక్షిప్రతినిధి, విజయనగరం: అధికార తెలుగుదేశం పార్టీలో అభ్యర్థిత్వాల గోల గందరగోళంగా మారుతోంది. పార్టీ పరిస్థితి అందులోని నేతలకే అర్థం కాకుండా పోతోంది. విజయనగరం నియోజకవర్గంలో పార్టీ ఎవరికి ఎమ్మెల్యే టికెట్టు వస్తుందన్నది ఇంకా స్పష్టత లేకపోవడంతో రోజుకో కొత్త ముఖం వెలుగులోకి వస్తూ కొత్త వర్గాలు పురుడు పోసుకుంటున్నాయి. ఈ పరిస్థితి పార్టీకి ఉన్న ఆ కాస్త కేడర్‌ను అయోమయంలో పడేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌పై సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతతో పాటు మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ ఇప్పటికే ఆశలు పెట్టుకోగా తాజాగా ఈ రేసులోకి కౌన్సిలర్ కంది మురళీనాయుడు వచ్చి చేరారు. అయితే కేంద్ర మాజీ మంత్రి అశోక్ కూడా ఈ సారి ఎన్నికల్లో తన కుమార్తెను రంగంలోకి దించాలనుకుంటున్నారు.
సిట్టింగ్‌ను మార్చాలన్న యోచనతోనే...
గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయిపోయిన మీసాల గీతపై సహజంగానే నియోజకవర్గంలో వ్యతిరేకత వచ్చింది. అది కేవలం ప్రజలకే పరిమితం కాలేదు. పార్టీ నేతల్లోనూ అది గట్టిగా బలపడింది. తమ సమస్యలు వినేందుకుడానీ, కనీసం తమను కలిసేందుకుగానీ ఎమ్మెల్యే అవకాశం ఇవ్వరని, ఫోన్లలోనూ స్పందించరని ఆమెపై నెపం వేస్తూ దూరమవుతున్నారు. మరోవైపు విజయనగరం ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజును కాదని మీసాల గీత జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గంలో చేరారు. ఈ వ్యవహారం ఆమెను అశోక్‌కు దూరం చేసింది. గంటా ద్వారా మళ్లీ విజయనగరం టిక్కెట్టు పదిలం చేసుకోవాలన్నది ఆమె ఆలోచన.
అతిథికి ఆతిధ్యం లభించేనా...
ఇక కేంద్ర మాజీ మంత్రి, విజయనగరం ఎంపీగా ఉన్న అశోక్‌గజపతిరాజు వ్యూహాలు ఆ పార్టీ పెద్దలకే అంతుబట్టకుండా ఉన్నాయి. తన కుమార్తె అతిథిని ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిలబెట్టాలని తన మనసులో ఉన్నా ఆ విషయాన్ని ఇంత వరకూ ఎప్పుడూ, ఎక్కడా బయటపెట్టలేదు. కానీ పట్టణంలో గీతకు వ్యతిరేకంగా తన కుమార్తెకు ప్రాధాన్యమిచ్చి సీఎం చంద్రబాబుకే అనుమానాలు రేకెత్తించారు. ఇటీవల సీఎం సభలకు, సమావేశాలకు కూడా డుమ్మాకొట్టి తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తీకరించారు. తన కుమార్తెకు టీడీపీ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్టు తెచ్చుకుని, తాను కేంద్ర నామినేటెడ్ పదవులకు లేదా, ఏదైనా రాష్ట్ర గవర్నర్ పదవికి వెళ్లిపోవాలనే ఆలోచనలో అశోక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టికెట్టు ఎవరికి వస్తుందనేదానిపై టీడీపీలో వారిలో వారే మల్లగుల్లాలుపడుతూ ఎవరికివారు వేరు కుంపట్లు పెట్టుకుంటున్నారు.
నేనే సీనియర్ అంటున్న ప్రసాదుల
మరోనేత మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ కూడా ఈసారి ఎమ్మెల్యే టికెట్టుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన భార్య కనకమహాలక్ష్మి రెండుసార్లు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ప్రస్తుతం రామకృష్ణ ఆ పదవిలో ఉన్నారు. ఈ లెక్కన గీత కంటే తానే సీనియర్‌నని ఆయన బాహాటంగా చెబుతున్నారు. అందుకే ఆమెను అడుగడుగునా వ్యతిరేకిస్తూ... ఆమెకు అన్నివేళలా దూరంగా ఉంటున్నారు. వీరి మధ్య వివాదం మరింత జటిలంగా మారుతోంది. ఇప్పుడు వీరి మధ్య 37వ వార్డు కౌన్సిలర్ కంది వెంకట మురళినాయుడు కొత్తగా చేరారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. టికెట్టు కోసం నేరుగా చంద్రబాబుకు దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. విజయనగరం పట్టణంలో గత ఎన్నికల్లో తూర్పుకాపు సామాజిక వర్గం నుంచి మీసాల గీత గెలవగా ఈ సారి ఆమెకు టిక్కెట్టు ఇవ్వరని ప్రచారం జరుగుతున్నందున అదే సామాజిక వర్గానికి చెందిన తన పేరును పరిశీలించాలని మురళి కోరుతున్నారు. అయితే సీనియర్లను కాదని మురళికి టిక్కెట్టు రావడం అంత సులభమేమీ కాదు.
Comments
Please login to add a commentAdd a comment