జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ రెండు ముక్కలైంది. ఎప్పటినుంచో అంతర్గతంగా ఉన్న విభేదాలు మరోసారి వెలుగు చూశాయి. తరతరాల రాచరిక పెత్తనానికి చరమగీతం పాడుతూ మహిళా నేత తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. విజయనగరంలో కొత్తగా టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇన్నాళ్లుగా రాజుగారి బంగ్లాలోనే పెద్దాయన కనుసన్నల్లో సాగుతున్న పార్టీ కార్యకలాపాలకు చెక్‌పెట్టారు.
సాక్షి, విజయనగరం: జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గడ్డు పరిస్థితులు మొదలై చాలా కాలమైంది. 2019 ఎన్నికల ముందు ఆ పార్టీకి జిల్లాలో ఏడుగురు శాసన సభ్యులుండేవారు. వీరిలో బొబ్బిలి రాజు రాష్ట్ర మంత్రిగా ఉండగా, కేంద్ర మంత్రిగా అశోక్‌గజపతిరాజు కొనసాగారు. అప్పుడు మహంతి చిన్నంనాయుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసే వారు. జిల్లాకే కాదు రాష్ట్ర టీడీపీకి కూడా అశోక్ గజపతే పెద్దదిక్కుగా భావించేవారు. జిల్లా పార్టీ మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడిచేది. ఆయన మాత్రం జిల్లాలో ఏ కార్యక్రమాన్ని నిర్వహించేవారు కాదు. పార్టీ కార్యక్రమాలకు కూడా వచ్చే వారు కాదు. పూర్తిగా ఢిల్లీ లేదా బంగ్లాకు పరిమితమైపోయేవారు. అదే సమయంలో ఆయన కుమార్తె అదితి గజపతి రంగంలోకి దిగారు.
విజయనగరంలో ఏర్పాటైన కొత్త కార్యాలయం
పార్టీ కేడర్‌కు అడపాదడపా దర్శనమిస్తూ, అప్పుడప్పుడు కార్యక్రమాల్లో మెరిసేవారు. అప్పుడు విజ యనగరం ఎమ్మెల్యేగా మీసాల గీత ఉన్నారు. పేరుకి ఆమె ఎమ్మెల్యేగానీ, నియోజకవర్గంలో ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా చేయాలని అశోక్, అదితి ప్రయత్నించారు. అదే సమయంలో విశాఖపట్నానికి చెందిన అప్పటి రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుకు జిల్లాను చక్కబెట్టే బాధ్య తలు అప్పగించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అప్పుడే అశోక్ పతనం అధికారికంగా మొదలైందని చెప్పవచ్చు.
గంటా ప్రవేశంతో పార్టీలో ముసలం
జిల్లాలో గంటా శ్రీనివాసరావు పెత్తనం మొదలైన తరువాత మీసాలగీత, గజపతినగరం అప్పటి ఎమ్మెల్యే కె.ఎ.నాయు డు వంటి వారు గంటా పంచన చేరారు. వీరంతా ఒక వర్గంగా ఏర్పడ్డారు. ఈ విషయాన్ని అధినేత వద్ద చూపించుకుని గత ఎన్నికల్లో మీసాల గీతకు పార్టీ టిక్కెట్టు రాకుండా చేశా రు అశోక్. ఆమె స్థానంలో తన కుమార్తె అదితి గజపతిని పార్టీ తరఫున ఎన్నికల బరిలో దింపారు. బీసీ మహిళకు వెన్నుపోటు పొడిచి తెచ్చుకున్న టిక్కెట్టుతో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ముందు నిలవలేక, కుమార్తెను గెలిపించుకోలేక, ఎంపీగా తానూ విజయం సాధించలేక ఘోర పరాజ యం పాలయ్యారు. అంతే కాదు అశోక్ పెద్దదిక్కుగా ఉన్న జిల్లాలో టీడీపీకి ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా రాకుండా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అయినా దానికి ఆయన ఏమాత్రం బాధపడలేదు. నైతిక బాధ్యత వహించి పార్టీ నుంచి తప్పుకోలేదు. పైపెచ్చు ఇటీవల జరిగిన పార్టీ నియామకాల్లో తన కుమార్తె అదితి గజపతికి విజయనగరం నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు ఇప్పించుకున్నారు.
రాచరిక పెత్తనానికి చరమ‘గీతం’
జిల్లా టీడీపీ సమావేశాలు, పత్రికా సమావేశాలను అశోక్ గజపతి బంగ్లా ఆవరణలోని చెట్టుకిందే నిర్వహించడమేది ఎప్పటి నుంచో కొనసాగుతోంది. కానీ ఈ సమావేశాలకు గానీ, పార్టీ కార్యక్రమాలకు గానీ తనకు ఎలాంటి సమాచా రం లేకపోవడంతో, ఎన్నికల ముందు నుంచీ జరుగుతున్న పరిణామాలకు మనస్తాపంతో ఉన్న మీసాలగీత టీడీపీకి మరో కార్యాలయం అవసరమనే నిర్ణయానికి వచ్చారు. ఆమెకు మొదటి నుంచీ తోడుగా ఉన్న కె.ఎ.నాయుడు, మరికొంత మంది జిల్లా నేతలు మద్దతు పలికారు. అంతే విజయనగరంలో కె.ఎ.నాయుడుకు చెందిన భవనంలోనే కొత్త కార్యాలయాన్ని బుధవారం తెరిచారు. ఊహించని ఈ హఠా త్ పరిణామానికి అశోక్ గజపతి షాక్‌కు గురయ్యారు. టీడీపీ ని అస్థిరపరచాలనే ఉద్దేశంతో అధికారపార్టీ నేతలే మీసాల గీతతో వేరు కుంపటి పెట్టించారని ఆయన ఆరోపించారు. కానీ గీత మాత్రం తరతరాల రాచరిక పెత్తనానికి చరమగీతం పాడేందుకే తాను పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించానని చెబుతున్నారు.
వ్యూహం పెద్దదే...
అశోక్‌కుగానీ, విజయనగరం నియోజకవర్గ ఇన్చార్జ్‌గా ఉన్న అదితి జగపతికి గానీ, విజయనగరం పార్లమెంటరీ జిల్లా ఇన్చార్జ్‌గా ఇటీవలే నియమితులైన కిమిడి నాగార్జునకుగానీ చెప్పకుండా, వారిని ఆహ్వానించకుండా స్వతంత్రంగా నిర్ణ యం తీసుకుని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారంటే దీనివెనుక భారీ వ్యూహాలే ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నా యి. మరోవైపు ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఇంతవరకూ స్పందించలేదంటే పార్టీలో తన స్థానం, ప్రాధాన్యం ఏమిటో అర్ధం చేసుకుంటున్న అశోక్ భవిష్యత్‌పై ఆలోచనలో పడ్డారనేది బంగ్లా వేగుల మాట. ఏది ఏమైనా జిల్లాలో ఏమీ లేని టీడీపీ ఇప్పుడు ఇలా రెండు ముక్కలవ్వడం పార్టీ నేత లు తమ వర్గాలను బహిర్గతం చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యాలయం ఏర్పా టు చేయలేక స్థలపరిశీలనకే పరిమితమైన మీసాల గీత ఇ ప్పుడు కొత్త కుంపటి పెట్టుకుని మాత్రం సాధించేదేముంద ని అశోక్ వర్గం అంటుంటే, జిల్లా టీడీపీలో అశోక్‌గజపతి శ కం ముగింపునకు చేరినట్టేనని గీత వర్గం ప్రచారం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment