ఆ రాజుగారి గతం ఎంతో ఘనం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన రాజుగారి ప్రస్తుత పరిస్థితి దయనీయంగా మారింది. ఆయన ప్రభ మసకబారింది. పదవుల్లో ఉన్నపుడు రూల్స్ గురించి చెప్పారు. ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు తనను పట్టించుకోవడంలేదని బాధపడుతున్నారు.
విజయనగరం జిల్లా తెలుగుదేశంలో ఒకప్పుడు పూసపాటి అశోకగజపతి రాజు చెప్పిందే వేదం. జిల్లా నాయకులు, కేడర్ అంతా రాజుగారిని కలసి వెళ్ళేందుకు పడిగాపులు కాసేవారు. అంతటి మోస్ట్ పవర్ ఫుల్ పొలిటీషియన్‌గా ఆయన వెలిగారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో 40ఏళ్ల పాటు పదవులు నిర్వహించినా... ఒంటినిండా రాజరికపు దర్పం మాత్రం కొనసాగుతోంది. రాజావారి నియంత్రత్వ పోకడలు ఇన్నాళ్లూ ఎలాగో గడిచిపోయాయి. ఇంతకాలం హీరో అనిపించుకున్న ఈయన్ను ఇప్పుడు టిడిపి ఢమాల్న కింద పడేసి జీరోని చేసిందని తెగ ఫీల్ అయిపోతున్నారు.
ఇటీవల మంగళగిరి పార్టీ ఆఫీసులో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో తనను జిల్లా నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదని, సపోర్ట్ చేయడం లేదని చంద్రబాబు ఎదుట గగ్గోలు పెట్టారు. జిల్లాలో టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జిలు, సీనియర్ నాయకులు సొంతూరు విజయనగరంకు చెందిన మీసాల గీతతో సహా జిల్లాలోని ఏ నియోజకవర్గానికి చెందిన నాయకులూ అశోక్‌గజపతి రాజుకు విలువ ఇవ్వడంలేదని అర్థమవుతోంది. అధికార పదవుల్లో ఉన్నపుడు తన అధికార దర్పాన్ని చూపించడం తప్ప ఏనాడూ అక్కడి నాయకులు, కార్యకర్తలను రాజుగారు పట్టించుకోలేదు.
రాష్ట్ర పదవుల్లో ఉన్నపుడు గాని..కేంద్రమంత్రిగా ఉన్నపుడు గాని తెలుగుదేశం పార్టీ రాజకీయాలను తన తోట బంగ్లా లోపలే కట్టిపడేసారు. నాయకులు, కార్యకర్తలతో అశోక్ వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబుకు చెప్పినా ఆయనా ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇప్పుడు రాజుగారికి గౌరవం ఇవ్వండని...పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినా కేడర్ పట్టించుకునే పరిస్థితి లేదు. పలు వివాదాల్లో చిక్కుకుని, పోలీసు కేసులు, కోర్టు కేసుల్లో ఇరుక్కున్నా, జిల్లా నాయకుల్లో ఎవరూ అశోక్ పట్ల కనీస సానుభూతి చూపించడం లేదు. దీంతో ఒక నాయకుడికి కార్యకర్తల అవసరం ఎంతఉంటుందో... అశోక్ గజపతి రాజుకు తొలిసారి అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది.
పదవుల్లో ఉన్నపుడు జిల్లా నాయకులు, కార్యకర్తలకు తాను ఇచ్చిందే.. వారు ఇప్పుడు తనకు తిరిగి ఇస్తున్నారని ఆయనకు అర్థమవుతోంది. అధికారం పోయి.. పరువు పోగొట్టుకుని బంగ్లా గేటు బయటకు వచ్చి నాపై సానుభూతి చూపించండయ్యా అని అందరినీ వేడుకోవాల్సి వస్తుంది. కానీ కేడర్ మాత్రం ఆయన పట్ల కనికరం చూపించే పరిస్థితి కనిపించడం లేదు. అశోక్ గజపతి రాజు అవుట్ డేటెడ్ పోలిటిక్స్ ఇప్పటి కాలంలో చెల్లుబాటు కావని జిల్లాలో టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment